తాగి పట్టాలపై నిద్రించిన వారిపై దూసుకెళ్లిన రైలు

ABN , First Publish Date - 2022-06-11T14:33:04+05:30 IST

మద్యం సేవించి రైలుపట్టాలపై కూర్చున్న వారిపై రైలు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతిచెందగా, మరొకరికి తీవ్రంగా గాయపడ్డారు. తూత్తుకుడి 3వ మైలు

తాగి పట్టాలపై నిద్రించిన వారిపై దూసుకెళ్లిన రైలు

- ఇద్దరు యువకుల దుర్మరణం 

- మరో యువకుడికి తీవ్రగాయాలు


పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 10: మద్యం సేవించి రైలుపట్టాలపై కూర్చున్న వారిపై రైలు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతిచెందగా, మరొకరికి తీవ్రంగా గాయపడ్డారు.  తూత్తుకుడి 3వ మైలు పసుమ్‌పొన్‌ నగర్‌కు చెందిన మారిముత్తు (20), తిరువికనగర్‌కు చెందిన ఎస్‌.మారిముత్తు (23), తిరునల్వేలి జిల్లా మనకుడికి చెందిన జపసింగ్‌ (23) స్నేహితులు. వీరు ముగ్గురు గురువారం ఉదయం జరిగిన స్నేహితుడు వివాహ కార్యక్రమానికి హాజరై రాత్రి 10 గంటల ప్రాంతంలో తూత్తుకుడి 3వ ఫ్లాట్‌ ఫారం సమీపంలోని రైలు పట్టాలపై మద్యం సేవించారు. మద్యం అధికం కావడంతో వారు రైలుపట్టాలపైనే నిద్రించినట్లు సమాచారం. శుక్రవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో తూత్తుకుడి హార్బర్‌ నుంచి ఆంధ్ర వైపునకు వెళుతున్న గూడ్స్‌ రైలు రైలుపట్టాలపై పడుకున్న వీరి మీదుగా వెళ్లింది. ఈ ఘటనలో తలలు తెగిపడిన మారిముత్తు, మరొక మారిముత్తు సంఘటనా స్థలంలో మృతిచెందగా, రైలు పట్టాల పక్కన పడుకున్న జపసింగ్‌కు తీవ్రగాయాలయ్యాయి. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జపసింగ్‌ను చికిత్స నిమిత్తం, ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తూత్తుకుడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. కాగా, మారిముత్తు 9 నెలల క్రితం ఓ హత్యకేసులో గూండా చట్టం కింద అరెస్టయి రెండు నెలల క్రితం బెయిలుపై విడుదలయ్యాడు. మరో మారిముత్తు దోపిడీ కేసులో అరెస్టయి రెండు నెలల క్రితం, చికిత్స పొందుతున్న జపసింగ్‌పై ఒక హత్య కేసులో అరెస్టయి మూడు నెలల క్రితం విడుదల అయ్యారు.

Updated Date - 2022-06-11T14:33:04+05:30 IST