అన్ని జిల్లాల్లో శిక్షణ కేంద్రాలు

ABN , First Publish Date - 2020-08-07T10:42:55+05:30 IST

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.

అన్ని జిల్లాల్లో శిక్షణ కేంద్రాలు

పెనుకొండ రూరల్‌, ఆగస్టు 6: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన పెనుకొండ సమీపంలోని కియ కార్ల పరిశ్రమను ఆర్‌అండ్‌బీ మంత్రి శంకరనారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్యే తిప్పేస్వామి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, ఏపీఎస్‌డీసీ ఎండీ శ్రీకాంత్‌తో కలిసి పరిశీలించారు. ముందుగా కియ పరిశ్రమ ఎండీ షిమ్‌తో సమావేశమై, పరిశ్రమ పురోగతిపై పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ను వీక్షించారు.


అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లా ల అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేసే నైపుణ్య శిక్షణ కళాశాలలో రూపొందించాల్సిన సిలబస్‌ గురించి అవగాహన పెంచుకునేందుకు కియ పరిశ్రమకు వచ్చినట్లు తెలిపారు. వివిధ పరిశ్రమల్లో అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను పరిశీలించి, కామన్‌ సిలబస్‌ను రూపొందించేందుకు సంబంధిత అధికారులతో వచ్చినట్లు తెలిపారు.  కార్యక్రమంలో కియ ప్రతినిధులు జూడో, పరిశ్రమల జీఎం సుదర్శన్‌బాబు, డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


యాడికి: మండలంలోని బోయరెడ్డిపల్లి సమీపాన ఉన్న పెన్నా సిమెంట్స్‌ పరిశ్రమలో నిర్మించిన పెన్నా కాలేజ్‌ ఆఫ్‌ సిమెంట్‌ సైన్సెస్‌ కార్యక్రమంలో మంత్రి బుగ్గన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కాలేజీలు, యూనివర్సిటీల నుంచి వచ్చే విద్యార్థుల్లో నైపుణ్య  కొరత ఉందన్నారు. ఈనేపథ్యంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటుచేసి, యువతకు వివిధ రకాల పరిశ్రమలకు ఉపయోగపడే కోర్సులను ప్రవేశపెట్టి శిక్షణ ఇస్తామన్నారు. పెన్నాసిమెంట్‌ యాజమాన్యం వారి కళాశాలలో ప్రవేశపెట్టిన బీఎస్సీ సిమెంట్‌ సైన్సెస్‌ ద్వారా అందిస్తున్న విద్య, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను మార్కెటింగ్‌ పరంగా ఉన్న అవకాశాలను పరిశీలించామన్నారు.


పెన్నాసిమెంట్స్‌ యాజమాన్య రూపొందించిన ఈ కోర్సు చాలా బాగుందని ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు యూనిఫాం మొదలు స్టేషనరీ, భోజన వసతి, పరీక్ష ఫీజు చెల్లింపు సహా పూర్తి ఉచితంగా ఏర్పాటు చేయటం అభినందించదగ్గ విషయమని మంత్రి పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-07T10:42:55+05:30 IST