ఆసిఫాబాద్‌లో ఆదివాసీలే లక్ష్యంగా దా‘రుణ’ మోసాలు

ABN , First Publish Date - 2022-01-15T03:57:05+05:30 IST

రుణం పేరిట అమాయకులను చక్రవడ్డీలతో పీల్చి పిప్పి చేస్తున్న ప్రైవేటు ఫైనాన్సియర్ల బాగోతాలు తీగలాగినా కొద్ది ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుచూస్తున్నాయి. జిల్లాలో ఎస్పీ ఆదేశాలతో కదిలిన పోలీసు యంత్రాంగం అధిక వడ్డీలకు అప్పులిచ్చి వేధింపులకు పాల్పడుతున్న వ్యాపారులపై నిఘా ముమ్మరం చేసింది.

ఆసిఫాబాద్‌లో ఆదివాసీలే లక్ష్యంగా దా‘రుణ’ మోసాలు

-అప్పులతో వల

-అధిక వడ్డీతో సామాన్యుడి విలవిల

-ఆదివాసీ రైతులే టార్గెట్‌

-జిల్లాలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న గిరిగిరి ఫైనాన్స్‌ల బండారం 

-ఒకరిపై కేసు నమోదు 

-విచారణలో విస్తుపోయే అంశాలు 

-దొరికింది చిన్నచాపేనంటున్న పరిశీలకులు 

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌):

రుణం పేరిట అమాయకులను చక్రవడ్డీలతో పీల్చి పిప్పి చేస్తున్న ప్రైవేటు ఫైనాన్సియర్ల బాగోతాలు తీగలాగినా కొద్ది ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుచూస్తున్నాయి. జిల్లాలో ఎస్పీ ఆదేశాలతో కదిలిన పోలీసు యంత్రాంగం అధిక వడ్డీలకు అప్పులిచ్చి వేధింపులకు పాల్పడుతున్న వ్యాపారులపై నిఘా ముమ్మరం చేసింది. ఈ క్రమంలో గురువారం ఓ వ్యాపారిని అదుపులోకి తీసుకొని అతని ఇంట్లో సోదాలు నిర్వహించగా పోలీసులకే దిమ్మతిరిగి పోయేలో స్థాయిలో హక్కుపత్రాలు, బ్యాంకు పాస్‌బుక్‌లు, పట్టాపాస్‌ పుస్తకాలు, బంగారం తనఖాకు సంబంధించిన వివరాలు వెలుగు చూశాయి. అంతేకాదు అతడు ఇచ్చిన అప్పులకు సంబంధించి ఎంతెంత శాతం వడ్డీ తీసుకున్నాడో కూడా లెక్కలున్నట్టు చెబుతున్నారు. దీంతో ఈ అంశం జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. వాస్తవానికి ఆసిఫాబాద్‌ జిల్లాలో పోలీసుల అంచనా ప్రకారం 40మంది ప్రైవేటు వడ్డీ వ్యాపారులు అనుమతి లేకుండా ఈ అనైతిక దందా సాగిస్తున్నట్టు ప్రాథమిక నిర్ధారణకు రాగా వాస్తవిక సంఖ్య ఇందుకు మూడు రెట్లు ఉంటుందని చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలా అధిక వడ్డీలకు అప్పులిచ్చి సామాన్యులను పీల్చి పిప్పి చేస్తున్న ప్రైవేటు వ్యాపారుల సంఖ్య 200ల పైచిలుకు ఉంటుందని అంటున్నారు. ప్రధానంగా ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ పట్టణాల్లో గిరిగిరి పేరిట ఈ డైలీ ఫైనాన్స్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఉత్తరాదికి చెందిన వ్యాపారులు ఆదివాసీ, దళితులే లక్ష్యంగా భూమిహక్కు పత్రాలు, బంగారం తనఖా పెట్టుకొని రూ.5నుంచి రూ.8 శాతం వడ్డీకి అప్పులిచ్చి ముక్కు పిండి వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఆదివాసీల సంఖ్య అధికంగా ఉన్న ఆసిఫాబాద్‌ ప్రాంతంలో ఈ గిరిగిరి ఫైనాన్స్‌ల వ్యాపారంలో లక్ష రూపాయిల నుంచి మొదలు కొని నాలుగు కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహిస్తున్న ఫైనాల్షీయర్ల సంఖ్య భారీగానే ఉందని అంటున్నారు. 

రైతుల అవసరాలే పెట్టుబడి

జిల్లాలో ప్రతి ఏటా చిన్నా, సన్నకారు రైతులు, కౌలు రైతులు పంటలకు పెట్టుబడి కోసం బ్యాంకులను ఆశ్రయించే పరిస్థితి లేదు. అలాంటి రైతుల అవసరాలను ఆసరగా చేసుకొని వడ్డీ వ్యాపారులు రైతులకు సంబంధించిన భూమి పత్రాలు/కౌలు రైతులైతే బంగారం తనఖా పెట్టుకొని 5 రూపాయల వడ్డీకి అప్పులు ఇస్తున్నట్టు చెబుతున్నారు. ఈ వడ్డీ రేటు రైతుల అవసరాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. పెద్ద మొత్తంలో రుణాలు తీసుకునే వారికి మాత్రమే రూ.5నుంచి రూ.6వడ్డీ వసూలు చేస్తుండగా పది, 20వేల అసవరం అయిన వారికి పది శాతం వరకు చక్రవడ్డీ విధిస్తున్నట్టు తెలుస్తోంది. గత 20 ఏళ్లుగా ఈ ప్రైవేటు ఫైనాన్స్‌లపై ఎలాంటి నియంత్రణ లేకపోవడం పోలీసు యంత్రాంగం కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడంతో వ్యాపారులు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా సాగుతోంది. ఆసిఫాబాద్‌ పట్టణంలోనే ఏడుగురు వ్యాపారులు రమారమి రూ.30కోట్ల పైచిలుకు రుణాలు రోజు వారీ పద్ధతిపై నడుపుతున్నారంటే ఈ నెట్‌వర్క్‌ ఏ స్థాయిలో ఉందో ఇట్టే ఊహించవచ్చు. తాజాగా నిజమాబాద్‌ జిల్లాకు చెందిన ఓ వ్యాపారి కుటుంబం అప్పుల బాధ భరించలేక, వ్యాపారుల వేధింపులకు భయపడి విజయవాడలో కుటుంబంతో సహ ఆత్మహత్యకు పాల్పడిన విషయం రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి అనుమతి లేని వడ్డీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని స్పష్టమైన ఆదేశాలివ్వడంతో జిల్లా పోలీసులు వడ్డీ వ్యాపారుల నెట్‌వర్క్‌ను ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే మార్కెట్‌లో యాక్టివ్‌గా ఉన్న ఒక్కరిద్దరిని పిలిచి విచారించగా ఇందులో వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ చోటా వ్యాపారిపై కేసులు నమోదు చేశారు. ఈ వ్యాపారి వద్దే పోలీసులకు దిమ్మతిరిగే సమాచారం లభించడంతో పెద్ద ఎత్తున లావాదేవీలు సాగిస్తున్న వ్యాపారుల భరతం పట్టేందుకు సిద్ధమవుతున్నట్టు పోలీసు శాఖకు చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 

గిరిగిరి భూతం

అధిక వడ్డీల వ్యాపారంలో గిరిగిరి (డైలీ ఫైనాన్స్‌) చిట్టీలదే ప్రధాన ప్రాత. పట్టణాల్లో చిన్నచిన్న వ్యాపారులు చేసుకునే పాన్‌షాప్‌ యాజమానులు, కూరగాయాల వ్యాపారులు, పండ్లవ్యాపారులు తోపుడు బండ్లపై అమ్మే వ్యాపారులకు పెట్టుబడి కోసం అవసరమయ్యే రూ.5, రూ.10వేలను ప్రైవేటు ఫైనాన్షియర్ల నుంచి తీసుకొని చెల్లించడం పరిపాటి. అయితే ఒక వ్యక్తికి రూ10వేలు అప్పు కావాలంటే డైలీ ఫైనాస్స్‌ వ్యాపారి ముందుగానే వెయిరూపాయలు వడ్డీ మినహాయించుకొని రూ.9వేలు ఇస్తారు. ఆ తర్వాత రోజుకు రూ.100 చొప్పున మూడున్నర నెలలు పాటు వ్యాపారుల నుంచి అసలు రాబాడుతారు. ఈ లెక్కన పదిశాతం వడ్డీ అవుతోంది. ఒక వేళ ఒక్కరోజు ఆలస్యమైన మరుసటి రోజు లేట్‌ ఫీజు పేరిట కూడా అదనపు మొత్తం వసూలు చేస్తున్నారు. ఇదే తరహాలో కొద్ది కాలం క్రితం మీడియాకు చెందిన ఒకరు డైలీ ఫైనాన్షియర్‌ వద్ద రూ.70వేలు అప్పు తీసుకుంటే మొత్తం రూ.3లక్షల వడ్డీ చెల్లించినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇంకా లక్ష పదివేలు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో బయట తెలిస్తే పరువుపోతుందని బయపడిన సదరు వ్యక్తి రూ.90వేలకు ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇలా చెప్పుకుంటే పోతే గిరిగిరి వ్యాపారుల దారుణాలు కోకొల్లలు.

Updated Date - 2022-01-15T03:57:05+05:30 IST