ట్రాక్‌ కరోనా!

ABN , First Publish Date - 2020-04-04T06:07:19+05:30 IST

అనేక చోట్ల కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని, అతని కుటుంబ సభ్యులను ఆరా తీసి, ఎక్కడెక్కడ తిరిగారో సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే ఈ విధంగా అడిగి తెలుసుకోవటం ద్వారా నిక్కచ్చి సమాచారం లభించే అవకాశం ఏమాత్రం లేదు.

ట్రాక్‌ కరోనా!

ట్రాకింగ్‌.. ట్రాకింగ్‌! దేశవ్యాప్తంగా ఇప్పుడు వినిపిస్తున్న పదం ఇది. కరోనా సోకిన వ్యక్తి ఎక్కడెక్కడో తిరిగాడో గుర్తించి, వారి కుటుంబ సభ్యులను, వారికి సన్నిహితంగా మెలిగిన వారిని అప్రమత్తం చేయడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. అయితే టెక్నాలజీని ఉపయోగించుకుంటే కరోనా సోకిన వారిని ఈజీగా ట్రాక్‌ చేసే వీలుంది. అదెలా అంటే...!


అనేక చోట్ల కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని, అతని కుటుంబ సభ్యులను ఆరా తీసి, ఎక్కడెక్కడ తిరిగారో సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే ఈ విధంగా అడిగి తెలుసుకోవటం ద్వారా నిక్కచ్చి సమాచారం లభించే అవకాశం ఏమాత్రం లేదు. ఇటీవల మతపరమైన కార్యక్రమంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లి వచ్చిన ఒక వ్యక్తి కదలికల రిపోర్టు పరిశీలించినప్పుడు అందులో ఉదయం 7 గంటలకు ఢిల్లీలో ట్రెయిన్‌ దిగినట్లు, ఏడున్నరకు అల్పాహారం సేవించినట్లు.. ఇలా అంచనా సమయాలు మాత్రమే నమోదు చేయడం జరిగింది. ఈ తరహా సమాచారం వల్ల సరిగ్గా అదే సమయంలో ఆ ప్రదేశంలో ఉన్న ఇతరులను అప్రమత్తం చేయడం చాలా కష్టం.


గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా!

దీనికి బదులుగా గూగుల్‌ మ్యాప్స్‌లో అంతర్గతంగా ఉన్న ఓ అద్భుతమైన సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ మరియు ఐఓఎస్‌ ఫోన్లు ఈ మధ్య దాదాపు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటున్నాయి. అందులో కచ్చితంగా గూగుల్‌ మ్యాప్స్‌ ఉంటుంది కాబట్టి ఇది గతంలో ఒక వ్యక్తి ఎక్కడెక్కడ తిరిగారన్న సమాచారాన్ని పూర్తి కచ్చితత్వంతో అందిస్తుంది. గూగుల్‌ మ్యాప్స్‌ ప్రత్యేకంగా మనం ఎనేబుల్‌ చేయాల్సిన పనిలేకుండానే లొకేషన్‌ డేటాను టైమ్‌లైన్‌లో జాగ్రత్తగా భద్రపరుస్తుంది. ఎవరికైతే కరోనా పాజిటివ్‌ వస్తుందో ఆ వ్యక్తి అనుమతితో అతని ఫోన్లో గూగుల్‌ మ్యాప్స్‌లోని టైమ్‌లైన్‌ డేటాని అధికారులు సేకరించాలి. దాంట్లో గత రెండు మూడు సంవత్సరాలుగా అతను ఎక్కడ ఎక్కడ తిరిగారో కూడా సమాచారం ఉంటుంది. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి, ఆ లక్షణాలు బయట పడక ముందు గత పదీ పదిహేను రోజులుగా ఏయే ప్రదేశాల్లో తిరిగారన్న సమాచారాన్ని మొదట సేకరించాలి.


అందరికీ అందుబాటులో...

ఇప్పుడు ప్రభుత్వాలు ఇలా వివిధ రకాలుగా సేకరించిన సమాచారం మొత్తాన్నీ ఒక అధికారిక వెబ్‌సైట్‌లో ఒక డేటాబేస్‌ రూపంలో దేశ ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా పెట్టాలి. పేషెంట్‌కి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం అతని పేరుకు బదులుగా ‘పేషెంట్‌ 1’, ‘పేషెంట్‌ 2’ వంటి పేర్లు తగిలించవచ్చు. అప్‌లోడ్‌ చేయబడిన డేటాతో పాటు, అతను తిరిగిన ప్రదేశాలను ఎవరైనా సులభంగా వెతికి పట్టుకునే విధంగా ట్యాగ్స్‌ జత చేయాలి. ఉదాహరణకు, అమీర్‌పేట, బేగంపేట, కూకట్‌పల్లి వంటి ట్యాగ్స్‌ తగిలించడం ద్వారా ప్రయోజనం ఉంటుంది.


పౌరులు ఎలా జాగ్రత్త వహించాలి?

ఇప్పుడు పబ్లిక్‌గా ఉన్న సమాచారాన్ని దేశంలో ఎవరైనా వినియోగించుకోవచ్చు. రాము అనే వ్యక్తి మార్చి 15న ఉదయం 9:12 నిమిషాలకు అమీర్‌పేటలో ఉన్నాడు అనుకోండి. అతను పబ్లిక్‌ డేటాబేస్‌లో అమీర్‌పేట అని వెదకడం ద్వారా కొన్ని ఫలితాలు వస్తాయి. అందులో ఉదయం 9:12 నిమిషాల టైమ్‌స్టాంప్‌ చూసుకుని ఆ సమయంలో కరోనా పేషెంట్లు ఎవరైనా సరిగ్గా తను ఉన్న గూగుల్‌ మ్యాప్స్‌ అక్షాంశ రేఖాంశాలకు 50 మీటర్ల దగ్గరలో ఎవరైనా ఉన్నారేమో చాలా సులభంగా గుర్తించవచ్చు. ఈ పద్ధతి ద్వారా కరోనా వైరస్‌ సోకిన వ్యక్తికి గతంలో తమకు తెలియకుండా ఎవరైతే సమీపంగా సంచరించారో వారు అప్రమత్తమయ్యే అవకాశం ఉంది.


గూగుల్‌ సైతం...

తాజాగా గూగుల్‌ సంస్థ కూడా ప్రపంచ వ్యాప్తంగా తమ వినియోగదారుల లొకేషన్‌ డేటాను పబ్లిక్‌ డొమైన్లో పెడుతున్నట్లు ప్రకటించడం హర్షించదగినది. కరోనా వైరస్‌ పేషెంట్‌ అనుమతితో సంబంధం లేకుండా వివిధ ప్రభుత్వాలు ఆయా వ్యక్తుల లొకేషన్‌ డేటాను గూగుల్‌ నుంచి ఇప్పుడు సులభంగా సేకరించవచ్చు. తద్వారా సరిగ్గా అదే ప్రదేశంలో సంచరించిన వారిని అప్రమత్తం చేయొచ్చు.


గుర్తించిన తర్వాత!

పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తుల గత కదలికల గురించి తెలుసుకోవడానికి పై పద్ధతులు ఉపయోగపడితే, వైరస్‌ నిర్ధారణ తర్వాత అతని కదలికలపై నిఘా పెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం ‘ఆరోగ్యసేతు’ అనే యాప్‌ను తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ ట్రాకింగ్‌ అప్లికేషన్స్‌ అందిస్తున్నాయి. వీటిలో జియో ట్యాగింగ్‌ చేయటం ద్వారా ఆ వ్యక్తికి సంబంధించిన కదలికలు ఎప్పటికప్పుడు సెంట్రల్‌ సర్వర్‌కి బ్యాక్‌ గ్రౌండ్‌లో పంపిస్తూ, జియో ఫెన్సింగ్‌ దాటి అతను బయటకు వచ్చినట్లయితే సంబంధిత అధికారులను అప్రమత్తం చేయడానికి ఇవి ఉపయోగపడతాయి.


మొబైల్‌ టవర్ల ద్వారా...

స్మార్ట్‌ఫోన్‌ లేని కరోనా వైరస్‌ పేషెంట్ల గత కదలికలను ట్రాక్‌ చేయడం కోసం వారు గతంలో చేసిన ఫోన్‌ కాల్స్‌ ద్వారా, మొబైల్‌ టవర్ల ఆధారంగా సిడిఆర్‌ ఎనాలసిస్‌ తెప్పించుకుని కొంత వరకు వారు తిరిగిన ప్రదేశాల గురించి సమాచారాన్ని సేకరించవచ్చు. ఇది పూర్తిస్థాయిలో ఉపయోగపడకపోయినప్పటికీ కొంతవరకు ప్రయోజనకరమే.


ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ

చైనాలో కరోనా వైరస్‌ కట్టడిలో ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ బాగా ఉపయోగపడింది. భారీ మొత్తంలో అక్కడ పౌరుల ఫేస్‌ డేటా ప్రభుత్వాల దగ్గర ఉండడం వల్ల కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఫేస్‌ మోడల్‌ సేకరించి,  నిఘా కెమెరాల ఫీడ్‌ పరిశీలించటం ద్వారా వారు ఎక్కడెక్కడ తిరిగారో గుర్తించారు. వారికి సమీపంగా ఇంకెవరు సాధారణ పౌరులు ఉన్నారో గుర్తించి, ఎవరికైతే ప్రమాదం ఉంటుందో వారికి హెచ్చరికలు పంపుతారు. మన దగ్గర ఆ స్థాయిలో నిఘా వ్యవస్థ లేదు కాబట్టి ప్రస్తుతానికి ఈ టెక్నాలజీ ద్వారా ప్రయోజనం లేదు. ఏదేమైనప్పటికీ సమర్థవంతంగా కరోనా వైరస్‌ సోకిన వ్యక్తులను ట్రాక్‌ చెయ్యగలిగితే, వైరస్‌ వ్యాప్తిని చాలావరకు అడ్డుకోవచ్చు.


తాజాగా గూగుల్‌ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా తమ వినియోగదారుల లొకేషన్‌ డేటాను పబ్లిక్‌ డొమైన్లో పెడుతున్నట్లు ప్రకటించింది.


నల్లమోతు శ్రీధర్‌

fb.com/nallamothusridhar

Updated Date - 2020-04-04T06:07:19+05:30 IST