పండగ పూట విషాదం

ABN , First Publish Date - 2021-01-15T05:30:00+05:30 IST

పండగ పూట ఓ ఇంటిలో విషాదం అలముకుంది. అందొచ్చిన కొడుకు అందని లోకాలకు వెళ్లిపోయాడు.

పండగ పూట విషాదం

 యువకుడి అనుమానాస్పద మృతి

గంట్యాడ, జనవరి 15: పండగ పూట ఓ ఇంటిలో విషాదం అలముకుంది. అందొచ్చిన కొడుకు అందని లోకాలకు వెళ్లిపోయాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కొర్లాం గ్రామానికి చెందిన కె.భానుప్రకాష్‌(20) ఈనెల 12న ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆయన కోసం కుటుంబీకులు, స్నేహితులు వెతకడం ప్రారంభించారు. అయినా ఆచూకీ లభించలేదు. అయితే 13వ తేదీన విజ యనగరం మండలం ద్వారపూడి ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్టు రైల్వే పోలీసులు గుర్తించారు. అందిన సమాచారం మేరకు ఆ మృతదేహాన్ని భానుప్రకాష్‌ కుటుంబీకులు, స్నేహితులు చూసేందుకు గురువారం వెళ్లారు. అది భానుప్రకాష్‌ మృతదేహంగా నిర్ధారించుకున్నారు. అయితే ఎలా మృతి చెందాడు అనేదానిపై వివరాలు తెలియరావడం లేదు. ఆత్మహత్య చేసుకున్నాడా? ఇంకా ఏదైనా కారణం వల్ల మృతి చెందాడా? అనేది తెలియరాలేదు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అందొచ్చిన కొడుకు మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు.

 చికిత్స పొందుతూ మరో యువకుడు..

బొబ్బిలి:  రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడు చికిత్సపొందుతూ గురువారం మృతిచెందాడు. ఎస్‌ఐ చదలవాడ సత్యనారాయణ కథనం ప్రకారం.. సాలూరు మండలం ముంగివానివలస గ్రామానికి చెందిన గొబ్బూరి మురళి (24) తన స్నేహితుడు అనిల్‌కుమార్‌తో కలిసి బైకుపై ఈనెల3న సాలూరు నుంచి పార్వతీపురం వెళుతుండగా, బొబ్బిలి జూట్‌మిల్లు సమీపంలోగల రోడ్డు డివైడర్‌ను ఢీకొని ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయా లపాలైన మురళిని స్థానిక సీహెచ్‌సీలో చేర్పించి, ప్రాథమిక చికిత్స చేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతిచెందాడు. అనిల్‌కుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడికి భార్య కల్పన, మూడేళ్ల కుమారుడు, తల్లిదండ్రులు ఉన్నారు. ఒకే ఒక్క కుమారుడు ఇలా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆ కుటుంబమంతా కన్నీరు మున్నీరవుతోంది. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చదలవాడ తెలిపారు.

Updated Date - 2021-01-15T05:30:00+05:30 IST