రాత్రివేళ రైలు ప్రయాణం లేనట్లేనా!

ABN , First Publish Date - 2021-10-25T05:07:58+05:30 IST

పల్నాడు ప్రాంత ప్రజలకు రాత్రివేళ రైలు ప్రయాణం దాదాపుగా కనుమరుగైంది.

రాత్రివేళ రైలు ప్రయాణం లేనట్లేనా!

ఒక్క నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌కి మాత్రమే సత్తెనపల్లిలో నిలుపుదల

మిగతా రైళ్లన్నీ గుంటూరు - సికింద్రాబాద్‌ మధ్యన నాన్‌స్టాప్‌

సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి రైల్వేస్టేషన్లు నిర్మానుష్యం

గుంటూరు, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): పల్నాడు ప్రాంత ప్రజలకు రాత్రివేళ రైలు ప్రయాణం దాదాపుగా కనుమరుగైంది. గతంలో పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి రైల్వేస్టేషన్లలో హాల్టింగ్‌లు ఉండటంతో అక్కడి ప్రజలు హైదరాబాద్‌కు సులువుగా ప్రయాణించేవారు. ఇప్పుడు ఒక్క నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ అది కూడా సత్తెనపల్లిలో మాత్రమే నిలుపుదల ఉంది.  మధ్యాహ్నం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ వెళ్లిపోయిన తర్వాత మరే ఇతర రైలు ఆయా స్టేషన్లలో ఆగకపోతుండటంతో ప్రయాణీకులు గత్యంతరం లేని పరిస్థితుల్లో రోడ్డు రవాణాని ఆశ్రయించాల్సి వస్తోంది. కేరళ రాష్ట్రంలో ప్రతీ 10 కిలోమీటర్ల దూరంలో ఉండే రైల్వేస్టేషన్లలో సూపర్‌ఫాస్టు ఎక్స్‌ప్రెస్‌లని కూడా హాల్టింగ్‌ చేస్తారు. అలాంటిది ఇక్కడ ఎత్తేయడంపై ప్రయాణీకులు తీవ్ర ఆవేదన చెందుతోన్నారు. జీరో బేస్డ్‌ టైంటేబుల్‌ పల్నాడు ప్రాంత రైలు ప్రయాణీకులకు శాపంగా పరిణమించింది. దశాబ్ధాల తరబడి తమ ప్రాంత రైల్వేస్టేషన్లలో ఆగి వెళ్లే రైళ్లకు నిలుపుదల ఎత్తేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా కొత్త హాల్టింగ్‌లు ఇవ్వాల్సిందిపోయి ఉన్నవి తొలగించడాన్ని వారు తప్పుబడుతున్నారు. వీక్లీ, బైవీక్లీ రైళ్లు తీసేస్తే గతంలో నరసాపూర్‌, చెన్నై, నారాయణాద్రి, డెల్టా, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లు సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడిలో ఆగేవి. దాంతో రాత్రిళ్లు ఆయా రైళ్లు ఎక్కి మరుసటి రోజు ఉదయానికి సికింద్రాబాద్‌ చేరుకొనేవారు. కరోనాసమయంలో అమలులోకి వచ్చిన జీరోబేస్డ్‌ టైంటేబుల్‌ ఆయా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు నిలుపుదల సౌకర్యాన్ని తొలగించింది. ఇందుకు ఆయా రైల్వేస్టేషన్ల నుంచి కనీసం 50 టిక్కెట్‌లు కూడా బుకింగ్‌ కావడం లేదన్నది ప్రధాన సాకుగా చూపిస్తోన్నారు. గతంలో లేని నిబంధన ఇప్పుడెందుకు తీసుకొచ్చారని పల్నాడు ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ద్వారా రైల్వే జీఎంకి కూడా నివేదించారు. అయినప్పటికీ ఎలాంటి మార్పులు జరగలేదు. రైళ్లు ఆగకపోతుండటంతో రాత్రి అయితే ఆయా స్టేషన్లు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. కాగా నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌కి సత్తెనపల్లిలో ఏ విధంగా అయితే హాల్టింగ్‌ కల్పించారో అదే రీతిన నరసాపూర్‌, చెన్నై, విశాఖ, డెల్టా ఎక్స్‌ప్రెస్‌లకు పిడుగురాళ్ల/నడికుడిలో నిలుపుదల సౌకర్యాం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. అలానే విజయవాడ - లింగంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కి కూడా నడికుడిలో హాల్టింగ్‌ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీని వలన సాయంత్రం వేళ సికింద్రాబాద్‌కు వెళ్లేవారికి ఉపయోగకరంగా ఉంటుంది. అయినప్పటికీ డివిజన్‌ అధికారులు హాల్టింగ్‌లకు జస్టిఫికేషన్‌ ఇవ్వలేకపోతోన్నారు. రైల్వేబోర్డు స్థాయిలో ఎంపీలు నివేదిస్తే కొంత స్పందన ఉండొచ్చన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. లేకుంటే భవిష్యత్తులో ఆయా రైల్వేస్టేషన్లను శాశ్వతంగా మూసేసే ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చే ప్రమాదం లేకపోలేదు. 

Updated Date - 2021-10-25T05:07:58+05:30 IST