ప్రముఖులొస్తున్నారు జాగ్రత్త..!

ABN , First Publish Date - 2022-08-19T06:03:45+05:30 IST

ప్రముఖులొస్తున్నారు జాగ్రత్త..!

ప్రముఖులొస్తున్నారు జాగ్రత్త..!

రేపు నగరంలో సీజేఐ, సీఎం పర్యటన

న్యాయస్థానాల నూతన భవన సముదాయం ప్రారంభోత్సవానికి రాక

సూర్యారావుపేట చుట్టుపక్కల ట్రాఫిక్‌ ఆంక్షలు

ఎంజీ రోడ్డులో రాకపోకలు బంద్‌


ఈనెల 20.. శనివారం.. ఈ తేదీని విజయవాడ వాహనదారులు గుర్తుపెట్టుకోవాలి. ఒకరు, ఇద్దరు కాదు.. పదుల సంఖ్యలో ప్రముఖులు నగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నగరంలో భారీగా ట్రాఫిక్‌ మళ్లించేందుకు, కొన్ని రహదారులను పూర్తిగా మూసివేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.


(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : సూర్యారావుపేటలోని కోర్టుల నూతన భవన సముదాయాన్ని ప్రారంభించడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ శనివారం నగరానికి రానున్నారు.  ఆయనతో పాటు ముఖ్యమంత్రి జగన్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పీకే మిశ్రా, ఇతర న్యాయవాదులు, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారు. 20వ తేదీ ఉదయం 7 నుంచి 11 గంటల వరకు ఎంజీ రోడ్డుతో పాటు గోపాల్‌రెడ్డి రోడ్డు, ఐదో నెంబర్‌ రూటు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ప్రముఖులు రాకపోకలు సాగించే క్రమంలో ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌ను నిలుపుదల చేస్తారు. ముఖ్యంగా ఏలూరు రోడ్డుకు, మహాత్మాగాంధీ రోడ్డుకు మధ్యన ఉన్న నక్కల రోడ్డు, డోర్నకల్‌ రోడ్డు, స్టేట్‌ గెస్ట్‌హౌస్‌, మ్యూజియం రోడ్లను పూర్తిగా మూసివేస్తారు. ఈ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు, వ్యాపారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి. ప్రధాన న్యాయమూర్తి ప్రముఖ హోటల్‌లో బసచేస్తే మాత్రం జాతీయ రహదారిపైనా ట్రాఫిక్‌ను నిలుపుదల చేస్తారు. 

ట్రాఫిక్‌ మళ్లింపులు

- గోపాలరెడ్డి రోడ్డు నుంచి కోర్టుల భవన సముదాయంవైపు రాకపోకలను నిలుపుదల చేస్తారు.

- రెడ్‌సర్కిల్‌ నుంచి బీసెంట్‌ రోడ్డులోని మహంతి మార్కెట్‌ వైపు ఎలాంటి వాహనాలను అనుమతించరు.

- నక్కల రోడ్డులోని ఆంధ్ర ఆసుపత్రి నుంచి రాజ్‌భవన్‌ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు.

- రాజ్‌భవన్‌ నుంచి స్టేట్‌ గెస్ట్‌హౌస్‌ వరకు వాహనాల రాకపోకలు నిషేధం.

- మ్యూజియం రోడ్డు నుంచి కలెక్టర్‌ కార్యాలయం, అమ్మ ఎస్టేట్‌ నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు ఏవిధమైన వాహనాలను అనుమతించరు.

- ఉదయం 7 నుంచి 11 గంటల వరకు మహాత్మాగాంధీ రోడ్డులో ఆర్టీసీ వై జంక్షన్‌ నుంచి బెంజిసర్కిల్‌ వైపు ఆర్టీసీ బస్సులను అనుమతించరు.

- ఆర్టీసీ వై జంక్షన్‌ నుంచి మహాత్మాగాంధీ రోడ్డు, ఐదో నెంబర్‌ రూటులో వెళ్లే బస్సులను ఏలూరు రోడ్డు మీదుగా రామవరప్పాడు జంక్షన్‌ నుంచి బెంజిసర్కిల్‌కు మళ్లిస్తారు.

పార్కింగ్‌ ఇలా...

- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వాహనాలను కోర్టుల కొత్త భవనం ఆవరణలో పోర్టికోలో తూర్పువైపు పార్కింగ్‌ చేయాలి. 

- హైకోర్టు న్యాయమూర్తులు సివిల్‌ కోర్టుల రోడ్డులో పడమర వైపున ఉన్న గేటు దిగి, వాహనాలను ఇరిగేషన్‌ ప్రాంగణంలో పార్కింగ్‌ చేసుకోవాలి. 

- జ్యుడిషియల్‌, పోలీసు అధికారులు ఆర్‌ఐవో జంక్షన్‌ వద్ద ఉన్న సీఎస్‌ఐ చర్చి ప్రాంగణంలో వాహనాలను నిలుపుకోవాలి. 

- బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు గోపాలరెడ్డి రోడ్డులో ఉన్న రైల్వే ఆఫీసర్స్‌ క్లబ్‌ ఆవరణ, సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా ఉన్న రైతుబజారు రోడ్డు, ఆంధ్రా ఆసుపత్రి-కోర్టులకు మధ్య ఉన్న  రోడ్డులో వాహనాలను నిలుపుకోవచ్చు.

- ఆహ్వానితులు ఉదయం 8 గంటలలోపు కోర్టుల ప్రాంగణానికి చేరుకోవాలి. 

Updated Date - 2022-08-19T06:03:45+05:30 IST