గుంటూరు - సికింద్రాబాద్‌ మధ్యన నాన్‌స్టాప్‌ రైళ్లు

ABN , First Publish Date - 2022-07-04T06:01:44+05:30 IST

గుంటూరు - సికింద్రాబాద్‌ మధ్యన పలు రైళ్లు నాన్‌స్టాప్‌గా మారిపోయాయి.

గుంటూరు - సికింద్రాబాద్‌ మధ్యన   నాన్‌స్టాప్‌ రైళ్లు

పలు స్టేషన్లలో స్టాప్‌లు రద్దుచేసిన రైల్వే బోర్డు

ప్రయాణికుల ఆదరణ లేకపోవటమే కారణమంటున్న అధికారులు


గుంటూరు, జూలై 3 (ఆంధ్రజ్యోతి): గుంటూరు - సికింద్రాబాద్‌ మధ్యన పలు రైళ్లు నాన్‌స్టాప్‌గా మారిపోయాయి. గతంలో ఆయా రైళ్లకు సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ రైల్వేస్టేషన్లలో కనీసం మూడు, నాలుగు నిలుపుదలలు ఉండేవి. రైల్వేబోర్డు చేసిన సవరింపుల స్థాయిలో ఆయా రైల్వేస్టేషన్ల నుంచి ప్రయాణీకుల ఆదరణ లేకపోవడంతో క్రమేపి ఒక్కో రైలుకు నిలుపుదల సౌకర్యం తొలగిస్తూ వచ్చారు. మొదట్లో ఒక్క విజయవాడ - లింగంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కి మాత్రమే గుంటూరు - సికింద్రాబాద్‌ మధ్యన నాన్‌స్టాప్‌ ఉన్నది. ఇటీవలకాలంలో నాన్‌స్టాపింగ్‌ రైళ్ల సంఖ్య ఎనిమిదికి చేరింది. గుంటూరులో బయలుదేరిన రైళ్లు మార్గమధ్యలో ఎక్కడా ఆగకుండా సికింద్రాబాద్‌కు చేరుతోన్నాయి. అలానే సికింద్రాబాద్‌ వైపు నుంచి వచ్చేటప్పుడు కొన్ని రైళ్లు నాన్‌స్టాప్‌గా గుంటూరుకు వస్తోన్నాయి. 


నెంబరు. 22203 విశాఖపట్టణం - సికింద్రాబాద్‌ దురొంతో ఎక్స్‌ప్రెస్‌ ఇది గుంటూరులో బయలుదేరితే సికింద్రాబాద్‌ వరకు ఎలాంటి నిలుపుదల లేదు. అలానే నెంబరు. 17255 నరసపూర్‌ - లింగంపల్లి, నెంబరు. 12603 చెన్నై సెంట్రల్‌ - హైదరాబాద్‌, నెంబరు. 17016 భువనేశ్వర్‌ - సికింద్రాబాద్‌ విశాఖ, నెంబరు. 12782 విశాఖపట్టణం - సికింద్రాబాద్‌ ఏసీ సూపర్‌ఫాస్టు, నెంబరు. 12514 గువహటి - సికింద్రాబాద్‌, నెంబరు. 12795 విజయవాడ - లింగంపల్లి రైళ్లకు మార్గమధ్యలో ఎలాంటి నిలుపుదల లేదు. ఈ రైళ్లలో సికింద్రాబాద్‌ వెళ్లాలంటే కచ్ఛితంగా గుంటూరుకు రావాల్సిందే. నాన్‌స్టాప్‌ సౌకర్యం వలన కొన్ని రైళ్లకు ప్రయాణ సమయం బాగా తగ్గింది. కాగా సికింద్రాబాద్‌ వైపు నుంచి గుంటూరు వచ్చేటప్పుడు నాన్‌స్టాప్‌ సౌకర్యం కొన్ని రైళ్లకే ఇచ్చారు. నెంబరు. 12796 లింగంపల్లి - విజయవాడ రైలుకు సికింద్రాబాద్‌ నుంచి గుంటూరు మధ్యన ఎలాంటి నిలుపుదల లేదు. అలానే నెంబరు. 22204 సికింద్రాబాద్‌-విశాఖపట్టణం దురంతో ఎక్స్‌ప్రెస్‌. ఈరైలు ప్రయాణ సమయం కూడా తక్కువే. శనివారం రాత్రి 8.15 గంటలకు బయలుదేరి 11.53కి గుంటూరు వస్తుంది. సికింద్రాబాద్‌ - విశాఖపట్టణం ఏసీ సూపర్‌ ఫాస్టు ఎక్స్‌ప్రెస్‌ కూడా శనివారం రాత్రి 9.35కి బయలుదేరి గుంటూరుకు అర్ధరాత్రి దాటాక 2.10కి వస్తుంది. నాగర్‌సోల్‌ - నరసపూర్‌ ఎక్స్‌ప్రెస్‌కి కూడా సికింద్రాబాద్‌ - గుంటూరు మధ్యన నిలుపుదల లేదు. గువహటి, అగర్తలకు వారానికి ఒకసారి వెళ్లే రైళ్లు కూడా సికింద్రాబాద్‌ - గుంటూరు మధ్యన నాన్‌స్టాప్‌గా వస్తోన్నాయి. 


Updated Date - 2022-07-04T06:01:44+05:30 IST