Signals పడేదెప్పుడో.. ఇబ్బందులు తప్పేదెప్పుడో..!

ABN , First Publish Date - 2022-04-30T13:27:51+05:30 IST

Signals పడేదెప్పుడో.. ఇబ్బందులు తప్పేదెప్పుడో..!

Signals పడేదెప్పుడో.. ఇబ్బందులు తప్పేదెప్పుడో..!

  • ఏటీఎస్‌సీ పనుల్లో జాప్యం
  • ఆరు నెలల్లో 25 ఏర్పాటు
  • తవ్వకాల అనుమతి ఆలస్యం
  • జీహెచ్‌ఎంసీలోని విభాగాల మధ్య సమన్వయ లోపం
  • పెలికాన్‌ సిగ్నళ్ల ఏర్పాటుదీ అదే దుస్థితి
  • వర్షాకాలంలోపు పూర్తయ్యేనా..?

ఆరు నెలల క్రితం ప్రతిపాదించిన అడాప్టివ్‌ ట్రాఫిక్‌ సిస్టమ్‌ కంట్రోల్‌ (ఏటీఎస్‌సీ) అమలులో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. ఈ సాంకేతిక సిగ్నలింగ్‌ వ్యవస్థ అందుబాటులోకి వస్తే నగరంలో ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద ఇబ్బందులు తప్పుతాయి. జీహెచ్‌ఎంసీలోని వివిధ విభాగాల మధ్య పరస్పర సహకారం లేకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది.


హైదరాబాద్‌ సిటీ : నగరంలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ ఇబ్బందులను తగ్గించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ పోలీసులు నిర్ణయించారు. సిగ్నళ్లు ఉన్న ప్రధాన రహదారులను కారిడార్లుగా విభజించి ఆయా మార్గాల్లో క్రమపద్ధతిలో సిగ్నలింగ్‌ వ్యవస్థ పనిచేసేలా కసరత్తు ప్రారంభించారు. ఏటీఎస్‌సీలో భాగంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో గ్రీన్‌/రెడ్‌ సిగ్నల్‌ పడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న 221 సిగ్నళ్లతోపాటు.. 150 కొత్త చౌరస్తాలు, 94 పెలికాన్‌ సిగ్నళ్ల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను దాదాపు రూ.60కోట్ల అంచనా వ్యయంతో ఓ సంస్థకు ఆరు నెలల క్రితం అప్పగించారు. అయితే, ఇప్పటి వరకు కేవలం 25 జంక్షన్లు, 26 పెలికాన్‌ సిగ్నల్స్‌ పనులు మాత్రమే పూర్తయ్యాయి.


తవ్వకాల అనుమతిలో జాప్యం..

కొత్త సాంకేతిక విధానం ఏర్పాటులో భాగంగా జంక్షన్లలో రహదారులు తవ్వి భూగర్భంలో కేబుళ్లు వేయాలి. వాటిని చిప్‌లకు అనుసంధానం చేస్తే ప్రోగ్రామింగ్‌ ప్రకారం పనిచేస్తాయి. నగరంలో జీహెచ్‌ఎంసీతోపాటు సీఆర్‌ఎంపీ, హెచ్‌ఆర్‌డీసీఎల్‌, ఎన్‌హెచ్‌ఏఐ రహదారులున్నాయి. గ్రేటర్‌లో ప్రధాన రహదారుల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు చూసుకునే ఆయా సంస్థలు రహదారుల తవ్వకానికి అనుమతి ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నాయన్నది ఎలక్ర్టికల్‌ విభాగం వర్గాల వాదన. హెచ్‌ఆర్‌డీసీఎల్‌, ఎన్‌హెచ్‌ఏఐ రహదారుల తవ్వకాల అనుమతిలోనూ అదే జాప్యం.


జీహెచ్‌ఎంసీ పరిధిలోని రోడ్ల తవ్వకానికీ ఇంజనీరింగ్‌ మెయింటెనెన్స్‌ విభాగం అనుమతి అంతత్వరగా రావడం లేదని చెబుతున్నారు. ఏటీఎస్‌సీ సిగ్నళ్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడానికి ఇదే ప్రధాన కారణమని ఓ అధికారి చెప్పారు. అయితే ఇటీవల పనుల్లో వేగం కొంత పెరిగిందని తెలిపారు. వర్షాకాలంలో తవ్వకాలపై నిషేధం విధించనున్న నేపథ్యంలో ఆ లోపు సిగ్నళ్ల ఏర్పాటు పూర్తవుతుందా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మే 31వ తేదీలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఓ అధికారి తెలిపారు.


కారిడార్‌.. నాన్‌ కారిడార్లుగా..!

గ్రేటర్‌లోని రోడ్లను జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ పోలీసులు కారిడార్‌, నాన్‌ కారిడార్లుగా విభజించారు. కారిడార్ల పరిధిలోని సిగ్నళ్ల ఏర్పాటుకు తొలుత ప్రాధాన్యమిస్తున్నారు. ఏటీఎస్‌సీలో వాస్తవ సమయ డిమాండ్‌ (రియల్‌ టైం డిమాండ్‌) ఆధారంగా సిగ్నళ్ల సమయం ఎంత సేపు ఉండాలన్నది అప్‌డేట్‌ అవుతుంటుంది. నిర్ణీత దూరంలో వాహనాలు లేనిపక్షంలో ఆటోమేటిక్‌గా సిగ్నల్‌ మారుతుంది. గ్రీన్‌వేవ్‌ రూట్‌కు అనుగుణంగా సిగ్నళ్లు ఆటోమేటిక్‌గా పని చేస్తాయని ఓ అధికారి చెప్పారు. దీంతో సిగ్నళ్ల వద్ద ఆగకుండా ప్రయాణించే వెసులుబాటు కలుగుతుంది. ఏదైనా చౌరస్తా వద్ద గ్రీన్‌ సిగ్నల్‌ పడి... నిర్ణీత సమయంలోపు తదపరి జంక్షన్‌కు చేరుకుంటే అక్కడా గ్రీన్‌వేవ్‌ రూట్‌ ఉంటుంది. తద్వారా మరో సిగ్నల్‌ వద్ద ఆగకుండా వెళ్లిపోవచ్చు.

Updated Date - 2022-04-30T13:27:51+05:30 IST