Dasara: మీది గుంటూరు జిల్లానా.. దసరాకి సొంతూరు వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే..!

ABN , First Publish Date - 2022-09-20T02:58:23+05:30 IST

దసరా పండగ సెలవులు మరికొద్ది రోజుల్లోనే రానున్నాయి. సికింద్రాబాద్‌, బెంగళూరు, చెన్నై, విశాఖపట్టణం తదితర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు..

Dasara: మీది గుంటూరు జిల్లానా.. దసరాకి సొంతూరు వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే..!

దసరాకి ఊరెలా వెళ్లాలి..?

రైళ్లలో చాంతాడంత వెయిటింగ్‌ లిస్ట్‌లు

రెండు నెలల క్రితమే జనరల్‌ టిక్కెట్ల బుకింగ్‌ 

తత్కాల్‌, ప్రీమియర్‌ కోటా బుకింగ్‌పైనే అందరి ఆశలు

స్పెషల్స్‌ పేరిట దోపిడీకి ఆర్టీసీ, ట్రావెల్స్‌ నిర్వాహకుల సన్నాహాలు


గుంటూరు (ఆంధ్రజ్యోతి): దసరా పండగ సెలవులు మరికొద్ది రోజుల్లోనే రానున్నాయి. సికింద్రాబాద్‌, బెంగళూరు, చెన్నై, విశాఖపట్టణం తదితర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు పిల్లలతో కలిసి వచ్చి పండగ జరుపుకునేందుకు చాలామంది సన్నద్ధమయ్యారు. అయితే ఆయా ప్రాంతాల నుంచి గుంటూరుకు వచ్చే రైళ్లలో జనరల్‌ కోటా టిక్కెట్ల బుకింగ్‌ అయిపోయి వెయిటింగ్‌ లిస్టులు కొనసాగుతోన్నాయి. కొంతమంది మాత్రం సెలవుల గురించి ముండుగానే అంచనా వేసి ఈ నెల 24, 25 తేదీల్లో గుంటూరుకు వచ్చేందుకు టిక్కెట్లు బుకింగ్‌ చేసేసుకున్నారు. ఈ విషయంలో కొంత జాప్యం వహించిన వారు ఇప్పుడు ఆయా రోజుల్లో జిల్లాకి వచ్చేందుకు రైల్వే శాఖ 24 గంటల ముందు విడుదల చేసే తత్కాల్‌, ప్రీమియం తత్కాల్‌ కోటా టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్నారు.


విద్యా సంస్థలకు ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబరు 5 వరకు ప్రభుత్వం దసరా పండుగ సెలవులను ప్రకటించింది. 26 సోమవారం కావడంతో 25 ఆదివారం కూడా సెలవు వచ్చింది. ఈ నేపథ్యంలో 24వ తేదీ సాయంత్రమే సొంత ఊళ్లకు వచ్చేందుకు చాలామంది రైళ్లు, బస్సుల్లో టిక్కెట్లు బుకింగ్‌ చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అక్టోబరు 3 దుర్గాష్టమి, 5 విజయదశమి సెలవు దినాలు. అక్టోబరు 2వ తేదీ ఆదివారం సెలవు దినం. ఈ నేపథ్యంలో ఉద్యోగులు 1న సాయంత్రం స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయాణాలను ప్లాన్‌ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరుకు ఆయా తేదీల్లో వచ్చే రైళ్లలో స్లీపర్‌, ఏసీ తరగతుల టిక్కెట్‌లు బుకింగ్‌ అయిపోయాయి.


తిరుగు ప్రయాణంలోనూ తిప్పలే

ఇదిలా వుంటే అక్టోబరు 5వ తేదీ బుదవారం విజయదశమి సెలవు దినం. ఈ తేదీ వారం మధ్యలో వచ్చింది. 6వ తేదీ నుంచి స్కూళ్లు ప్రారంభం కానుండటంతో పండుగ జరుపుకుని వెనువెంటనే తిరుగు ప్రయాణాలకు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఎక్కువ సెలవులు ఇచ్చింది. పాఠశాలలను అక్టోబరు 10న ప్రారంభించనుంది. దీంతో హైదరాబాద్‌ నుంచి జిల్లాకు వస్తోన్న వారు ఆ నెల 8, 9 తేదీల్లో తిరుగు ప్రయాణానికి ప్రణాళిక రూపొందించుకున్నారు. దాంతో ఆయా తేదీల్లో రైళ్లలో రద్దీ నెలకొన్నది. ఆర్‌టీసీ సహా ప్రైవేటు ట్రావెల్స్‌ ఆపరేటర్లు బస్సు చార్జీలను స్పెషల్స్‌ పేరుతో పెంచనున్నారు. ఈ దృష్ట్యా రైళ్లలో తత్కాల్‌ కోటా టిక్కెట్ల బుకింగ్‌పై అందరూ ఆశలు పెట్టుకున్నారు.

Updated Date - 2022-09-20T02:58:23+05:30 IST