ట్రాక్టర్‌ ట్రాలీ దొంగల ముఠా అరెస్టు : డీఎస్పీ

ABN , First Publish Date - 2022-01-22T05:54:58+05:30 IST

ట్రాక్టర్‌ ట్రాలీలను చోరీ చేస్తున్న ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఐదు ట్రాలీలను, ఒక ఇంజన్‌తో కూడిన ట్రాక్టర్‌, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ట్రాక్టర్‌ ట్రాలీ దొంగల ముఠా అరెస్టు : డీఎస్పీ
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి

నల్లగొండ, జనవరి 21 : ట్రాక్టర్‌ ట్రాలీలను చోరీ చేస్తున్న ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఐదు ట్రాలీలను, ఒక ఇంజన్‌తో కూడిన ట్రాక్టర్‌, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను నల్లగొండ జిల్లా కేంద్రంలో డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి విలేకరులకు శుక్రవారం వివరించారు. తిప్పర్తి పోలీ్‌సస్టేషన్‌ పరిధి అనిశెట్టిదుప్పలపల్లి ఫ్లైఓవర్‌ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా తిప్పర్తి వైపు బైక్‌పై వస్తున్న ఇద్దరిని అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. నల్లగొండ పట్టణం ఏఆర్‌నగర్‌కు చెందిన దుంప సంపత్‌, దుంప అయిలమ్మ, దుపం శివ, దుంప రాజు, కట్టంగూరు మండలం పిట్టంపల్లికి చెందిన సురిగి మధు, నల్లగొండ పానగల్‌కు చెందిన ఆలకుంట్ల వెంకన్న, ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన ఓర్సు రామకృష్ణ, అదే జిల్లా కొణిజర్లకు చెందిన దుబ్బల రఘు కలిసి ఒక ముఠాగా ఏర్పడినట్లు విచారణలో తేలిందన్నారు. వీరు కాల్వ కట్టల మీద, పొలాలు, పశువుల కొట్టాల వద్ద నిలిపిన ట్రాక్టర్‌ ట్రాలీలను చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో 2021 మార్చి 21న కట్టంగూరు మండలం పిట్టంపల్లిలో, అదే ఏడాది డిసెంబరు 4న తిప్పర్తి మండలం రామలింగాలగూడెంలో అదే నెల 7వ తేదీన తిప్పర్తి మండలం ఖాజీరామారం, 17వ తేదీన కొరివేనిగూడెం గ్రామశివారులో వ్యవసాయ తోట వద్ద ఒక ట్రాలీని చోరీ చేశారు. అదేవిధంగా ఈ ఏడాది జనవరి 7వ తేదీన నల్లగొండ మండలం దండెంపల్లి గ్రామశివారులో పొలం వద్ద ట్రాలీని మొత్తం ఐదు ట్రాలీలు దొంగతనం చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారని డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి వివరించారు. ఈ చోరీలపై ఆయా పోలీ్‌సస్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. ఈ చోరీల కోసం సురిగి మధుకు చెందిన బైక్‌ను, ట్రాలీలను తీసుకెళ్లడానికి దొబ్బల రఘుకు చెందిన ట్రాక్టర్‌ ఇంజన్‌ను ఉపయోగించినట్లు డీఎస్పీ తెలిపారు. ముఠాలోని ఆలకుంట్ల వెంకన్న, ఓర్సు రామకృష్ణ, దుబ్బల రఘులను అరెస్టు చేశామని; దుంప అయిలయ్య, దుంప శివ పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితుల నుంచి ఒక బైక్‌, ఇక ఇంజన్‌ కలిగిన ట్రాక్టర్‌ సీజ్‌ చేయడంతో పాటు చోరీ చేసిన ఐదు ట్రాలీలను స్వాధీనం చేసుకున్నామన్నారు. సమావేశంలో శాలిగౌరారం సీఐ రాఘవరావు, సీసీఎస్‌ సీఐ దుబ్బ అనీల్‌, తిప్పర్తి ఎస్‌ఐ సత్యనారాయణ పాల్గొన్నారు. కేసులో సమర్థంగా వ్యవహ రించిన శాలిగౌరారం సీఐ, తిప్పర్తి, పోలీస్‌ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. 

Updated Date - 2022-01-22T05:54:58+05:30 IST