సంప్రదాయబద్ధంగా ఆషాఢ పౌర్ణమి ఉత్సవం

ABN , First Publish Date - 2021-07-25T05:44:34+05:30 IST

ఆషాఢ పౌర్ణమి ఉత్సవాన్ని సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో శనివారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి సుప్రభాతసేవను నిర్వహించారు.

సంప్రదాయబద్ధంగా ఆషాఢ పౌర్ణమి ఉత్సవం
క్యూ లైన్లలో నిరీక్షిస్తున్న భక్తులు

భక్తిశ్రద్ధలతో అప్పన్నకు నాల్గోవిడత చందనం సమర్పణ 

పెద్దసంఖ్యలో స్వామిని దర్శించుకున్న భక్తులు 


సింహాచలం, జూలై 24: ఆషాఢ పౌర్ణమి ఉత్సవాన్ని సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో శనివారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి సుప్రభాతసేవను నిర్వహించారు. వేద పండితులు చతుర్వేదాలు పఠిస్తుండగా, నాదస్వరాలాపనల నడుమ సుగంధ ద్రవ్యాలు మిళితం చేసిన మూడు మణుగుల శ్రీచందనపు ముద్దను ఇన్‌చార్జి ప్రధానార్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు సారఽథ్యంలో స్థానాచార్యులు డా.టిపి రాజగోపాల్‌ పర్యవేక్షణలో, పురోహితులు కరి సీతారామాచార్యులు తదితర అర్చకులు  భక్తిశ్రద్ధలతో అప్పన్నస్వామికి నాల్గో విడతగా స్వామికి సమర్పించారు. పాంచరాత్రాగమ శాస్త్ర విధానంలో ప్రత్యేక పూజలు, సేవాకాలం, ప్రభాత ఆరాధనలు, తీర్థగోష్టి గావించిన అనంతరం ఉదయం 6 గంటలకు భక్తుల దర్శనాలకు అవకాశం కల్పించారు. అప్పన్న దర్శనానికి సుమారు 20వేల మంది భక్తులు వచ్చినట్టు అధికారులు అంచనా వేశారు. పులిహోర ప్రసాదం కౌంటర్‌కు అందడంలో అంతరాయం ఏర్పడడంతో భక్తులు నిరీక్షించక తప్పలేదు. దేవస్థానం సాంకేతిక శాఖ ఏర్పాటుచేసిన క్యూలు ఆశించినస్థాయిలో నిండలేదు. నిత్యాన్న ప్రసాద పథకం కింద భక్తులకు కదంబం ప్యాకింగ్‌ చేసి సుమారు 6వేల మంది అందజేశారు. ఈఓ ఎంవీ సూర్యకళ, ఈఈలు కోటేశ్వరరావు, శ్రీనివాసరాజు, ఏఈఓలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. 


అప్పన్న ఖజానాకు రూ.19 లక్షల ఆదాయం 

 ఆషాఢ పౌర్ణమిని  పురస్కరించుకుని సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి ఖజానాకు శనివారం ఒక్కరోజే సుమారు రూ.19 లక్షల ఆదాయం లభించింది. ప్రధానంగా శ్రీఘ్ర, అతిశ్రీఘ్ర దర్శనం చేసుకున్న 6,796 మంది భక్తులకు టిక్కెట్ల ద్వారా  రూ.8,22,800లు సమకూరగా, స్వామివారి లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.7,46,490లు, భక్తులు తలనీలాలు సమర్పించే కేశఖండనశాల టిక్కెట్ల విక్రయాల ద్వారా రూ.1,51,450 లు, ఇతర పద్దుల ద్వారా మొత్తం రూ.19 లక్షలు సమకూరింది.  


Updated Date - 2021-07-25T05:44:34+05:30 IST