పండగ.. ప్రయాణం

ABN , First Publish Date - 2022-10-05T06:11:40+05:30 IST

దసరా పండగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణీకులతో గుంటూరు రైల్వే జంక్షన్‌ రద్దీగా మారిపోయింది.

పండగ.. ప్రయాణం
జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలు వచ్చిన సమయంలో రద్దీగా మారిని గుంటూరు రైల్వేస్టేషన్‌

గుంటూరు, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): దసరా పండగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణీకులతో గుంటూరు రైల్వే జంక్షన్‌ రద్దీగా మారిపోయింది. హైదరాబాద్‌లో ఉన్న పిల్లల వద్దకు వెళ్లే తల్లిదండ్రులు, ఇక్కడ చదువుకొంటూ తెలంగాణలో ఉండేవారు మంగళవారం మధ్యాహ్నం సికింద్రాబాద్‌కు బయలుదేరారు. దాంతో లింగంపల్లి వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ వచ్చినప్పుడు ఒకటోనెంబరు ప్లాట్‌ఫాం కిక్కిరిసిపోయింది. సాయంత్రం ఆరు గంటల సమయం దాటిన తర్వాత వచ్చిన విజయవాడ - లింగంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. ముందుగా టిక్కెట్‌లు బుకింగ్‌ చేసుకొన్న వారు తమ సీట్లలో కూర్చోగా జనరల్‌ టిక్కెట్‌లు తీసుకొని చాలామంది రిజర్వుడ్‌ బోగీల్లోకి ఎక్కేశారు. ఇక జనరల్‌ బోగీల్లో అయితే కాలు కదపడానికి వీల్లేనంతగా ప్రయాణీకులు చేరారు. ఈ వారంలో రెండో శనివారం కూడా ఉండటంతో చాలామంది గురు, శుక్రవారాలు ఆఫీసులకు సెలవులు పెట్టేశారు. ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఈ వారం అంతా సెలవులు ఇచ్చారు. దాంతో వారంతా తమ కుటుంబాలు నివసించే హైదరాబాద్‌, చెన్నై, విశాఖపట్టణం, బెంగళూరులకు బయలుదేరి వెళ్లారు. కాగా ఈ సెలవు రోజుల్లో విహారయాత్రలకు ప్రణాళికలు చేసుకొన్న వారు కూడా రైళ్లలో ముందుగానే బుకింగ్‌ చేసుకొన్నారు. ఈ కారణంగా ఫలక్‌నుమా, విశాఖ, శబరి, నరసపూర్‌, ప్రశాంతి, అమరావతి వంటి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో కనీసం వెయిటింగ్‌ లిస్టులో టిక్కెట్‌లు బుకింగ్‌ చేసుకోవడానికి అవకాశం లేకుండా స్టేటస్‌ రిజెక్టు పడిపోయింది. దీంతో కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆశ్రయించి ఎమర్జన్సీ కోటాలో టిక్కెట్‌లు విడుదల చేయించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఒక్కో రైలుకు 20కి పైగా ఈక్యూ లెటర్స్‌ వస్తుండటంతో రైల్వే సిబ్బంది సర్దుబాటు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ వారంతం వరకు రద్దీ ఇలానే కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. 

Updated Date - 2022-10-05T06:11:40+05:30 IST