జంక్షన్‌.. టెన్షన్‌..

ABN , First Publish Date - 2022-06-25T05:51:07+05:30 IST

జంక్షన్‌.. టెన్షన్‌..

జంక్షన్‌.. టెన్షన్‌..

బెంజిసర్కిల్‌ వద్ద కొత్త సిగ్నలింగ్‌తో అవస్థలు

ఆగే సమయం 160 సెకన్లు

వెళ్లేది మాత్రం 60 సెకన్లు

రెండు, మూడుసార్లు ఆగితేనే జంక్షన్‌ దాటే అవకాశం


(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : బెంజిసర్కిల్‌ వద్ద ట్రాఫిక్‌ సిగ్నల్‌ దాటడం ప్రహసనంలా మారింది. కొత్త సిగ్నలింగ్‌ వ్యవస్థలో భాగంగా ఆగే సమయాన్ని 160 సెకన్లు కేటాయించిన అధికారులు, రాకపోకలు సాగించే సమయాన్ని మాత్రం 30-60 సెకన్లకే కుదించారు. దీంతో వెళ్లే సమయం ఏమాత్రం సరిపోక, సిగ్నల్‌ వద్ద రెండు, మూడుసార్లు ఆగాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.  ఇంతకుముందు బెంజిసర్కిల్‌లో నిర్మల జంక్షన్‌ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను వదిలాక ఎంజీ రోడ్డు, ఎన్టీఆర్‌ సర్కిల్‌వైపు ట్రాఫిక్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేవారు. తర్వాత స్క్యూబ్రిడ్జి వైపు నుంచి రామవరప్పాడువైపు వెళ్లే ట్రాఫిక్‌ను విడిచిపెట్టేవారు. ఆ తర్వాత దీనికి మార్పులు చేశారు. నిర్మల జంక్షన్‌వైపు ట్రాఫిక్‌ను వదిలాక ఎంజీ రోడ్డువైపు ట్రాఫిక్‌ను వదిలేవారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ సర్కిల్‌వైపు నుంచి ఎంజీ రోడ్డులోకి వెళ్లే వాహనాలకు సిగ్నల్‌ ఇచ్చేవారు. ఆ తర్వాత స్క్యూబ్రిడ్జివైపు నుంచి వచ్చే వాహనాలను వదిలేవారు. తాజాగా ఇక్కడ వీఎంసీ అధికారులు రూ.19 లక్షలతో కొత్త సిగ్నలింగ్‌ వ్యవస్థను తీసుకొచ్చారు. వాహనాలతో పాటు పాదచారులకు ప్రత్యేకంగా సిగ్నల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ సిగ్నల్స్‌ ఏర్పాటుచేశాక ట్రాఫిక్‌ చిక్కులు పెరిగాయి. బెంజిసర్కిల్‌ను దాటాలన్నా, అక్కడి వరకు వచ్చి యూటర్న్‌ తీసుకోవాలన్నా ఒక వాహనదారుడు కనీసం రెండు, మూడుసార్లు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పటమట, తాడిగడప, మచిలీపట్నం వైపు వెళ్లాల్సిన వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. రెడ్‌ సిగ్నల్‌కు 160 సెకన్లను కేటాయించగా, గ్రీన్‌సిగ్నల్‌కు కేవలం 30-60 సెకన్ల సమయాన్ని కేటాయించారు. గ్రీన్‌సిగ్నల్‌ పడినా.. సర్కిల్‌కు దగ్గరగా ఉన్న వాహనాలే ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా వాహనాలన్నీ ఆగిపోతు న్నాయి. మళ్లీ గ్రీన్‌సిగ్నల్‌ ఎప్పుడు పడుతుందా.. అని వాహనదారులు అసహనంతో ఎదురుచూస్తున్నారు. 


రద్దీని బట్టి మారుస్తాం..

ఇప్పటి వరకు బెంజిసర్కిల్‌లో మామూలుగానే మేము ట్రాఫిక్‌ను నియంత్రించాం. కొత్తగా ఏర్పాటుచేసిన సిగ్నల్స్‌కు వాహనదారులు అలవాటు పడాల్సి ఉంది. ఏ మార్గంలో ఎక్కువ ట్రాఫిక్‌ రద్దీ ఉంటోంది, ఏ మార్గంలో తక్కువ రద్దీ ఉంటుందో పరిశీలించి దాన్నిబట్టి సమయాలను మారుస్తాం. - రవికుమార్‌, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌

Updated Date - 2022-06-25T05:51:07+05:30 IST