పేదరికంలో మగ్గుతున్న యువతులే వాళ్ల టార్గెట్.. పని పేరుతో వారిని.. పోలీసులూ ఏం చేయలేకపోతున్నారు!

ABN , First Publish Date - 2022-08-29T14:06:07+05:30 IST

గల్ఫ్‌ మోసాలపై ఎంతగా అవగాహన కల్పిస్తున్నా కుటుంబ, ఆర్థిక అవసరాల దృష్ట్యా ఉపాధి కోసం ఎడారి దేశాలకు వస్తూ తెలుగు రాష్ట్రాల మహిళలు మోసపోతూనే ఉన్నారు. ఇక్కడికి వచ్చాక సరైన వేతనాలు లేక, స్వదేశానికి తిరిగి వెళ్లలేక విలవిలాడిపోతున్నారు. ఇటు హైదరాబాద్‌ నుంచి అటు రాయలసీమ జిల్లాల్లోని మారుమూల గ్రామాల..

పేదరికంలో మగ్గుతున్న యువతులే వాళ్ల టార్గెట్.. పని పేరుతో వారిని.. పోలీసులూ ఏం చేయలేకపోతున్నారు!

విజిటింగ్‌ వీసాలపై తీసుకొస్తున్న దళారులు

ఇంటి పనుల పేరిట నిత్యం నరకయాతనే

గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి: గల్ఫ్‌ మోసాలపై ఎంతగా అవగాహన కల్పిస్తున్నా కుటుంబ, ఆర్థిక అవసరాల దృష్ట్యా ఉపాధి కోసం ఎడారి దేశాలకు వస్తూ తెలుగు రాష్ట్రాల మహిళలు మోసపోతూనే ఉన్నారు. ఇక్కడికి వచ్చాక సరైన వేతనాలు లేక, స్వదేశానికి తిరిగి వెళ్లలేక విలవిలాడిపోతున్నారు. ఇటు హైదరాబాద్‌ నుంచి అటు రాయలసీమ జిల్లాల్లోని మారుమూల గ్రామాల వరకూ పేదరికంలో మగ్గుతున్న యువతులనే లక్ష్యంగా చేసుకుని పకడ్బందీగా జరుగుతున్న మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంలో అధికార వర్గాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. గల్ఫ్‌ దేశాల్లోని ఇళ్లలో పనిచేసే మహిళలకు బాగా డిమాండ్‌ ఉంది. కానీ, ఇందుకు సంబంధించిన వీసాలు తీసుకోవడం అంత సులువు కాదు. అనేక షరతులకు లోబడి యాజమానులు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, వీటిన్నంటినీ తుంగలో తొక్కి కొన్ని ముఠాలు దొడ్డిదారిన తెలుగు రాష్ట్రాల మహిళలను ఎడారి దేశాలకు తరలిస్తున్నారు. విజిటింగ్‌ వీసాలపై వారిని దుబాయ్‌, దోహా లేదా కువైత్‌కు తీసుకొచ్చి, అక్కడి నుంచి సౌదీ, ఇతర దేశాలకు పంపిస్తున్నారు. 



ఆ వీసాలతోనే సంవత్సరాల తరబడి వీరితో పనులు చేయిస్తున్నారు. కాంట్రాక్టు గడువు షరతుల పేరిట పాస్‌పోర్టులు లాక్కొని, వారు ఎటూ వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. కొన్ని వ్యవస్ధీకృత ముఠాలు ఈ అక్రమ మానవ రవాణాను లాభసాటి వ్యాపారంగా మార్చుకొని బాధిత మహిళలతో పాటు అరబ్‌ యాజమానులనూ మోసగిస్తున్నారు. ఇలాంటి దళారులను తెలుగు రాష్ట్రాల పోలీసులు సైతం నియంత్రించలేకపోతున్నారు. మరోవైపు భారతీయ ఎంబసీలు కూడా బాధిత మహిళలకు న్యాయం చేయలేకపోతున్నాయి. హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ కళాశాల నుంచి ఆంగ్ల సాహిత్యంలో పీజీ పూర్తిచేసిన 26 ఏళ్ల యువతితోపాటు చిత్తూరు జిల్లాకు చెందిన 37 ఏళ్ల నిరక్షరాస్య మహిళ.. ఇటీవలే ఈ తరహా బాధితుల జాబితాలో చేరారు. రెండు నెలల కసరత్తు తర్వాత ఎంబసీ అధికారులు ఆరుగురు యువతులను మాతృదేశానికి పంపించిన మరుసటి రోజే మరో ఆరుగురు యువతులు ఎంబసీ శరణాలయానికి రావడం.. అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. గల్ఫ్‌ దేశాల్లోని భారత ఎంబసీలు నిర్వహించే మహిళా శరణాలయాల్లో ఆశ్రయం పొందుతూ మాతృభూమికి తిరిగి వెళ్లడానికి నిరీక్షించే వారిలో అత్యధికులు తెలుగు మహిళలే ఉండడం గమనార్హం.


Updated Date - 2022-08-29T14:06:07+05:30 IST