వేళ.. మారుతుంటే ఎలా ?

ABN , First Publish Date - 2022-07-10T05:30:00+05:30 IST

పక్క డివిజన్ల సౌలభ్యం కోసం గుంటూరు డివిజన్‌లో కొన్ని రైళ్ల బయలుదేరే సమయాలను తరచుగా మారుస్తోండటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

వేళ.. మారుతుంటే ఎలా ?

తరచుగా మారుతున్న రైళ్ల సమయ పట్టిక

పక్క డివిజన్ల సౌలభ్యం కోసం మార్పులు

ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్న గుంటూరు డివిజన్‌ రైల్వే అధికారులు

అవస్థలు పడుతున్న ప్రయాణికులు

గుంటూరు, జూలై 10 (ఆంధ్రజ్యోతి): పక్క డివిజన్ల సౌలభ్యం కోసం గుంటూరు డివిజన్‌లో కొన్ని రైళ్ల బయలుదేరే సమయాలను తరచుగా మారుస్తోండటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కొత్తగా మార్పుచేసే సమయంలో తలెత్తే సమస్యలకు గుంటూరు డివిజన్‌ రైల్వే అధికారులు పెద్దగా అభ్యంతరం చెప్పడంలేదు. దీంతో ఇటీవల కాలంలో తరచుగా సమయ పట్టిక మారిపోతూ ఉంటుంది. ఒకసారి రైల్వే టైం టేబుల్‌లో రైలు సమయం మారిన తర్వాత మళ్లీ మార్పు చేయాలంటే ఆషామాషి వ్యవహారం కాదు. కనీసం ఇక్కడి రైలు సమయం మార్పు చేసేందుకు ఆమోదం తెలిపే ముందు స్థానిక ప్రజాప్రతినిధులు, రైల్వే వినియోగదారుల అభిప్రాయాలు సేకరించాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ పట్టవన్నట్లు ఏకపక్షంగా ఫలాన తేదీ నుంచి ఫలానా రైలు సమయం మారుతుందని ఒక ప్రకటన విడుదల చేసేస్తున్నారు. రేపల్లె-సికింద్రాబాద్‌ రైలు సమయ పట్టిక గతంలో ఎంతో ఆమోద యోగ్యంగా ఉండేది. ఈ రైలు రేపల్లెలో ఉదయం 7 గంటలకు బయలు దేరి 8 గంటలకు తెనాలి, 9.10 గంటలకు గుంటూరుకు వచ్చేది.  రేపల్లె మొదలుకొని వేజండ్ల వరకు ప్రయాణీకులు గుంటూరుకు రావడానికి ఉపయోగకరంగా ఉండేది. ఇది సికింద్రాబాద్‌ వెళ్లిన తర్వాత మణు గూరు రైలుకు రేక్‌ షేరింగ్‌ కావడంతో సమయాన్ని ముందుకు జరి పారు. ఇప్పుడు 7.50కి రేపల్లెలో బయలుదేరి 9.40కి గుంటూరు వస్తుంది. దాంతో సకాలంలో ఉద్యోగులు, కార్మికులు సకాలంలో వెళ్లలేక పోతోన్నారు. అలానే గతంలో 10.50కి సికింద్రాబాద్‌లో బయలుదేరే రేపల్లె రైలు సాయంత్రం 5.55కి గుంటూరుకు వచ్చేది. దాంతో అందరూ పనులు ముగించుకొని ఆ రైలు ఎక్కి ఊళ్లకు వెళ్లిపోయేవారు. ఇప్పుడు ఈ రైలు సాయంత్రం 5.35కి గుంటూరుకు వస్తుంది. దీంతో ప్రయాణికులు ఆ సమయానికి వచ్చి  రైలు ఎక్కలేకపోతోన్నారు. అలాగే ప్రతీరోజు సాయంత్రం 4.45కి గుంటూరు నుంచి నరస పూర్‌కు ఒక రైలు బయలుదేరుతుంది. దాంతో విజయవాడ వెళ్లే వారంతా ఆ రైలు ఎక్కుతారు. ఆ తర్వాత మళ్లీ 6.40కి ఒక రైలు ఉండేది. ఇప్పుడు దాని సమయాన్ని ముందుకు జరిపి సాయంత్రం 5 గంటలకు బయలుదేరేలా చేశారు. ఇందుకు కారణం డోర్నకల్‌ రైలు రేక్‌ షేరింగ్‌ కోసం. దీని వలన పావు గంట వ్యవధి రెండు రైళ్లు విజయవాడ బయలుదేరతాయి. దాని వలన అటు ప్రయాణీకులకు, ఇటు రైల్వేకి ఉపయోగం ఉండదు. ఈ క్రమంలో రైల్వే అధికారులు తప్పులో కాలేశారు. గుంటూరు - విజయవాడ ప్యాసింజర్‌ రైలు బయలుదేరే సాయంత్రం 5 గంటల సమయంలో వారంలో ఒక రోజు ఎస్‌ఎస్‌పీఎన్‌ - హౌరా ఎక్స్‌ప్రెస్‌ టైమింగ్‌ ఉంది. రైల్వే నిబంధనల ప్రకారం ఒకే సమయంలో రెండు రైళ్లు ఒకే మార్గంలో బయలుదేర కూడదు. ఈ విషయాన్ని కూడా విస్మరించి గుంటూరు - విజయవాడ ప్యాసింజర్‌ సమయాన్ని మార్పు చేశారు. గుంటూరు నుంచి తెనాలికి అయితే సాయంత్రం 5.35కి రేపల్లె ఎక్స్‌ప్రెస్‌ వెళ్లిన తర్వాత మళ్లీ రాత్రి 9.10 గంటల వరకు మరో రైలు ఆ మార్గంలో లేదు. దీంతో ప్రయాణీకులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోన్నది. అంతేకాకుండా విజయవాడ నుంచి రేపల్లె వెళ్లే ప్రయాణీకులు బిట్రగుంట ప్యాసింజర్‌ రైలులో వచ్చి తెనాలిలో దిగి గతంలో సికింద్రాబాద్‌ - రేపల్లె రైలు ఎక్కేవారు. ఇప్పుడు సికింద్రాబాద్‌- రేపల్లె రైలు ముందు వస్తుండటంతో ఆ అవకాశం లేకుండా పోయింది. ఈ మార్పుల వలన ప్రయాణికులకు ఇబ్బందులు పడుతున్నారు. పాత సమయ పట్టికల పునరుద్ధరణపై ఆలోచన చేయాలని గుంటూరు రైల్వే అధికారులకు వినియోగదారు సంఘాల నాయకులు కోరుతోన్నారు. 


Updated Date - 2022-07-10T05:30:00+05:30 IST