ఈ పరికరం రైలు ప్రమాదాలను నివారిస్తుంది.. రెడ్ లైట్ పడగానే ఏం జరుగుతుందంటే..

ABN , First Publish Date - 2022-02-16T14:42:18+05:30 IST

దేశంలో అప్పుడప్పుడు రైలు ప్రమాదాలు..

ఈ పరికరం రైలు ప్రమాదాలను నివారిస్తుంది.. రెడ్ లైట్ పడగానే ఏం జరుగుతుందంటే..

దేశంలో అప్పుడప్పుడు రైలు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇటువంటి సందర్భాల్లో భారీ మొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంటుంది. రైలు ప్రమాదాలను అరికట్టేందుకు రైల్వే శాఖ పలు చర్యలు చేపట్టింది. రైల్వే లైన్ల విస్తరణ నుంచి పాత స్లీపర్‌ల స్థానంలో కొత్త వంతెనలు, సురక్షిత కోచ్‌ల నిర్మాణం వరకు అభివృద్ధి దిశగా నిరంతర ప్రయత్నాలు జరుగుతుంటాయి. చలికాలంలో పొగమంచు వల్ల ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు రైళ్ల ఇంజిన్‌లో ఫాగ్ కట్టర్ లైట్లను ఉపయోగిస్తారు. అయితే ఒక్కోసారి రైలు డ్రైవర్ రెడ్ సిగ్నల్ చూడకపోవడంతో రైలు ముందుకు వెళ్లి.. ప్రమాదం జరిగే అవకాశం ఉంది. గతంలో బరేలీ సమీపంలోని సీబీ గంజ్ స్టేషన్‌లో రెడ్ సిగ్నల్‌‌ను డ్రైవర్ గమనించకపోవడంతో కిసాన్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో రైల్వేశాఖ ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక పరికరాన్ని సిద్ధం చేసింది. 


ఈ పరికరం సహాయంతో, సిగ్నల్ ఎరుపు రంగులోకి మారినప్పుడు రైలు దానికదే బ్రేక్ పడుతుంది. రైలు ఆగిపోతుంది. ఈ పరికరం రెండు భాగాలుగా ఉంటుంది. ఒక భాగం రైలు ఇంజిన్ లోపల అమరుస్తారు. మరొక భాగం అన్ని సిగ్నల్స్‌లో అమరుస్తారు. ఈ పరికరం రైలు ఇంజిన్‌కు సంబంధించిన బ్రేక్ సిస్టమ్, ఇంజిన్ షట్‌డౌన్ సిస్టమ్‌కు కనెక్ట్ అయివుంటుంది. సిగ్నల్ కు ముందుగా రైలు 500 మీటర్లకు చేరుకున్నప్పుడు ఇంజిన్ లోపల ఉన్న పరికరం డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. ఈ పరికరం.. సిగ్నల్ రాబోతోందని డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది. దీనితోపాటు సిగ్నల్ ఎరుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉందో కూడా తెలియజేస్తుంది. సిగ్నల్ ఎరుపు రంగులో ఉంటే, డ్రైవర్ బ్రేక్ వేయడం ద్వారా రైలును ఆపివేస్తాడు. పొరపాటున డ్రైవర్ అలా చేయని పక్షంలో ఆ పరికరం ఇంజిన్‌కు బ్రేక్‌ పడేలా చేస్తుంది. అంటే డ్రైవర్ పొరపాటు చేసినా ఇంజిన్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. కొన్ని పరిస్థితులలో సాంకేతిక లోపం కారణంగా రెండు రైళ్లు ఒకే లైన్‌పైకి వస్తాయి, అప్పుడు కూడా ఈ పరికరం రైలును ఆపివేస్తుంది. యూపీలోని మొరాదాబాద్ రైల్వే డివిజన్‌లో సహారన్‌పూర్ నుంచి లక్నో వరకు ఉన్న సిగ్నల్స్‌పై ప్రమాద రహిత పరికరాలను అమర్చేందుకు ప్రతిపాదన సిద్ధం చేశారు. దీనికి 500 కోట్లు ఖర్చవుతుందని సమాచారం. 




Updated Date - 2022-02-16T14:42:18+05:30 IST