సార్వత్రిక సమ్మెను వాయిదా వేసిన కార్మిక సంఘాలు

ABN , First Publish Date - 2022-01-30T00:08:43+05:30 IST

మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 23-24 తేదీల్లో నిర్వహించాలనుకున్న సార్వత్రిక సమ్మెను..

సార్వత్రిక సమ్మెను వాయిదా వేసిన కార్మిక సంఘాలు

న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 23-24 తేదీల్లో నిర్వహించాలనుకున్న సార్వత్రిక సమ్మెను పది కేంద్ర ట్రేడ్ యూనియన్లు వాయిదా వేశాయి. మార్చి 28-29 తేదీల్లో నిర్వహించేందుకు నిర్ణయించాయి. కోవిడ్ థర్డ్ వేవ్, ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ప్రకటనలో తెలిపాయి.


మోదీ ప్రభుత్వ కార్మిక, ప్రజా, జాతీయ విధానాల వ్యతిరేక చర్యలకు నిరసగా ఈ సార్వత్రిక సమ్మె జరపాలని ఇంతకుముందు ఈ ట్రేడ్ యూనియన్లు నిర్ణయించాయి. ఈ నిర్ణయంపై ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్‌ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్‌పీఎఫ్, యూటీయూసీలు శుక్రవారం సమావేశమై సమీక్షించాయి. థర్డ్ వేవ్ కారణంగా తాము సమ్మెకు సిద్ధం కాలేకపోతున్నట్టు కొన్ని రాష్ట్రాలకు చెందిన ట్రేడ్ యూనియన్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. యూపీ నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 23న జరగాల్సి ఉండటం, దాదాపు అదే సమయంలో తమిళనాడు, ఒడిషా, పశ్చిమబెంగాల్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉండటం కూడా ఈ సమావేశంలో ట్రేడ్ యూనియన్ నేతలు పరిశీలించారు. అనంతరం దీనిపై నేతలు ఒక ప్రకటన చేస్తూ, తాజా పరిణామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సార్వత్రిక సమ్మె తేదీలను మార్చి 28-29 తేదీలకు వాయిదా వేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కార్మికులు, ట్రేడ్ యూనియన్లు బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు విస్తృత ప్రచారం జరపాలని, ఏ విధానాల కారణంగా తాము రెండో రోజుల బంద్‌కు పిలుపునివ్వాల్సి వచ్చిందో ప్రజలకు వివరించాలని కోరారు.

Updated Date - 2022-01-30T00:08:43+05:30 IST