మందుబాబులకూ జరిమానాల్లో రాయితీ

ABN , First Publish Date - 2022-03-01T08:05:45+05:30 IST

ట్రాఫిక్‌ చలానాల విషయంలో భారీ రాయితీలు ప్రకటించి వాహనదారులకు...

మందుబాబులకూ జరిమానాల్లో రాయితీ

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల వన్‌టైం క్లియరెన్స్‌

ఆ కేసులకు జైలు లేదు.. ఫైన్‌ మాత్రమే

బైక్‌లు, ఆటోలకు రూ.2000 చెల్లిస్తే చాలు

కారుకు రూ.3000, లారీలకు రూ.4000

మార్చి 12 వరకు లోక్‌ అదాలత్‌ అమలు

గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ట్రాఫిక్‌ పోలీసులు


హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ట్రాఫిక్‌ చలానాల విషయంలో భారీ రాయితీలు ప్రకటించి వాహనదారులకు ఊరట కల్పించిన పోలీసు ఉన్నతాధికారులు... మందుబాబులకూ ఉపశమనం కల్పించారు. పెండింగ్‌లో ఉన్న డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులను ప్రత్యేక లోక్‌ అదాలత్‌ ద్వారా క్లియర్‌ చేయాలని నిర్ణయించారు. ఈ కేసుల్లో పట్టుబడినవారికి జరిమానాల విషయంలో భారీ రాయితీలు ప్రకటించారు. అలాగే ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న కేసుల్లో ఎలాంటి జైలు శిక్షలు లేకుండా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అన్ని కమిషనరేట్‌ల పరిధిలోని న్యాయస్థానాల్లో మార్చి 12 వరకు లోక్‌ అదాలత్‌లు ఏర్పాటుచేయనున్నట్టు ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు. డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడి వాహనాలు వదిలేసుకున్న అనేకమంది... జైలు శిక్ష పడుతుందేమోనని భయపడి పోలీసులను, కోర్టులను సంప్రదించడం మానేశారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల్లో జరిమానా రూ.10వేలకు పైగా చెల్లించాల్సి రావడంతో పాత బైక్‌లను వదిలేసుకున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల్లోనూ రాయితీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. 


డ్రంకెన్‌ డ్రైవ్‌ రాయితీలు ఇలా...

డ్రంకెన్‌ డ్రైవ్‌లో పోలీసులు చెక్‌ చేసినప్పుడు బ్రీత్‌ ఎనలైజర్స్‌లో నమోదైన బ్లడ్‌ ఆల్కహాల్‌ కంటెంట్‌ పాయింట్లు, అలాగే ఆ సమయంలో  నడుపుతున్న వాహనం బైకా, కారా, లారీనా అనే విషయాలను పరిగణనలోకి తీసుకొని జరిమానాల రాయితీలను నిర్ణయించారు. టూ వీలర్‌, త్రీ వీలర్‌, ఫోర్‌ వీలర్‌, హెవీ వాహనాలకు వేర్వేరుగా రాయితీలను ప్రకటించారు. అలాగే బాధితులు ఒకవేళ డ్రంకెన్‌ డ్రైవ్‌లో రెండోసారి పట్టుబడినవారైతే... రాయితీ తర్వాత నిర్ణయించిన జరిమానాకు రెండింతలు (డబుల్‌) చెల్లించాల్సి ఉంటుంది.


డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని కేసులకూ రాయితీ

డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపి పట్టుబడ్డ కేసులు, మైనర్‌ డ్రైవింగ్‌ కేసుల్లో సైతం రాయితీలు ప్రకటించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఏర్పాటుచేసిన ప్రత్యేక లోక్‌ అదాలత్‌లోనే పెండింగ్‌ కేసులను క్లియర్‌ చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. ఏవైనా సలహాలు, సూచనలు కావాలంటే సంబంధిత ట్రాఫిక్‌ పోలీసులను సంప్రదించాలని తెలిపారు. ఈ రాయితీలతొ లోక్‌ అదాలత్‌ ఇప్పటికే ప్రారంభమైందని, మార్చి 12న ముగుస్తుందని వెల్లడించారు. వాహనదారులు వెంటనే తమ పెండింగ్‌ కేసులను క్లియర్‌ చేసుకోవాలన్నారు.  గడువు ముగిసిన తర్వాత పాత పద్ధతిలోనే జరిమానాలు యధావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు.

Updated Date - 2022-03-01T08:05:45+05:30 IST