ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ట్రా‘ఫికర్‌’

ABN , First Publish Date - 2022-01-17T04:03:04+05:30 IST

జిల్లా ఏర్పడినప్పటి నుంచి జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లో ట్రాఫిక్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. రోజు రోజుకు వాహనాల రద్దీ పెరుగుతుండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పట్టణం మీదుగా హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ అంతర్రాష్ట్ర రహదారి ఉండడంతో ప్రతి నిత్యం వందల సంఖ్యలో వాహనాలు నడుస్తున్నాయి.

ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ట్రా‘ఫికర్‌’

- ఇరుకుగా రోడ్లు.. పెరిగిన వాహనాల రద్దీ

- పార్కింగ్‌కు స్థలాల కరువు

- రోడ్లపైనే వాహనాలు నిలిపివేత

- ఆటో స్టాండ్‌లకు చోటుకరువు

- జిల్లా కేంద్రంలో రెట్టింపు అవుతున్న ట్రాఫిక్‌

ఆసిఫాబాద్‌, జనవరి 16: జిల్లా ఏర్పడినప్పటి నుంచి జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లో ట్రాఫిక్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. రోజు రోజుకు వాహనాల రద్దీ పెరుగుతుండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పట్టణం మీదుగా హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ అంతర్రాష్ట్ర రహదారి ఉండడంతో ప్రతి నిత్యం వందల సంఖ్యలో వాహనాలు నడుస్తున్నాయి. వీటికి తోడు భారీ వాహనాలు కూడా పట్టణంలోకి ప్రవేశిస్తుండడంతో ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ట్రాఫిక్‌ను అదుపు చేయాల్సిన అధికారులు ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రంలో ద్విచక్ర వాహనాలతోపాటు కార్లు, ఆటోల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఉదయం 9 మొదలుకొని రాత్రి 9వరకు రోడ్లన్ని రద్దీగా మారుతున్నాయి. జిల్లా కేంద్రంలో కార్యాలయాలకు, వివిధ పనులపై మార్కెట్‌కు వచ్చే ప్రజలతో రోడ్లన్నీ కిక్కిరిసి కనిపిస్తున్నాయి. 

జిల్లా కేంద్రంలో ఎక్కడ చూసినా వాహనాల రద్దీనెలకొంది. ఫుట్‌ పాత్‌లపైనే వాహనాలు, తోపుడు బండ్లు ఉండడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. చాలీచాలని రోడ్లతో ట్రాఫిక్‌ సమస్యకు దారితీస్తున్నాయి. డివిజన్‌ కేంద్రంగా ఉన్న సమయంలోనే ప్రజలకు ఇబ్బందిగా మారిన ట్రాఫిక్‌ సమస్య జిల్లా కేంద్రం అయ్యే సరికి రెట్టింపు అయ్యాయి. జిల్లా కేంద్రం ఏర్పాటు కావడంతో వాహనాల తాకిడి పెరిగి సమస్య తీవ్ర రూపం దాల్చింది. జిల్లా కేంద్రం ఏర్పడడంతో అటు జిల్లా స్థాయి అధికారుల వాహనాలు, ఇతర మండలాల నుంచి వచ్చి పోయే వారి వాహనాల తాకిడి పెరగడంతో రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్‌ చేయాల్సిన పరిస్థితి తలెత్తుతున్నది. ఆటో స్టాండ్‌లకు అనువైన స్థలం లేక పోవడంతో రోడ్లపైనే ఆటో స్టాండ్‌లు ఏర్పాటు చేశారు. మొదలే ఇరుకైన రోడ్లు, వాటిపై నిర్వహిస్తున్న ఫుట్‌పాత్‌ వ్యాపారం కారణంగా వాహన దారుల రాక పోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇది అలా అటు ఉంచితే చివరకు పాదాచారులు సైతం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఉంది.  రోడ్డుకు ఇరువైపులా వ్యాపార, వాణిజ్య సముదాయాలు, బ్యాంకులు ఉండడంతో పార్కింగ్‌ కోసం స్థలం లేక రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్నారు. గతంలో ట్రాఫిక్‌ సమస్యను ఏ ఒక్కరు పట్టించుకోలేదు. జిల్లా కేంద్రంగా మారిన నేపథ్యంలో ట్రాఫిక్‌ దుస్థితిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ కష్టాలు

జిల్లా కేంద్రంలో ప్రధాన కూడళ్లైన అంబేద్కర్‌, వివేకానంద, గాంధీ చౌక్‌లలో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ప్రధాన కూడళ్లలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. వీటి సమీపంలోనే ఆర్టీసీ బస్టాండు, డిపో ఉండడంతో నిత్యం వాహనాలు, ఆర్టీసీ బస్సుల రాక పోకలతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తీవ్రమయ్యాయి. రోడ్లు విస్తారంగా లేక పోవడం ఇరువైపులా వ్యాపార సముదాయాలు ఉండడంతో వినియోగదారులు వస్తువుల క్రయ విక్రయాల కోసం వచ్చినప్పుడల్లా ద్విచక్ర వాహనాలను, నాలుగు చక్రాల వాహనాలను రోడ్డుపైనే ఉంచి తమ పనులను కొనసాగించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వాహనాలను రోడ్లపైనే పార్కు చేయడంతో ఇతర వాహనాల రాక పోకలు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ట్రాఫిక్‌ సమస్య తీవ్ర రూపం దాల్చింది. కాగా అంబేద్కర్‌ చౌక్‌ లో ట్రాఫిక్‌ నియంత్రణ కోసం సిగ్నల్స్‌ ఏర్పాటు చేయగా అవి సక్రమంగా పని చేయడం లేదు.

ట్రాఫిక్‌ సమస్యపై దృష్టి సారించాలి

- పత్తి హరిప్రసాద్‌, ఆసిఫాబాద్‌

జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ సమస్య రోజు రోజుకు ఎక్కువ అవుతున్నది. వాహనాల రద్దీ పెరగడంతో రోడ్లపై వాహనాలను నడపాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు దృష్టి సారించి ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించాలి.

Updated Date - 2022-01-17T04:03:04+05:30 IST