నాలుగు దశల్లో శిక్షణ

ABN , First Publish Date - 2020-06-03T09:07:58+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన భారత క్రికెట్‌ ఆటగాళ్లు ఇప్పుడు మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ను అందుకోవడం సవాల్‌గా మారింది. వీలైనంత ...

నాలుగు దశల్లో శిక్షణ

 నెలన్నర సమయం పట్టవచ్చు

 భారత జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌


న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన భారత క్రికెట్‌ ఆటగాళ్లు ఇప్పుడు మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ను అందుకోవడం సవాల్‌గా మారింది. వీలైనంత త్వరగా అంతర్జాతీయ క్రికెట్‌ స్థాయికి తగ్గట్టుగా వారు తమను తాము తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కాంట్రాక్ట్‌ ఆటగాళ్లకు బీసీసీఐ త్వరలోనే శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంది. దీంట్లో కనీసం నాలుగు నుంచి ఆరు వారాల్లోనే ఆటగాళ్లు అత్యుత్తమ ఫిట్‌నెస్‌కు చేరుకునేలా.. నాలుగు దశల్లో శిక్షణ ఇస్తామని భారత క్రికెట్‌ జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌, హైదరాబాద్‌కు చెందిన  రామకృష్ణన్‌ శ్రీధర్‌ వెల్లడించాడు. ‘జాతీయ శిక్షణ శిబిరం నాలుగు నుంచి ఆరు వారాలపాటు కొనసాగితే ఆటగాళ్లందరినీ ఫిట్‌గా ఉంచేలా చేయవచ్చు. ఎందుకంటే ఫాస్ట్‌ బౌలర్లకు ఆరు వారాల సమయం పడితే, బ్యాట్స్‌మెన్‌కు కాస్త తక్కువ టైమ్‌ పట్టవచ్చు. క్యాంప్‌ ఎప్పుడనే విషయం తేలి అటు ప్రభుత్వ అనుమతి కూడా లభిస్తే మా పని ప్రారంభిస్తాం. సుదీర్ఘ కాలం తర్వాత ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్‌ కోసం చాలా ఉత్సాహంగా ఉంటారు. అందుకే సరైన పద్దతిలో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది’ అని తెలిపాడు.

అధిక ఒత్తిడితో గాయాల ప్రమాదం: చాలా రోజుల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టే ఆటగాళ్లపై అధికంగా ఒత్తిడి తెస్తే గాయాలకు గురయ్యే ప్రమాదముందని శ్రీధర్‌ చెప్పాడు. ‘అందుకే నాలుగు దశల్లో ముందుకెళ్లాలని భావిస్తున్నాం. ముందుగా తక్కువ పరిమాణం-తక్కువ తీవ్రత, సాధారణ పరిమాణం-తక్కువ తీవ్రత, అధిక పరిమాణం-సాధారణ తీవ్రత, అధిక పరిమాణం-అధిక తీవ్రత స్థాయిలో క్రికెటర్లకు శిక్షణ ఇస్తాం. ఉదాహరణకు తక్కువ పరిమాణం-తక్కువ తీవ్రతలో ఓ బౌలర్‌ స్వల్ప రనప్‌తో రెండు ఓవర్ల పాటు బౌలింగ్‌ చేస్తాడు. ఇక ఫీల్డర్‌ 10 మీ. లేక 20మీ.ల నుంచి గరిష్ఠంగా ఆరు త్రోలు విసురుతాడు. అటు బ్యాట్స్‌మన్‌ సాధారణ వేగంతో కూడిన బౌలింగ్‌లో ఆరు నిమిషాలపాటు బ్యాటింగ్‌ చేస్తాడు. ఆ తర్వాత నెమ్మదిగా మరో దశను ఆరంభిస్తాం. ఇలా నాలుగో వారంలో మ్యాచ్‌ ప్రాక్టీస్‌ను అందుకోగలుగుతారు. ఆ తర్వాత శిక్షణ తీవ్రంగా ఉంటుంది’ అని శ్రీధర్‌ వివరించాడు. 


Updated Date - 2020-06-03T09:07:58+05:30 IST