రైల్లోంచి జారిపడి ఇద్దరి దుర్మరణం

ABN , First Publish Date - 2021-06-18T03:42:42+05:30 IST

స్థానిక రైల్వేస్టేషన్‌ పరిధిలో గురువారం రెండు వేర్వేరు చోట్ల జరిగిన రైలు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు.

రైల్లోంచి జారిపడి ఇద్దరి దుర్మరణం

మృతుల్లో ఒకరిది ఒరిస్సా... మరొకది చెన్నై  


మనుబోలు, జూన్‌ 17: స్థానిక రైల్వేస్టేషన్‌ పరిధిలో గురువారం రెండు వేర్వేరు చోట్ల జరిగిన రైలు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. బుధవారం అర్ధరాత్రి అప్‌లైన్‌లో 143వ కి.మీ.వద్ద 8-12 స్తంభాల మధ్యలో చెన్నై నుంచి ఒరిస్సా వెళుతున్న రైల్లోంచి ఒరిస్సాలోని గంజాం జిల్లా గోపాలపురం గ్రామానికి చెందిన మడ్డి గురమ్మ (70) ప్రమాదవశాత్తు పట్టుతప్పి రైల్లోంచి జారి చెరువులో పడిపోయింది. కూలీ పనుల నిమిత్తం బంధువులతో చెన్నైకు వచ్చి తిరుగు ప్రయాణంలో స్వగ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గురమ్మ పడిపోవడాన్ని గుర్తించిన బంధువులు చైన్‌ లాగేశారు. దీంతో హౌరా మెయిల్‌ అర్ధగంట పాటు మనుబోలు స్టేషన్‌ సమీపంలో నిలిచిపోయింది. వెంటనే ఆమె కుమార్తె కుర్లమ్మ, మనవడు అప్పన్న దిగి గురవమ్మ మృతదేహం కోసం వెతుకులాడారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ముత్యాలరావు, స్థానికులు చెరువు వద్దకు చేరుకుని గురవమ్మ మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ వీఎల్‌.  కుమార్‌రాజా ఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి వివరాలు నమోదు చేసుకుని శవపరీక్షల నిమిత్తం మృతదేహాన్ని నెల్లూరుకు తరలించారు. కాగా గురువారం ఽసాయంత్రం అప్‌లైన్‌లో 147వ కి.మీ. వద్ద 27-29 స్తంభాల మధ్యలో చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న తమిళనాడులోని తాంబరంకు చెందిన డీబీ. చంద్రన్‌(54) రైల్లోంచి ప్రమాదవశాత్తు జారిపడి మరణించాడు. మృతుడు నలుపురంగు, చారలు కలిగిన టీషర్టు, ప్యాంటు ధరించి ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ లావణ్య ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకుని మృతదేహాన్ని నెల్లూరుకు తరలించారు. 

Updated Date - 2021-06-18T03:42:42+05:30 IST