పండుగ రైళ్లు వస్తున్నాయ్‌...

ABN , First Publish Date - 2020-09-27T07:46:54+05:30 IST

అన్‌లాక్‌ 0.4లో భాగంగా రైల్వేశాఖ ఈ నెల 12 నుంచి కొత్తగా 80 ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టింది. తాజాగా దసరా, దీపావళి, క్రిస్మస్‌, సంక్రాంతి పండుగులకు ప్రతి ఏటా ఉండే రద్దీని....

పండుగ రైళ్లు వస్తున్నాయ్‌...

పండుగ రద్దీకి స్పెషల్‌ రైళ్లు నడిపేందుకు రైల్వే సన్నాహాలు 

ప్రతిపాదనలో నరసాపూర్‌, సర్కార్‌, శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లు


నరసాపురం, సెప్టెంబరు: అన్‌లాక్‌ 0.4లో భాగంగా రైల్వేశాఖ ఈ నెల 12 నుంచి కొత్తగా  80 ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టింది. తాజాగా దసరా, దీపావళి, క్రిస్మస్‌, సంక్రాంతి పండుగులకు ప్రతి ఏటా ఉండే రద్దీని పరిగణనలోకి తీసుకొని  కొత్తగా మరి కొన్ని రైళ్లను పట్టాలెక్కించేందుకు సిద్ధం అవుతుంది. ఈనేపథ్యంలో జిల్లా మీదుగా ఏఏ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తాయన్నది  ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది మార్చి 22 నుంచి లాక్‌డౌన్‌ కారణంగా రైళ్లు నిలిచిపోయాయి. అయితే జూన్‌ నెలలో లాక్‌ డౌన్‌ సడలింపులో 100 రైళ్ళకు అనుమతినిచ్చారు. ఇందులో జిల్లా మీదుగా హైదరాబాద్‌- విశాఖ, ముంబాయి- భువనేశ్వర్‌, సికింద్రాబాద్‌- హౌరా, విశాఖ- న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. తాజాగా ఈ నెల 12 నుంచి మరికొన్ని రైళ్లకు అనుమతినిచ్చినా, వాటిలో  జిల్లా మీదుగా ఒక్క రైలుకు మాత్రమే హాల్ట్‌ దక్కింది.


తిరువనంత పురం నుంచి హౌరా వెళ్లే స్పెషల్‌ రైలుకు ఏలూరులో హాల్ట్‌ ఇచ్చారు. ఇది కాకుండా మరో మూడు రైళ్లు జిల్లా మీదుగా వెళుతున్నా అవి ఏ స్టేషన్‌లోనూ ఆగడంలేదు.  ఇక లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి డెల్టా మీదుగా ఒక్కరైలు కూడా వెళ్ళడంలేదు. ఇప్పటి వరకు ప్రకటించిన రైళ్లన్నీ జిల్లాలో మెయిన్‌లైన్‌ గుండా వెళుతున్నాయి. ఈ కారణంగా డెల్టా ప్రాంతం నుంచి ఇతర రాష్ర్టాలకు వెళ్లాలంటే ఏలూరు వెళ్లాల్సి వస్తుంది. దీని వల్ల ప్రయాణికులు  ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో ప్రజాప్రతినిధులు మీద ఒత్తిళ్ళు పెరిగాయి.. ఇప్పటికే ఎంపీలు రైల్వే ఉన్నతా ధికారులతో దీనిపై చర్చించారు. స్థానిక డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని నరసాపురం- హైదరాబాద్‌, కాకినాడ- చెన్నై సర్కార్‌, కాకినాడ-బెంగళూరు శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళను నడపాలని  ప్రతిపాదించారు. అయితే గత మూడు నెలల నుంచి కరోనా విజృంభి స్తున్నందున్న ఇటు రైల్వే కూడా కొత్త రైళ్ళను నడిపే ందుకు సాహసించలేదు. అయితే ఇప్పుడు కేంద్రం చాలా వాటికి వెలుసుబాటు కల్పించింది. 


ఈ నేపథ్యంలో దసరా, దీపావళి, క్రిస్మస్‌ రద్దీకి ప్రకటించే ప్రత్యేక రైళ్లలో డెల్టా మీదుగా వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లకు చోటు దక్కుతుందన్న ఆశ  ప్రయాణికుల్లో నెలకొ న్నది. అయితే ఇంత వరకు రైల్వే బోర్డు నుంచి ఎటువంటి  ప్రకటన వెలువడ లేదు.  ఈ నేపథ్యంలో  ఏఏ ఎక్స్‌ప్రెస్‌లకు పచ్చ జెండా ఊపుతారన్న దానిపై సస్పెన్స్‌ నెలకొన్నది.

Updated Date - 2020-09-27T07:46:54+05:30 IST