ఎద్దులవారిపల్లెలో విషాదం

ABN , First Publish Date - 2022-05-18T05:29:51+05:30 IST

కురబలకోట మండలంలోని తానామిట్ట వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందడంతో స్వగ్రామం ఎద్దులవారిపల్లెలో విషాదం నెలకొంది.

ఎద్దులవారిపల్లెలో విషాదం
మృతదేహాలను శ్మశానవాటికకు తీసుకెళుతున్న బంధువులు

చికిత్స పొందుతూ అజీరా మృతి

కన్నీటి వీడ్కోలు పలికిన గ్రామస్థులు

నాలుగు మృతదేహాలకు పూర్తయిన అంత్యక్రియలు


మదనపల్లె క్రైం, తంబళ్లపల్లె, మే 17: కురబలకోట మండలంలోని తానామిట్ట వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందడంతో స్వగ్రామం ఎద్దులవారిపల్లెలో విషాదం నెలకొంది. ప్రమాదంలో తంబళ్లపల్లె మండలం ఎద్దులవారిపల్లెకు చెందిన అజీరా, ఆమె పిల్లలు జోయా, జునెద్‌, ఆమె చిన్నాన్న కుమారుడు ఖాదర్‌బాషా మృతి చెందారు. వీరంతా మదనపల్లెలో జరిగిన బంధువు పుట్టినరోజు వేడుకకు హాజరై తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. మృతదేహాలకు మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో మంగళవారం పోస్టుమార్టం నిర్వహించారు. బాధిత కుటుంబీకులు, వారి బంధువులు జిల్లా ఆస్పత్రిలోని మార్చురీ వద్దకు చేరుకుని భోరున విలపించారు. అనంతరం పోలీసులు మృతదేహాలను బంధువులకు అప్పగించారు. నలుగురి మృతదేహాలు స్వగ్రామం ఎద్దులవారిపల్లెకు చేరడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఊరు ఊరంతా అజీరా, ఖాదర్‌బాషాల ఇళ్ల వద్దకు చేరారు. కడచూపు చూసేందుకు ఎద్దులవారిపల్లె చుట్టుపక్కల గ్రామాలకు చెందిన జనం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలకు నివాళులర్పించి, బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి గ్రామానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి ఘటనపై ఆరా తీశారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించి రూ.లక్ష ఆర్థికసాయం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అనంతరం మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. జనం పెద్దసంఖ్యలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. టీడీపీ మండల నాయకులు కూడా బాధిత కుటుంబాలను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ రెడ్డినారాయణ, ములకలచెరువు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గంట్ల రజనీ సురేంద్ర, వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


అయ్యో పాపం అజీరా..

ఎద్దులవారిపల్లెకు చెందిన అజీరాకు పదేళ్ల కిందట మండలంలోని రేణిమాకులపల్లెకు చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు జోయా, జునెద్‌లు ఉన్నారు. కొంతకాలం కిందట దంపతుల మధ్య విభేదాలు రావడంతో అలిగి పుట్టింటికి వచ్చేసింది. అప్పటి నుంచి తిరిగి కాపురానికి వెళ్లకుండా పుట్టింటిలోనే ఉంటూ స్థానిక ప్రాథమిక పాఠశాలలో పిల్లలను చదివిస్తోంది. కాగా జోయా నాలుగో తరగతి, జునెద్‌ ఒకటో తరగతి చదువుతున్నాడు. పిల్లలతో కలసి బంధువు పుట్టినరోజు వేడుకకు వెళ్లొస్తూ..దారిలో తానామిట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. తీవ్రంగా గాయపడిన అజీరాను తిరుపతి ఆస్పత్రి నుంచి బెంగుళూరుకు తరలిస్తుండగా సోమవారం రాత్రి మృతి చెందింది. తల్లీబిడ్డలు మృత్యువాతపడడంతో వారి కుటుంబీకులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. 


వయసొచ్చిన బిడ్డను పోగొట్టుకుని..

ఖాదర్‌బాషా ఇంటర్‌ వరకు చదివి తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఇంటి వద్ద వ్యవసాయ పనులు చేస్తూ కువైత్‌కు వెళ్లే సన్నాహాల్లో ఉన్నాడు. వయసొచ్చిన బిడ్డ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. చెట్టంత బిడ్డ దూరమయ్యాడని ఆ తల్లిదండ్రుల రోదనలు చూసి జనం కంటతడి పెట్టారు. ఖాదర్‌బాషా మరణం ఆ ఇంట విషాదం నింపింది.



Updated Date - 2022-05-18T05:29:51+05:30 IST