నేరేడ్‌మెట్‌లో విషాదం

ABN , First Publish Date - 2020-10-23T10:05:57+05:30 IST

కరోనా మహమ్మారి బారిన పడి భర్త మృతి చెందాడు. భర్త మరణాన్ని జీర్ణించుకోలేని భార్య భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది

నేరేడ్‌మెట్‌లో విషాదం

కరోనాతో భర్త మృతి

అది తట్టుకోలేని భార్య ఆత్మహత్య

ఆస్పత్రుల్లో చేర్చుకోకపోవడంతోనే ఈ అఘాయిత్యం : స్థానికుల ఆరోపణ


నేరేడ్‌మెట్‌, అక్టోబర్‌ 22 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి బారిన పడి భర్త మృతి చెందాడు. భర్త మరణాన్ని జీర్ణించుకోలేని భార్య భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని నేరేడ్‌మెట్‌ అంబేడ్కర్‌ నగర్‌లో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన  వెంకటేష్‌ (58), భార్య ధనలక్ష్మీ (55) నేరేడ్‌మెట్‌ అంబేడ్కర్‌ నగర్‌లో అద్దెకు ఉంటున్నారు. ఇద్దరూ కలిసి ఓ సూపర్‌మార్కెట్‌లో పనిచేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం వెంకటేష్‌ అనారోగ్యానికి గురయ్యాడు. అనుమానం వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో వెంకటేష్‌ హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. ఆరోగ్యం క్షీణించడంతో పాటు.. మానసిక వేదనకు గురైన వెంకటేష్‌ గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. భర్త మృతి చెందిన విషయం గుర్తించిన భార్య ధనలక్ష్మి  తట్టుకోలేక పోయింది. ఆత్మహత్య చేసుకోవాలని భావించి ఇంట్లోనే ఉరేసుకునేందుకు ప్రయత్నించింది. కుదరకపోవడంతో బిల్డింగ్‌పైకి ఎక్కి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. 


ఆసుపత్రుల్లో చేర్చుకోకపోవడంతో..

పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తర్వాత చికిత్స చేయించుకుందామని వెంకటేష్‌ పలు ఆసుపత్రులకు వెళ్లారు. ప్రస్తుతం కరోనా పేషెంట్లను చేర్చుకోవడం లేదంటూ చాలా ఆసుపత్రుల సిబ్బంది తిప్పి పంపినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దాంతో మానసికంగా బాగా కృంగిపోయిన వెంకటేష్‌ ఒక వైపు భయంతో, మరోవైపు ఆరోగ్యం క్షీణించి మృతి చెందినట్లు తెలుస్తోంది.


వెనుకా ముందు ఎవరూలేరు..

వెంకటేష్‌, ధనలక్ష్మి దంపతులకు పిల్లలు లేరు. అయిన వాళ్లు కూడా పెద్దగా ఎవరూ లేకపోవడంతో భార్యభర్తలు ఇద్దరు పనిచేసుకొని బతుకుతున్నారు. కళ్లముందే భర్త మృతితో ఇంక ఎవరికోసం బతకాలని భావించిన ధనలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని దూరపు బంధువుకు ఫోన్‌ చేసి చెప్పినట్లు తెలుస్తోంది. దంపతుల మృతితో నేరేడ్‌మెట్‌ ప్రాంతం లో విషాదఛాయలు అలుముకున్నాయి. సీఐ నరసింహ స్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-10-23T10:05:57+05:30 IST