ప్రయాణంలో పారాహుషార్‌

ABN , First Publish Date - 2021-07-27T07:11:09+05:30 IST

రైళ్ల సంఖ్య పెరుగుతోంది.. టికెట్లు సులువుగా దొరుకుతున్నాయి.. స్టేషన్లలో అందుబాటులో ఉన్న రైలెక్కి ఎప్పుడు

ప్రయాణంలో పారాహుషార్‌
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ప్రయాణికులు (ఫైల్‌)

 వైద్యుల హెచ్చరిక

 అన్‌ రిజర్వేషన్‌ టికెట్లతో రైళ్లలో పెరుగుతున్న ప్రయాణికులు


హైదరాబాద్‌ సిటీ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): రైళ్ల సంఖ్య పెరుగుతోంది.. టికెట్లు సులువుగా దొరుకుతున్నాయి.. స్టేషన్లలో అందుబాటులో ఉన్న రైలెక్కి ఎప్పుడు పడితే అప్పుడు.. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లొచ్చని అజాగ్రత్త వహించారో.. కరోనా మహమ్మారి ఉచ్చులోపడి పాణాలమీదకు తెచ్చుకోవాల్సి వస్తోందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కరోనా రెండో దశలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారని, లక్షలాది మంది ఆస్పత్రుల పాలయ్యారన్న విషయాన్ని మరిచిపోవద్దని, అత్యవసరమైతే తప్ప.. రైళ్లలో ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమమని వారు సూచిస్తున్నారు. కరోనా నేపథ్యంలో నిలిచిపోయున రైళ్లు ఒక్కొక్కటిగా పట్టాలెక్కుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, నాందేడ్‌, గుంతకల్లు డివిజన్ల పరిధిలో కొవిడ్‌, ఫెస్టివల్‌ స్పెషల్‌ పేర్లతో తిరిగిన 127 రైళ్లకు అదనంగా ఈ నెల 19 నుంచి మరో 88 అందుబాటులోకి వచ్చాయి. 


అందుబాటులో అన్‌ రిజర్వేషన్‌ టికెట్లు

కరోనా నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వేలో ఇప్పటివరకు నడుస్తున్న కొవిడ్‌ స్పెషల్‌ రైళ్లకు రిజర్వేషన్‌ టికెట్లను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 19 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చిన 16 ఎక్స్‌ప్రెస్‌, 66 ప్యాసింజర్‌ స్పెషల్‌ రైళ్లలో ప్రయాణించేందుకు అన్‌ రిజర్వేషన్‌ (రిజర్వేషన్‌ లేకుండా) టికెట్లను ప్రారంభించారు. ఈ మేరకు స్టేషన్లలో నేరుగా బుకింగ్‌ కౌంటర్లలో, ఆటోమేటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మిషన్‌(ఏటీ వీఎం)లలో, యూటీఎస్‌ యాప్‌ (ఆన్‌లైన్‌) ద్వారా టికెట్లు పొందే సౌకర్యాన్ని కల్పించారు. గతంలో ఆన్‌లైన్‌లో రిజర్వేషన్‌ టికెట్లు పొందిన వారిని మాత్రమే స్టేషన్ల లోపలికి అనుమతించి రైళ్లలో పంపించగా.. కొత్తగా పునరుద్ధరించిన ప్యాసింజర్‌ స్పెషల్‌ రైళ్లలో వెళ్లేవారు బుకింగ్‌ కౌంటర్ల వద్దకు వెళ్లి టికెట్‌ తీసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో సికింద్రాబాద్‌, కాచిగూడ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది.


కరోనా నిబంధనలు తప్పనిసరి

గతంలో సీట్ల రిజర్వేషన్‌ ప్రకారమే పలు రైళ్లలో ప్రయాణించిన వారు ప్రస్తుతం సీట్లు లభించకున్నా బోగీల్లో నిలబడి వెళ్లే అవకాశం దొరికింది. పేద, మధ్య తరగతి ప్రజల సౌకర్యార్థం రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ రాకపోకల సమయంలో కరోనా నిబంధనలు పాటించాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గమ్యస్థానానికి చేరుకునే వరకు అప్రమత్తంగా ఉండకపోతే కరోనా సామాజిక వ్యాప్తి శరవేగంగా పెరిగిపోతోందని అంటున్నారు. 

రైళ్లలో ప్రయాణిస్తున్న వారు డబుల్‌ మాస్క్‌ ధరించాలి

కరోనాతో ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్నాయి. మొదటి దశ కంటే రెండో దశ ఉగ్రరూపం దాల్చి రాష్ట్రంలో వేలాది మందిని బలితీసుకుంది. మరికొద్ది రోజుల్లో మూడో దశ కూడా వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రయాణాలు చేస్తున్న వారు జాగ్రత్తగా ఉండాలి. రైళ్లలో ప్రయాణిస్తున్న వారు డబుల్‌ మాస్క్‌ ధరించాలి. శానిటైజర్లతో చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి. రైలు దిగి ఇంటికి వెళ్లిన తర్వాత లగేజీ బ్యాగులను బయటే ఉంచాలి. శానిటైజ్‌ చేసిన తర్వాత లోపలికి తీసుకెళ్లాలి. అత్యవసరమైతే తప్ప కొన్ని నెలల వరకు రైళ్లలో ప్రయాణించకపోవడం మంచిది.

- డాక్టర్‌ రాకేష్‌, పల్మనాలజిస్ట్‌, స్టార్‌ ఆస్పత్రి, హైదరాబాద్‌



Updated Date - 2021-07-27T07:11:09+05:30 IST