Abn logo
Sep 18 2021 @ 01:38AM

రైల్వే వంతెనలు ఎప్పుడు?

కొండాయపాళెం గేటు వేయడంతో ఆగిన వాహనదారులు

ఎంత అభివృద్ధి చెందుతున్నా గేట్లు దాటాల్సిందేనా?

నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌ కష్టాలు

గేటు పడితే బారులు తీరుతున్న వాహనాలు

వర్షాకాలం అయ్యప్పగుడి ఫ్లైఓవరే దిక్కు

టీడీపీ హయాంలో అడుగులు.. ఆ తర్వాత స్తబ్దత


రాష్ట్రంలోనే మూడో అతిపెద్ద నగరం. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల వరుసలో ముందు వరుసలో ఉంటుంది. వ్యాపార, వాణిజ్యాలకు కేంద్రం. సుమారు ఎనిమిది లక్షలకుపైగా జనం. అయినా తూర్పు, పడమర ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించాలంటే రైల్వే గేట్లు దాటాల్సిందే. ఒక్కసారి గేటు పడితే బారులు తీరే వాహనాలు, గేటు మొరాయిస్తే చుట్టూ తిరిగి వెళ్లాల్సిన దుస్థితి. ఇదీ నెల్లూరు నగర పరిస్థితి. నెల్లూరు, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : 


నెల్లూరు నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. ప్రజలతోపాటు వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో నగరంలో ట్రాఫిక్‌ కష్టాలు ఎక్కువవుతున్నాయి. వాటికి తోడు రైల్వే లెవల్‌ క్రాసింగుల వద్ద ఫ్లైవోవర్‌ వంతెనలు లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పరిస్థితి మరింత జఠిలంగా మారుతోంది. దీని వల్ల వాహనదారు లకు తీవ్ర అసౌకర్యానికితోడు అత్యవసర పనులపై వెళ్లేవారు సకాలంలో గమ్యానికి చేరుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీవీనగర్‌లోని రైల్వే గేటుకు ఇటీవల తరచూ మరమ్మతులు చేయాల్సి వస్తోంది. అలాంటి సందర్భాల్లో  వాహనదారులు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఫలితంగా వారికి పెట్రోలు, డీజిల్‌ ఖర్చు పెరుగుతోంది. వాయు కాలుష్యమూ అధికమవుతోంది.


నగరంలో ప్రస్తుతం అయ్యప్పగుడి కూడలి సమీపంలో మాత్రమే రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి ఉంది. మాగుంట లేఅవుట్‌, రామలింగాపురం, విజయమహాల్‌ గేటు, ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద రైల్వే అండర్‌ బ్రిడ్జిలు ఉన్నాయి. ఇక ప్రధానమైన బీవీనగర్‌, కొండాయపాళెం గేటు, విజయమహాల్‌ గేటు, రంగనాయకుల పేట లెవల్‌ క్రాసింగ్‌ వద్ద మాన్యువల్‌ రైల్వే గేట్లు ఉన్నాయి. వీటి మీదుగా నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. మెయిన్‌ రోడ్డు నుంచి మినీబైపాస్‌కు చేరాలంటే వీటిలో ఏదో ఒక గేటు దాటాల్సిందే. అయితే, నగరంలోని తూర్పు, పడమర ప్రాంతాలను అనుసంధానించే ఈ గేట్లు వేసినప్పుడు పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపో తున్నాయి. అలాగే, వర్షాకాలంలో అండర్‌ బ్రిడ్జీలు నీటితో నిండిపోవడంతో రాకపోకలు సాగించడం కష్టమవుతోంది. ఆ సమయంలో అయ్యప్పగుడి ఫ్లైఓవర్‌ ఒక్కటే నగరవాసులకు దిక్కవుతోంది. ఇదంతా ప్రజలకు అసౌకర్యాన్ని, అదనపు భారాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో రైల్వే లెవల్‌ క్రాసింగ్‌లపై వంతెన నిర్మాణానికి టీడీపీ హయాంలో సన్నాహాలు జరిగాయి. అప్పట్లో కేంద్ర, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖల మంత్రులు జిల్లా వారే కావడంతో వేగంగా అడుగులు పడ్డాయి. బీవీ నగర్‌, కొండాయపాళెం గేటు, ముత్యాలపాలెం వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణానికి జిల్లా అధికారులు రైల్వే శాఖకు ప్రతిపాదనలు పంపారు. అందులో బీవీనగర్‌, కొండాయపాళెం గేటు వద్ద ఫ్లైఓవర్‌ బ్రిడ్జీలు నిర్మించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఆ రెండు చోట్ల సాయిల్‌ టెస్ట్‌(మట్టి పరీక్షలు) కూడా నిర్వహించారు. దీంతో తొందర్లోనే వంతెనలు నిర్మిస్తారని నగరవాసులు ఆశించారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. నగర ప్రజల కష్టాలను పట్టించుకునేవారు కరువయ్యారు. రైల్వే ఫ్లైఓవర్ల గురించి ఉన్నతస్థాయిలో చర్చించే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటికైనా ఈ అంశంపై పెద్దలు దృష్టి సారించాల్సిన అవసరముందన్న అభిప్రాయం నగరవాసుల నుంచి వ్యక్తమవుతోంది.