గంటపాటు దంచికొట్టింది..!

ABN , First Publish Date - 2020-06-01T11:28:29+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆదివారం భారీ వర్షం కురిసింది. 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలతో రెండు రోజులుగా

గంటపాటు దంచికొట్టింది..!

ఎడతెరిపి లేకుండా వాన

జలమయమైన లోతట్టు ప్రాంతాలు

రోడ్లపై పోటెత్తిన వరదనీరు

పలు చోట్ల ట్రాఫిక్‌జామ్‌


హైదరాబాద్‌ సిటీ న్యూస్‌నెట్‌ వర్క్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆదివారం భారీ వర్షం కురిసింది. 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలతో రెండు రోజులుగా నగరంపై నిప్పుల వర్షం కురుస్తుండగా.. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. 2 గంటలకు చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం... గంటపాటు దంచికొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై వరదనీరు పోటెత్తడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఆగ్నేయ ఆరేబియా సముద్రం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాల్లో ఆదివారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం కారణంగా నగరంలో వర్షం కురిసినట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 


పలు ప్రాంతాలు జలమయం..

కుత్బుల్లాపూర్‌, చింతల్‌, గాజుల రామారం, పేట్‌బషీరాబాద్‌, జీడిమెట,్ల జగద్గిరిగుట్ట, గాగిల్లాపూర్‌ తండా, మియాపూర్‌ దత్తసాయినగర్‌, ఈసీఐఎల్‌ నుంచి సైనిక్‌పురి వెళ్లే ప్రధాన రహదారి రాధికా చౌరస్తా సమీపంలో కమలానగర్‌ బస్టాప్‌, మాదాపూర్‌, లింగంపల్లి, మియాపూర్‌, రాయదుర్గం, కొండాపూర్‌ ప్రాంతాల్లోని చౌరస్తా, ఆనంద్‌బాగ్‌, చార్మినార్‌, మదీనా, రాజేంద్రనగర్‌, సికింద్రాబాద్‌, అమీర్‌పేట, ఖైరతాబాద్‌, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రహదారుల పక్కన అభివృద్ధి పనుల కారణంగా తవ్విన గుంతల్లో పెద్దఎత్తున వర్షపునీరు నిలిచిపోయింది. మ్యాన్‌హోల్‌ పొంగిపొర్లి మురుగు నీటితో కలిసి దుర్వాసన వెదజల్లడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.


వర్షం తెచ్చిన ఇక్కట్లు

మియాపూర్‌ దత్తసాయినగర్‌లో చైతన్య కాలేజ్‌ వర్కర్స్‌ ఉండే ప్రాంతం లో ఇళ్లలోకి వర్షపునీరు చేరింది.

చందానగర్‌ వాంబేగృహాల వద్ద చెట్టు పడడంతో విద్యుత్‌ స్తంభం నేల కొరిగింది. 

అమీర్‌పేట, శ్రీరాంనగర్‌, ఖైరతాబాద్‌, లకిడీకాపూల్‌, లేక్‌వ్యూ గెస్ట్‌ హౌస్‌, క్యాంపు కార్యాలయం తదితర ప్రాంతాల్లో రోడ్డుపై నీరు నిలిచిపోగా జీహెచ్‌ఎంసీ సిబ్బంది చర్యలు చేపట్టారు. 

ఈసీఐఎల్‌ నుంచి సైనిక్‌పురి ప్రధాన రహదారి నిండా మునిగింది. ట్రాఫిక్‌ జామ్‌ అయింది. 

అంబర్‌పేట ఛేనంబర్‌ చౌరస్తా జలమయమైంది. 

గోల్నాక చర్చి రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది. 

కాచిగూడ కమేళా రోడ్డులో కూడా అదే పరిస్థితి. 

శేరిలింగంపల్లి నియోజకవర్గం పాపిరెడ్డికాలనీ సమీప ప్రాంతంలో అనేక చెట్లు కుప్పకూలాయి. 

లింగంపల్లి రైల్వే అండర్‌బ్రిడ్జి వద్ద వరద నీరు పోటెత్తడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. 

దీప్తిశ్రీనగర్‌లో వరదనీరు పోటెత్తింది. 

ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌ డివిజన్‌ పరిఽధిలోని బండచెరువు లోతట్టు ప్రాంతమైన షిర్డీనగర్‌లో నీరు రోడ్లపై  ప్రవహించింది. 

చార్మినార్‌, కిషన్‌బాగ్‌, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, హఫీజ్‌బాబానగర్‌ ప్రాంతాలలో వర్షం నీరు మోకాళ్ళలోతు వరకు నిలిచింది.

గచ్చిబౌలి గౌలిదొడ్డిలోని కేశవనగర్‌లో మూడు ఇళ్ల కప్పులు పగిలిపోయాయి.


ట్రాఫిక్‌ జామ్‌

వర్షం కారణంగా బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట, షేక్‌పేట, ఖైరతాబాద్‌, బేగంపేట్‌, ఎల్‌బీనగర్‌, తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ అయింది.


విద్యుత్‌ సరఫరాలో అంతరాయం...

భారీ వర్షానికి విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. చిక్కడపల్లి, మెహిదీపట్నంలో కొంత సమయం విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కూకట్‌పల్లి, మూసాపేట, బాలానగర్‌, ఉప్పల్‌, తదితర ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి. 


తక్షణమే స్పందించిన మేయర్‌

భారీ వర్షానికి జీహెచ్‌ఎంసీ వెంటనే అప్రమత్తమైంది. మేయర్‌ బొంతు రామ్మోహన్‌ వెంటనే రంగంలోకి దిగి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో 267 మాన్సూన్‌ ఎమర్జెన్సీ బృందాలను అందుబాటులో ఉంచామని, 16 డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. నగరంలోని 53 మేజర్‌ నాలాలను క్లీన్‌ చేశామని, మ్యాన్‌హోల్స్‌కు ఒక జీహెచ్‌ఎంసీ సిబ్బందిని బాధ్యున్ని నియమించామని, ఎక్కువగా నీరు నిలిచే 30 ప్రాంతాలను గుర్తించి అక్కడ నీటిని తోడేందుకు మోటార్లను ఏర్పాట్లు చేశామన్నారు. 70 ఎక్స్‌కవేటర్‌ లను అందుబాటులో ఉంచి చెట్లు పడిన 10 ప్రాంతాల్లో వెంటనే క్లియర్‌ చేశామని తెలిపారు. గత మూడేళ్లుగా నగరంలోని 1500 శిథిల భవనాలను కూల్చివేశామని, గుర్తించిన మరో 200 శిథిల భవనాల ను త్వరలో  కూల్చివేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని బొంతు తెలిపారు.


వర్షపాతం నమోదు.. (మిల్లీ మీటర్లలో)

పటాన్‌చెరు 69.3 

హయత్‌నగర్‌ 65.0

కూకట్‌పల్లి 55.0

వైదేహినగర్‌ 44.0

అబ్దుల్లాపూర్‌మెట్‌42.3

శేరిలింగంపల్లి 40.8

ఖాజాగూడ 40.8 

షేక్‌పేట 23.0

ఉప్పల్‌ 22.8 


Updated Date - 2020-06-01T11:28:29+05:30 IST