పదేళ్ల చిన్నారిని రక్షించబోయి.. ముగ్గురు యువతుల మృతి

ABN , First Publish Date - 2020-05-14T11:28:50+05:30 IST

తమతోపాటు కుంట వద్దకొచ్చిన బాలుడు నీటిలో..

పదేళ్ల చిన్నారిని  రక్షించబోయి.. ముగ్గురు యువతుల మృతి

విషాదం

నీటి కుంటలో మునిగిపోతున్న పదేళ్ల చిన్నారిని రక్షించబోయి ప్రమాదవశాత్తు ముగ్గురు యువతుల మృతి

శోకసముద్రంలో తిమ్మసముద్రం ఎస్సీ కాలనీ 

మృతుల్లో ఒకరు వివాహిత, ఇద్దరు అవివాహితులు

అన్నదమ్ముల కుటుంబాల్లో విషాదం


నాగులుప్పలపాడు(ప్రకాశం): 

ముక్కుపచ్చలారని బాలుడ్ని రక్షించబోయి వారు అమరులయ్యారు! తమ వేలిపట్టుకుని, కొంగుచాటున అడుగులో అడుగువేసుకుంటూ వచ్చిన చిన్నారి ఈతకొడుతూ నీళ్లలో మునిగిపోతుంటే వారు చలించిపోయారు!! ఒకరికొకరుతోడుగా ఉండే ముగ్గురు మహిళలు మరో ప్రాణాన్ని నిలబెట్టే క్రమంలో మరణాన్నీ కలిసే పంచుకున్నారు!!!


మృతుల్లో ఒక వివాహిత తనకు లోకంపోకడ తెలియని ఇద్దరు బిడ్డలున్న సంగతి మరచిపోయింది! కళ్లెదుటే నీళ్లలో మృత్యుదేవత తన ఒడిలోకి తీసుకెళ్తున్న బాలుడి ప్రాణరక్షణే లక్ష్యంగా సాహసించి వీరమరణం పొంది గెలిచింది!! ఈమెకు తోడుగా మరో ఇద్దరు మహిళలు ఈ పోరాటంలో అశువులు బాశారు!!


ఇంట్లో తల్లి అచేతనంగా పడిఉండడం ఆమె చుట్టూ శోకాలు, ఆక్రందనల ప్రకంపనలే.. అవేంటో తెలియని ఆమె పొత్తిళ్ల బిడ్డలిద్దరూ అందరి మొహాలను అమాయకంగా చూస్తుండిపోయారు! తల్లి మొత్తని స్పర్శ కోసం.. తల్లి అమృత పాల కోసం.. తల్లి చల్లని ప్రేమ కోసం.. గుక్కపట్టి, నీలాలు కారుస్తూ, దోగాడుతూ వస్తుంటే.. ఆ హృదయ విదారకర ఉదంతం అందరి గుండెల్ని మెలిపెట్టింది!!


తమతోపాటు కుంట వద్దకొచ్చిన బాలుడు నీటిలో మునిగిపోతుండగా కాపాడబోయి ఒక వివాహిత, ఇద్దరు అవివాహిత మహిళలు మృత్యువాతకు గురయ్యారు. ఈ సంఘటన మండలంలోని తిమ్మసముద్రం ఎస్సీకాలనీలో జరిగింది. వివరాల్లోకి వెళితే... తిమ్మసముద్రం పల్లెకు అనుకొని ఉన్న చింత కుంటలో దుస్తులు ఉతికేందుకు వివాహిత ఏజర్ల వేదిక(22), అవివాహితులు ఏజర్ల మాధవీలత(19), ఏజర్ల సుభాషిణి(19) మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లారు. వారితోపాటు వేదిక మేనల్లుడు శశాంక్‌ అనే పదేళ్ల బాలుడు కూడా వెంటవెళ్లాడు. మహిళలందరూ దుస్తులు ఉతుకుతుండగా శశాంక్‌ నీటిలో దిగి ఈత కొట్టసాగాడు. కొద్దిసేపు సరదాగానే ఈత కొడుతూ ఒక్కసారిగా నీటిలో మునిగితేలుతూ కేకలు వేశాడు. గమనించిన ముగ్గురు మహిళలు శశాంక్‌ను కట్టపైకి నెట్టి రక్షించారు.


ఈ క్రమంలోకుంట లోతుగా ఉండడంతో వీరు ముగ్గురూ ప్రమాదవశాత్తు లోపలకు జారి ఒకరికొకరు రక్షించుకోబోయి నీటమునిగారు. ఏమిజరుగుతుందో తెలియని శశాంక్‌ పెద్దగా ఏడుస్తూ కేకలు వేశాడు. అటుగా వెళుతున్న కాలనీవాసులు ఆ కేకలు విని పరుగున వచ్చి మునిగి కనిపిస్తున్న ఓ మహిళను కాపాడే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఈ విషయం క్షణాల్లోనే కాలనీకి పాకింది. దీంతో కాలనీవాసులందరూ పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.


మహిళలు ముగ్గురూ కలిసే వచ్చారని తెలియడంతో నీటిలో గాలించి అందర్నీ బయటకు తీశారు. అప్పటికే నీళ్లు తాగి అపస్మారస్థితికి చేరి మృత్యుఒడిలోకి జారుకున్నారు. 108కు సమాచారం అందించి ఇంకొల్లు వైద్యశాలకు తరలించారు. ఆపాటికే మృతి చెందారని వైద్యులు తెలిపారు. దీంతో మృతదేహాలను ఇళ్లకు తీసుకువచ్చారు. అప్పటివరకు అందరితో కలిసి ఉన్న ముగ్గురూ మరణించారనే వార్త జీర్ణించుకోలేక తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, కాలనీవాసులు శోకసముద్రంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న ఇంకొల్లు పోలీసులు మృతుల ఇంటివద్దకు వచ్చి వివరాలు తెలుసుకొని ముగ్గురి మృతికి కారణమైన నీటి కుంటను పరిశీలించారు. 



మృతుల కుటుంబాలది ఒక్కో దీనగాథ 

దుస్తులు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన మహిళలది ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ. ఏజర్ల యోహాను, వెంకటేశ్వర్లు ఇరువురు అన్నదమ్ములు. రోజూ కూలి పనులు చేసుకుని కుటుంబాలను పోషించుకొనేవారు. యోహానుకు ఇద్దరు కుమార్తెలు. అందులో ఒకరైన మాధవీలత ఇంటర్‌ చదువుతుంది. ఎదిగివచ్చి కుటుంబానికి ఆదరవు అవుతుందనుకుంటే నీటికుంటలో పడి అర్ధంతరంగా మృత్యువాత పడిందని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. వెంకటేశ్వర్లకు ఒక కుమార్తె, ఒక కుమారుడు. డిగ్రీచదువుతున్న కుమార్తె ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోవడంతో తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. అన్నదమ్ములు పిల్లలైన అక్కాచెళ్లెలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.


చేతికి అందివచ్చిన వారిద్దరూ ఒకేసారి మృత్యువాత పడడంతో తీవ్ర విషాదం నెలకొంది. వేదిక భర్త విద్యాసాగర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. వేదికకు ఇరువురు మగపిల్లలు. ఒకరికి రెండేళ్లుకాగా, మరొక బాలుడికి ఆరునెలల వయసు ఉంటుంది. వేదిక మృతదేహం ఇంటికి చేరుకోగానే తన తల్లికి ఏమైందో తెలియని ఆ చిన్నారులు ఇద్దరు ఏడుపుతో తల్లడిల్లిపోయారు. చనిపోయిన మాధవీలత, సుభాషిణిలకు వేదిక వరసకు వదిన అవటం, వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి కుటుంబాలన్నీ విషాదంలో మునిగిపోయాయి. ఈ దుర్ఘటనతో పల్లె, గ్రామంలో విషాద వాతావరణం అలుముకుంది. ఇంకొల్లు పోలీసులు కేసు నమోదు చేసి దార్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-05-14T11:28:50+05:30 IST