మెరీనాతీరంలో మునిగి ట్రైనీ డాక్టర్‌ ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-05-10T16:13:59+05:30 IST

మెరీనాబీచ్‌ వద్ద సముద్రంలో మునిగి ప్రైవేటు ఆస్పత్రి డాక్టర్‌ ఆత్మహత్య చేసుకున్నారు.

మెరీనాతీరంలో మునిగి ట్రైనీ డాక్టర్‌ ఆత్మహత్య

చెన్నై : మెరీనాబీచ్‌ వద్ద సముద్రంలో మునిగి ప్రైవేటు ఆస్పత్రి డాక్టర్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ డాక్టర్‌ మృతదేహం తీరానికి కొట్టుకురావడంతో పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. చెన్నై విరుగంబాక్కం శ్యామలా గార్డెన్‌ ప్రాంతంలో నివసిస్తున్న మల్లికార్జున్‌ (34) పోరూరులోని ప్రైవేటు వైద్యకళాశాలలో వైద్యకోర్సు చదివి పళ్ళికరణైలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఆస్పత్రికి వెళుతున్నట్టు కుటుంబసభ్యులకు తెలిపి, మల్లికార్జున్‌ కారులో బయల్దేరారు. ఆ తర్వాత సాయంత్రం మల్లికార్జున్‌ తన తమ్ముడు అజయ్‌ సెల్‌ఫోన్‌కు ఓ మెసేజ్‌ పంపారు. 


ఆ మెసేజ్‌లో తన చావుకు ఎవరూ కారణం కాదని, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోమని తెలిపాడు. తాను తీసుకెళ్ళిన కారును మెరీనాబీచ్‌ లైట్‌హౌస్‌ వద్ద పార్కింగ్‌ చేశానని పేర్కొన్నారు. ఆ మెసేజ్‌ను చూసి దిగ్ర్భాంతి చెందిన అజయ్‌ వెంటనే బయలుదేరి మెరీనా బీచ్‌కు చేరుకున్నాడు. లైట్‌హౌస్‌ సమీపంలో కారు మాత్రమే కనిపించింది.. మెరీనా సముద్రతీరమంతటా వెతికిన మీదట రాత్రి ఏడుగంటల ప్రాంతంలో వివేకానందర్‌ ఇల్లమ్‌ ఎదురుగా మల్లికార్జున్‌ మృతదేహం సముద్రపు ఒడ్డున పడి వుండటం చూసి అజయ్‌ మెరీనాబీచ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్ళి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  మల్లికార్జున్‌ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను తెలుసుకునే దిశగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Updated Date - 2020-05-10T16:13:59+05:30 IST