Abn logo
Aug 11 2020 @ 01:18AM

విషాద వైద్యం

విజయవాడలో కొవిడ్‌కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తున్న హోటల్‌ స్వర్ణప్యాలెస్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని కలిగిస్తున్నది. కరోనా మహమ్మారినుంచి ప్రాణాలు కాపాడుకోవాలని వచ్చినవారు ఈ ప్రమాదానికి బలైపోయారు. నాలుగు అంతస్థుల్లో రోగానికి చికిత్సపొందుతున్న బాధితుల్లో పదిమంది ఈ దుర్ఘటనలో మృత్యువాత పడ్డారు, మరో ఇరవైమంది తీవ్ర అస్వస్థతకు గురైనారు. భవనం తగులబడుతున్న క్రమంలో అద్దాలు బద్దలు కొట్టుకొని బాల్కనీల్లోకి వచ్చి ఆర్తనాదాలు చేసినవారు కొందరు, ప్రాణాలు కాపాడుకొనే ప్రయత్నంలో కిందకు దూకేసినవారు మరికొందరు. గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఎనిమిదిమంది కరోనా పేషంట్లు అగ్నిప్రమాదంలో మృత్యువాత పడిన కొద్దిరోజుల్లోనే విజయవాడలో ఈ ఘోరం జరగడం విషాదం. మన పాలకులకు, అధికారులకు పాఠాలు నేర్చుకొనే లక్షణం మరీ మృగ్యమైపోయింది.


ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి పెరిగిపోతూ, దేశంలో తొలిస్థానాలకు రాష్ట్రం ఎగబాకుతున్న తరుణంలో ఈ ఘటన జరిగింది. కేసులు హెచ్చుతున్న నేపథ్యంలో, మరింత ఎక్కువమందికి చికిత్స అందించేందుకు మరిన్ని వసతులు అవసరమే. కానీ, వ్యాధి పీడితులకు ప్రత్యక్షంగా చికిత్స అందించే ఆస్పత్రులకు, తాత్కాలికంగా కొవిడ్‌ సెంటర్లుగా మారిన హోటళ్ళకు నిర్మాణంలోనూ, ఏర్పాట్లలోనూ, నిర్వహణలోనూ చాలా తేడాలు ఉంటాయి. కరోనా రోగులను పెద్ద సంఖ్యలో చేర్చుకోమంటూ అధికారులనుంచీ, రాజకీయనాయకులనుంచీ ఒత్తిళ్ళు పెరిగిపోతున్న తరుణంలో, ప్రభుత్వ అనుమతితోనే ఈ హోటల్‌లో చికిత్స అందిస్తున్నామని సదరు ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం అంటున్నది. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించే బాధ్యత మాత్రమే తనదనీ, ఈ హోటల్‌ నిర్వహణ, నిర్మాణం, భద్రతా ఏర్పాట్లలో లోపాలతో తనకు సంబంధం లేదనీ అస్పత్రి యాజమాన్యం వాదన. హోటల్‌ను ఆస్పత్రికి అనుబంధంగా ఒక కొవిడ్‌ చికిత్సా కేంద్రంగా అనుమతించిన ప్రభుత్వ వైద్యశాఖే ఈ ప్రమాదానికి బాధ్యత పడాలి. ఈ విషయంలో కమిటీలు వేసి, సేవలు అందిస్తున్న ఆస్పత్రి తప్పుచేసిందో, రోగులను ఉంచిన హోటల్‌ యాజమాన్యమే పాపం చేసిందో ఇప్పుడు నిర్థారిస్తామని పాలకులు ప్రకటించడం వల్ల పోయిన ప్రాణాలు తిరిగిరావు.


డబ్బులున్నవాళ్ళే ప్రైవేటు కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు పోతున్నారని వైద్య ఆరోగ్యమంత్రి అంటున్నారు. కానీ, కేసులు ఉధృతమై, ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క, చికిత్స సరిగా అందక, ఖరీదైన ప్రైవేటు ఆస్పత్రి వైద్యానికీ, ఈ తరహా హోటల్‌ చికిత్సలకు ప్రజలు లొంగవలసి వస్తున్నమాట వాస్తవం. హోటల్‌ క్వారంటైన్‌ విధానానికి అనుమతులను ఇచ్చిన వైద్యశాఖ ముందుగా అక్కడ కనీస ఏర్పాట్లు ఉన్నాయో లేదో గమనించడం, ఆ తరువాత నిరంతరం పర్యవేక్షించడం జరగాలి. కానీ, ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ వంటి సౌకర్యాలు, స్ర్టెచర్‌ ర్యాంపులు, ప్రమాదాలు సంభవిస్తే ‍సులభంగా తప్పించే మార్గాలు లేని చోట్ల రోగులను ఉంచకూడదన్నది అధికారులకు పట్టలేదు. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా హోటల్‌ను అనుమతించే ముందు వైద్యశాఖ అధికారులు ఒక్కసారి కూడా దానిని పరిశీలించని విషయం ఇప్పుడు బయటపడుతున్నది. షార్ట్‌సర్క్యుట్‌ ప్రమాదానికి కారణమైతే, భారీగా నిల్వచేసిన శానిటైజర్లు, డిజిన్‌ఫెక్టెంట్లు, హోటల్‌ రిమోడలింగ్‌కోసం వాడే ప్లాస్టిక్‌ కాంపోజిట్‌ ప్యానెళ్ళు కలగలసి మంటలు మరింత రాజేశాయి. ప్రైవేటు ఆస్పత్రుల, హోటల్‌ యాజమాన్యాల ధనదాహం, రాజకీయ నాయకుల ఒత్తిళ్ళు, అధికారుల లాలూచీ కలగలసి రాష్ట్రంలో దాదాపు యాభై మూతబడిన హోటళ్ళు కొవిడ్‌ కేంద్రాలుగా మారిపోయాయి. కరోనాను ఆరోగ్యశ్రీలోకి తెచ్చినా, ప్రైవేటు ఆస్పత్రులు చికిత్స అందించకపోవడంతోపాటు, నిబంధనలకు అనుగుణంగా లేని ఈ హోటళ్ళలో జరుగుతున్న చికిత్సకు రోగులు లక్షలకు లక్షలు ధారపోస్తున్నా ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతున్నది.


రాష్ట్ర ప్రభుత్వం భారీ నష్టపరిహారాన్ని ప్రకటించడం బాధితకుటుంబీకులకు తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తుందేమో కానీ, పోయిన ప్రాణాలు తిరిగిరావు. లక్షల రూపాయల నష్టపరిహారాలతో జరిగిన ఘోరంపై ప్రజాగ్రహాన్ని చల్లార్చడం కంటే, అధికారుల, వ్యవస్థల వైఫల్యాలు గుర్తించడం ముఖ్యం. ఇటువంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా నివారించడంతోపాటు, కరోనాను అడ్డంపెట్టుకొని హద్దుల్లేని రీతిలో సాగుతున్న వైద్యవ్యాపారాన్ని నియంత్రించడం మరీ ముఖ్యం.

Advertisement
Advertisement
Advertisement