కాసుల కోచింగ్‌!

ABN , First Publish Date - 2022-04-04T09:25:25+05:30 IST

అది హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లో ప్రముఖ కోచింగ్‌ సెంటర్‌. ఐఏఎస్‌ అకాడమీగా ఉన్న ఆ కేంద్రం ఇటీవలే సరికొత్త భవనంలో...

కాసుల కోచింగ్‌!

  • విధులకు ప్రభుత్వ అధికారుల గైర్హాజరు
  • శిక్షణ  కేంద్రాల్లో మకాం.. గంటల లెక్కన సంపాదన
  • నల్లగొండ డిగ్రీ కాలేజీ అధ్యాపకుడికి ఏటా కోటి
  • అదే కేంద్రంలో గ్రూప్‌-2 అధికారికీ అంతే మొత్తం..
  • పలు చోట్ల వ్యాయామ శిక్షణలో సీఐ, ఎస్సైలు
  • డీఎస్సీ కోచింగ్‌ కేంద్రాలకు ఏపీ టీచర్ల క్యూ
  • వేతనం, లాస్‌ ఆఫ్‌ పే ఇచ్చి మరీ నియామకం


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): అది హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లో ప్రముఖ కోచింగ్‌ సెంటర్‌. ఐఏఎస్‌ అకాడమీగా ఉన్న ఆ కేంద్రం ఇటీవలే సరికొత్త భవనంలోకి మారింది. ఈ కోచింగ్‌ సెంటర్‌ నిర్వహణలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కీలకంగా ఉన్నారు. ఆయనకు వర్సిటీలో గతంలో ఉన్న పోటీ పరీక్షల కేంద్రం నిర్వహణలో అనుభవం ఉంది. ఆర్ట్స్‌ కాలేజీలో అత్యున్నత పదవిలో కొనసాగుతున్నారు. ఇలా ఎన్నో అంశాల్లో పనిమంతుడిగా పేరొందిన ఈ ప్రొఫెసర్‌ను అశోక్‌నగర్‌లోని ఓ కోచింగ్‌ సెంటర్‌ భాగస్వామిగా చేసుకున్నట్లు వినికిడి. కోచింగ్‌ సెంటర్‌ బ్రోచర్‌లో సబ్జెక్టు బోధించే వ్యక్తుల్లో ఆయన పేరు ఉంది.


 ఇదే శిక్షణ కేంద్రానికి సచివాలయంలో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేసే ఉద్యోగి డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. అందులోనే ఓ సబ్జెక్టు బోధిస్తూ విధులకు డుమ్మా కొడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో రాజనీతి శాస్త్రం బోధించే అధ్యాపకుడు అశోక్‌నగర్‌లోని ప్రముఖ కోచింగ్‌ సెంటర్‌లోనూ అదే బోధన చేస్తారు. దోమలగూడలో తరగతులు నిర్వహించే ఈ కోచింగ్‌ సెంటర్‌ ఆయనకు ఏటా రూ.కోటికి పైగా చెల్లిస్తుందట. అక్కడ ఇతర ఫ్యాకల్టీకి గంట చొప్పున లెక్కలు గట్టి చెల్లింపులు చేస్తే.. ఈ అధ్యాపకుడిది రూ.కోటి ప్యాకేజీనని భోగట్టా..! సదరు అధ్యాపకుడు ఒక్కో బ్యాచ్‌కు 120 గంటలు బోధిస్తున్నట్లు తెలిసింది. మొన్నటి వరకు తెల్లవారుఝామున ఐదింటి నుంచి తరగతులు బోధించగా, తర్వాత ఆయన కాలేజీకి వెళ్లేవారు. ప్రస్తుతం బ్యాచ్‌లు పెరుగుతుండటంతో సర్దుబాటు చేసుకోవాలని సూచించగా, ఏకంగా ప్రభుత్వ ఉద్యోగానికే లీవ్‌ పెట్టారని తెలిసింది. ఇదే కోచింగ్‌ సెంటర్‌లో ఎకానమీ బోధించే గ్రూప్‌-2 అధికారి కూడా యేటా రూ.కోటి తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రతి నెలా వేతనం వచ్చే ప్రభుత్వ విధులకు మాత్రం బహుదూరంగా ఉన్నట్లు తెలిసింది. యూనివర్సిటీల ప్రొఫెసర్లు.. ప్రభుత్వ డిగ్రీ, ఇంటర్‌ కాలేజీల అధ్యాపకులు.. ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు ప్రస్తుతం ప్రైవేటు కోచింగ్‌ సెంటర్లు ఆదాయ వనరులుగా మారాయి. ప్రతి నెలా రూ.లక్షల్లో ప్రభుత్వ వేతనాలు పొందుతున్నా, ప్రైవేటు కోచింగ్‌ సెంటర్ల ద్వారా వచ్చే ఆదాయ సంతృప్తినే వేరని పలువురు భావిస్తున్నారు. జీతాలు చెల్లించే విద్యా సంస్థల కంటే.. ప్రైవేటు కోచింగ్‌ సెంటర్లలోనే అమితమైన ఆసక్తితో విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. మొన్నటి వరకు కొంతమంది మాత్రమే ప్రభుత్వ విద్యా సంస్థల్లో వేతనాలు పొందుతూ ప్రైవేటు కోచింగ్‌ సెంటర్లలో బోధిస్తుండగా, ఇటీవల వీరి సంఖ్య మరింత పెరిగింది. కొందరు గ్రూపు-1, గ్రూపు-2 ఆఫీసర్లు, తహసీల్దార్లు, డిప్యుటీ తహసీల్దార్లు, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు కూడా సబ్జెక్టు బోధన చేస్తున్నారు. మరికొందరు ఏకంగా హైదరాబాద్‌లో కోచింగ్‌ సెంటర్లు, పబ్లికేషన్లు, యూట్యూబ్‌ ఛానళ్లు, ప్రత్యేక యాప్‌లతో వ్యాపారాలు చేస్తున్నారు. వీరు మాత్రమే కాదు ఓ సీఐ, ఎస్‌ఐ ప్రైవేటు కోచింగ్‌ సెంటర్లలో వ్యాయామ శిక్షణ ఇస్తున్నారు. తెలంగాణలో డీఎస్సీ కోచింగ్‌ ఇచ్చేందుకు ఏపీకి చెందిన స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీలు బారులు కట్టారంటే కోచింగ్‌ సెంటర్ల ద్వారా వచ్చే ఆదాయం ఏ స్థాయిలో ఉందో అవగతమవుతోంది. 


లాస్‌ ఆఫ్‌ పే చెల్లింపులు..

టీచర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ పరీక్ష కోసం నగరంలోని పలు కోచింగ్‌ సెంటర్లు నిష్ణాతులైన అధ్యాపకులతో డెమోలు నిర్వహిస్తున్నాయి. వీరిలో అత్యధికులు ఏపీకి చెందిన ప్రభుత్వ స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీలు కావడం గమనార్హం. వీరంతా విడతలవారీగా లీవ్‌పై వచ్చి నగరంలో తరగతులు నిర్వహించడానికి ఒప్పందాలు పూర్తయ్యాయి. వీరి లాస్‌ ఆఫ్‌ పే కూడా కోచింగ్‌ సెంటర్లే భరించాలి. ఆయా టీచర్లకు గంటకు రూ.2వేల నుంచి రూ.4వేల వరకు చెల్లించనున్నట్లు తెలిసింది.  


ప్రభుత్వ నిబంధనలు ఏమంటున్నాయి!

ప్రభుత్వ ఉద్యోగంలో చేరినవారెవరైనా ఆదాయాన్నిచ్చే ఇతర ఏ ప్రైవేటు సంస్థల్లోనూ కొనసాగరాదు. డైరెక్టర్లుగా, భాగస్వామ్యులుగా ఉండరాదు. ఉచితంగా బోధన చేయవచ్చు. అయితే, కోచింగ్‌ సెంటర్ల ద్వారా యేటా రూ.కోట్ల ఆదాయం పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌లో ఎలాంటి వివరాలను పొందుపరుస్తున్నారనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. మరోవైపు ప్రభు త్వ ఉద్యోగులు పబ్లికేషన్స్‌, యాప్‌లు నిర్వహించడంతో పాటు పలు కోచింగ్‌ సెంటర్లలో డైరెక్టర్లుగా, భాగస్వామ్యులుగా కొనసాగుతున్నా చర్యలు లేకపోవడం గమనార్హం. 


పబ్లికేషన్స్‌ నిర్వహిస్తున్న తహశీల్దార్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, అశోక్‌నగర్‌, నారాయణగూడ, విద్యానగర్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో నిర్వహిస్తున్న పలు ప్రైవేటు కోచింగ్‌ సెంటర్లలో బోధిసున్న వారిలో అత్యధికులు ప్రభుత్వ వేతనాలు పొందుతున్న వారే. వీరు గంటకు రూ.1,500 నుంచి రూ.5వేల వరకు తీసుకుంటున్నారు. ఒక్కో ఉద్యోగి రోజుకు కనీసం 6-8 గంటలు నిరాటంకంగా బోధిస్తున్నారు. ప్రైవేటు కోచింగ్‌ సెంటర్ల ద్వారా కొందరు రోజుకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు సంపాదిస్తున్నారు. ప్రభుత్వ వేతనాలు పొందే వీరంతా విధి నిర్వహణలోనే కోచింగ్‌ సెంటర్లలో   బోధనకు ప్రిపేరవుతున్నారు. ఇక, అశోక్‌నగర్‌లో ఓ తహసీల్దార్‌ ఏకంగా పబ్లికేషన్స్‌ నిర్వహిస్తున్నారు. మూడు ఆంగ్ల అక్షరాలతో పేరు ఉండే ఈ సంస్థతో పాటు యూట్యూబ్‌ చానల్‌, యాప్‌ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈయన భార్య కూడా ప్రభుత్వ ఉద్యోగినే. ఏపీకి చెందిన గ్రూప్‌-1 అధికారి కూడా అశోక్‌నగర్‌లో కోచింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఈయన పేరుతో పబ్లికేషన్స్‌ సంస్థ ఉంది. దాంతో పాటు యూట్యూబ్‌ ఛానల్‌, యాప్‌ కూడా నిర్వహిస్తున్నారు.  


పలు కోచింగ్‌ సెంటర్లలో ఉద్యోగులు ఇలా..

చైతన్యపురిలో పోలీసు ఉద్యోగాలకు శిక్షణనిచ్చే ప్రముఖ స్టడీ సర్కిల్‌లో ఓ పంచాయతీ కార్యదర్శి పొలిటికల్‌ సైన్స్‌ బోధిస్తున్నారు. ఇందుకు గంటకు రూ.2300 చొప్పున తీసుకుంటున్నారు. అనారోగ్యం పేరుతో కొలువుకు లీవ్‌ పెట్టినట్లు తెలిసింది. ఇదే సంస్థలో తెలంగాణ ఉద్యమ సబ్జెక్టు బోధించేది ప్రభుత్వ టీచరే.


 దిల్‌సుఖ్‌నగర్‌లోని పేరొందిన కోచింగ్‌ సెంటర్‌లో రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో పని చేసే ఓ ఎస్‌ఐ వ్యాయామ శిక్షణ ఇస్తున్నారు.  మూడు గంటలకు రూ.7,500 తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కోచింగ్‌ల పట్ల మాత్రం పలువురు సీఐలు, ఎస్‌ఐలు పట్టనట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం.


 దిల్‌సుఖ్‌నగర్‌లోని రెండు పోలీసు శిక్షణా కేం ద్రాల్లో వరంగల్‌, నల్లగొండ జిల్లాలకు చెందిన ఇద్దరు ఎస్‌లు భాగస్వాములైన్నట్లు తెలిసింది.

నగరంలోని ఇందిరాపార్కులో ప్రముఖ కోచింగ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో ఉదయం వ్యాయామ శిక్షణ ఇస్తున్నారు. ఓ సీనియర్‌ పోలీసు అధికారి నేతృత్వంలో ఇది సాగుతున్నట్లు తెలిసింది. ఈ కోచింగ్‌ సెంటర్‌లో ఆయనకు భాగస్వామ్యం కూడా ఉన్నట్లు సమాచారం.


వికారాబాద్‌లో డిప్యుటీ తహశీల్దార్‌గా పని చేస్తున్న అధికారి అశోక్‌నగర్‌లోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో ఫ్యాకల్టీగా చేరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కోచింగ్‌ సెంటర్‌లోనే గడుపుతారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వికారాబాద్‌ జిల్లాలో విధులు చక్కబెడుతున్నారు.

Updated Date - 2022-04-04T09:25:25+05:30 IST