పండగ పూట విషాదం

ABN , First Publish Date - 2022-08-13T05:54:39+05:30 IST

పుట్టిన రోజే చివరి రోజు అయ్యింది. సోదరితో రాఖీ కట్టించుకుని.. సరదాగా కబుర్లు చెప్పిన ఆ యువకుడిపై విధి చిన్నచూపు చూసింది.

పండగ పూట విషాదం

సోదరితో రాఖీ కట్టించుకుని.. 

తాతయ్య ఆశీర్వాదం తీసుకుందామని బయల్దేరి.. తిరిగి రాని లోకాలకు..  

పుట్టినరోజు నాడే ట్రాక్టర్‌ ఢీకొని యువకుడి దుర్మరణం

బెలగాం, ఆగస్టు 12 :  పుట్టిన రోజే చివరి రోజు అయ్యింది. సోదరితో రాఖీ కట్టించుకుని.. సరదాగా కబుర్లు చెప్పిన ఆ యువకుడిపై విధి చిన్నచూపు చూసింది. తాతయ్య ఆశీర్వాదం తీసుకుందామని ఇంటి నుంచి బయల్దేరి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.  ట్రాక్టరు రూపంలో మృత్యువు  కాటేసింది.  ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా.. పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది.  పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం పట్టణం బూరాడవీధికి చెందిన  భానుప్రసాద్‌ (21)ది పేద కుటుంబం. కూలి పనులు చేసుకునే తల్లిదండ్రులు రణభేరి రమణ, సుజాతలు అప్పు చేసి ఆ యువకుడిని ఇంజినీరింగ్‌ వరకూ చదివించారు.  ప్రస్తుతం భానుప్రసాద్‌ ఉద్యోగ వేటలో ఉంటూ తండ్రికి  కార్పెంటర్‌ వృత్తిలో సహాయపడుతున్నాడు. శుక్రవారం భానుప్రసాద్‌ తన సోదరితో ఇంట్లో రాఖీ కట్టించుకున్నాడు. నర్సిపురంలో ఉన్న తన తాతయ్య వద్ద ఆశీర్వాదం తీసుకోవాలని అనుకున్నాడు. తన బావ బొత్స గణేష్‌ను తోడు తీసుకుని  బైక్‌పై బయల్దేరాడు. పార్వతీపురం - బొబ్బిలి ప్రధాన రహదారిలో నర్సిపురం శివారులో ఉన్న బ్యాంకు వద్ద వారి బైక్‌ను ట్రాక్టర్‌ ఢీకొంది. ఈ దుర్ఘటనలో భానుప్రసాద్‌  అక్కడికక్కడే మృతి చెందాడు. గణేష్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు 108 వాహనంలో క్షతగాత్రుడిని జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. మృతదేహానికి పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు.  రూరల్‌ ఎస్‌ఐ వై.సింహాచలం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


  

Updated Date - 2022-08-13T05:54:39+05:30 IST