రైల్వేకోడూరులో ట్రాఫికర్‌

ABN , First Publish Date - 2022-04-18T05:20:30+05:30 IST

నియోజకవర్గ కేంద్రమైన రైల్వేకోడూరులో ట్రాఫిక్‌ రోజురోజుకు జటిలమైంది. బైపాస్‌ రోడ్డు లేక నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటు పాలకులు, అటు అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్‌కు తీవ్రంగా అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

రైల్వేకోడూరులో ట్రాఫికర్‌
రైల్వేకోడూరు ప్రధాన రహదారిలో భారీ వాహనాల వల్ల ట్రాఫిక్‌ జామ్‌ అయిన దృశ్యం

బైపాస్‌ రోడ్డు లేక ప్రమాదాలు

ఇబ్బందుల్లో ప్రజలు

రైల్వేకోడూరు, ఏప్రిల్‌ 17: నియోజకవర్గ కేంద్రమైన రైల్వేకోడూరులో ట్రాఫిక్‌ రోజురోజుకు జటిలమైంది. బైపాస్‌ రోడ్డు లేక నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటు పాలకులు, అటు అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్‌కు తీవ్రంగా అంతరాయం ఏర్పడుతోంది.  దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వేకోడూరు మీదుగా తిరుపతి, చెన్నై, తిరుమలకు పలు రాష్ట్రాల నుంచి వాహనాల్లో ప్రయాణికులు వెళుతుంటారు. అదే కాకుండా బెరైటీస్‌ లారీలు, ఇతర రాష్ట్రాల నుంచి లోడుతో లారీలు వెళుతుంటాయి. వీటితో ఎక్కువగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. 

రైల్వేకోడూరు నియోజకవర్గం ఉద్యాన పంటలకు కేంద్ర బిందువు. అరటి, బొప్పాయి, మామిడి తదితర పంటలను రైతులు సాగు చేస్తుంటారు. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు లారీల్లో ఎగుమతి చేస్తుంటారు. ఎక్కువగా వ్యాపార లావాదేవీలు సాగుతుంటాయి. చిట్వేలి, తిరుపతి, కడప, రాజంపేట తదితర ప్రాంతాలకు ఎక్కువగా వాహనాలు వెళుతుంటాయి. పాదచారులు రైల్వేకోడూరు పట్టణంలోని టోల్గేట్‌ నుంచి ఎన్టీఆర్‌ సర్కిల్‌ వరకు వెళ్లాలంటే తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మార్కెట్‌ వీధి, అంకమ్మనగర్‌, పాత బజారులో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాగా, బైపాస్‌ రోడ్డు మంజూ రైందని, భూ సేకరణ కూడా జరుగుతోందని అధికారులు అంటున్నారు. 


చర్యలు తీసుకుంటున్నాం

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. నో పార్కింగ్‌ బోర్డులు ఏర్పాటు చేసి ఉంచాం. గ్రామ పంచాయతీ సహకారంతో చిట్వేలి రూటులో ట్రాఫిక్‌కు అడ్డంగా వాటిని తొలగించి వేరే చోట పెట్టించాం. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు బ్లూకోల్ట్స్‌ ట్రాఫిక్‌ను నియంత్రిస్తుంటారు. రైల్వేకోడూరులో రోడ్డు ప్రమాదాలు జరిగే 6 పాయింట్లు గుర్తించి అక్కడ ప్రమాదాలు జరగకుండా వాహనదారులకు సూచనలు ఇచ్చాం.

-కె.విశ్వనాథరెడ్డి, సీఐ, రైల్వేకోడూరు


రోడ్డు ప్రమాదాలు నియంత్రించాలి

రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు ప్రణాళికతో అధికారులు ముందుకెళ్లాలి. రోడ్లపై ఎక్కువగా ఆవుల మంద ఉంటుంది. దీంతో ప్రజలు తీవ్రంగా ఇక్కట్లు పడుతున్నారు. రోడ్డు ప్రమాదాలను అధిగమించాలంటే బైపాస్‌ రోడ్డు అత్యంత అవసరం. పాలకులు, అధికారులు మందుస్తు ప్రణాళికలు చేపట్టి చర్యలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చు.

- ఎలిశెట్టి మణి, ప్రయాణికుడు, రైల్వేకోడూరు

Updated Date - 2022-04-18T05:20:30+05:30 IST