మళ్లీ జామ్‌..! నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌

ABN , First Publish Date - 2021-02-26T06:17:39+05:30 IST

కొవిడ్‌ భయంతో

మళ్లీ జామ్‌..!  నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌


రోడ్లపైకి భారీగా వస్తున్న బైక్‌లు, కార్లు

ఫ్లై ఓవర్ల వద్ద గంటలపాటు అవస్థలు

బాలానగర్‌, షేక్‌పేటలో సాయంత్రం వేళ పరేషాన్‌


కొవిడ్‌ను పక్కకు నెట్టి ఉపాధి, ఉద్యోగాలు, అత్యవసర పనుల నిమిత్తం రోడ్డెక్కుతున్న వాహనాలతో ట్రాఫిక్‌ పోటెత్తుతోంది. కరోనా ముందు నాటి పరిస్థితులు మళ్లీ ఏర్పడుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఇళ్ల నుంచి కార్యాలయాలకు వెళ్లి వచ్చే ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు లక్షల సంఖ్యలో వాహనాలతో బయటకు వస్తుండడంతో ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్‌ జామ్‌ విపరీతంగా ఉంటోంది. సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు ట్రాఫిక్‌ రద్దీ రోజుకు సగటున 65 శాతం ఉండగా ప్రస్తుతం వంద శాతానికి పెరిగినట్లు పోలీసు సిబ్బంది చెబుతున్నారు. 


హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి) : కొవిడ్‌ భయంతో మార్చి నుంచి సెప్టెంబర్‌ వరకు గజగజ వణికిపోయిన నగరవాసులు ప్రస్తుతం సాధారణంగా తిరుగుతున్నారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతోపాటు గ్రేటర్‌లో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో రాకపోకలు సాఫీగా సాగిస్తున్నారు. మరో వైపు పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు ప్రారంభంకావడంతో పాటు 25 శాతం వరకు ఐటీ కంపెనీలు, షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లు తెరుచుకున్నాయి. పరిమిత సంఖ్యలో రైళ్లు, 100 శాతం బస్సులు, మెట్రో రైళ్లు, క్యాబ్‌లు, ఆటోలు రోడ్లపై తిరుగుతుండడంతో పనుల నిమిత్తం లక్షలాది మంది బయటకు వస్తున్నారు. దీంతో కొవిడ్‌కు ముందు నాటి ట్రాఫిక్‌ కనిపిస్తోందని వాహనదారులు చెబుతున్నారు. నెల రోజులుగా వివిధ మార్గాల్లో పెరిగిపోయిన ట్రాఫిక్‌తో వాహనదారులు గంటల కొద్దీ రోడ్లపై ఇబ్బందులు పడుతున్నారు.


ఈ మార్గాల్లో ట్రా‘ఫికర్‌’

బేగంపేట-సికింద్రాబాద్‌ మార్గంలో పది రోజులుగా విపరీతమైన ట్రాఫిక్‌ ఉంటోంది. ఈ మార్గం నుంచి బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, సోమాజిగూడ, పంజాగుట్టకు వెళ్లేందుకు లక్షలాది మంది వాహనాలతో వస్తుండడంతో ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్‌ రద్దీ ఉంటోంది. వీఐపీలు కాన్వాయ్‌తో బయటకు వస్తున్న సమయంలో కనీస సమాచారం ఇవ్వకపోవడంతో ట్రాఫిక్‌ పోలీసులు వాహనదారులను 5-10 నిమిషాల పాటు రోడ్లపై ఎక్కడికక్కడ నిలిపివేస్తుండడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం మధ్యాహ్నం సుమారు 12.30 గంటల సమయంలో ప్యారడైజ్‌ నుంచి బేగంపేట వరకు గంటపాటు ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 1, 3తో పాటు పంజాగుట్ట ఫ్లై ఓవర్‌పై వాహనాలు భారీగా నిలిచిపోయాయు. అంబులెన్స్‌లు వెళ్లేందుకు కూడా అవకాశం లేకపోవడంతో వాహనదారులు ట్రాఫిక్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగడం గమనార్హం. ఓ వీఐపీ ఈ మార్గం గుండా వెళ్తున్నందున వాహనాలను అకస్మాత్తుగా నిలిపి వేయడంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. 


ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులతో

బాలానగర్‌, షేక్‌పేట ప్రాంతాల్లో జరుగుతున్న ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులతో కొద్ది రోజులుగా ట్రాఫిక్‌ కనిపిస్తోంది. పనుల కోసం గుంతలు తీయడంతోపాటు రోడ్లపై పెద్ద ఎత్తున దుమ్ము లేస్తుండడంతో వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. కిలో మీటరు దూరానికి 10 నిమిషాల సమయం పడుతోందని వాహనదారులు వాపోతున్నారు. ట్యాంక్‌బండ్‌, సికింద్రాబాద్‌, మియాపూర్‌, కూకట్‌పల్లి మార్గాల్లో సాయంత్రం వేళ పెరిగిపోతున్న ట్రాఫిక్‌తో సతమతమవుతున్నట్లు పేర్కొంటున్నారు. రోడ్ల మరమ్మతులు, ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్‌ చుక్కలు చూపిస్తోందని వారు పేర్కొంటున్నారు. ఏదేమైనా కరోనాతో మూడు నెలలు నిర్మానుష్యంగా కనిపించిన నగర రహదారులు, ఫ్లై ఓవర్లు తాజాగా ట్రాఫిక్‌తో పోటెత్తుతున్నాయి. 


Updated Date - 2021-02-26T06:17:39+05:30 IST