ఎర్ర జెండాకు ‘వంద’నాలు

ABN , First Publish Date - 2020-11-01T09:29:30+05:30 IST

ఏఐటీయూసీ శతాబ్ది ఉత్సవాలు తిరుపతిలో శనివారం ఘనంగా జరిగాయి.నగర వీధుల్లో అరుణ పతాకాలు రెపరెపలాడాయి.

ఎర్ర జెండాకు ‘వంద’నాలు

 ఘనంగా ఏఐటీయూసీ శతాబ్ధి ఉత్సవాలు


తిరుపతి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి):ఏఐటీయూసీ శతాబ్ది ఉత్సవాలు తిరుపతిలో శనివారం ఘనంగా జరిగాయి.నగర వీధుల్లో అరుణ పతాకాలు రెపరెపలాడాయి.రైల్వే స్టేషన్‌ వద్ద ఉన్న ఏఐటీయూసీ కార్యాలయం వద్ద సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ  ఎర్ర జెండాను ఎగురవేసి, అది సాధించిన విజయాలను కార్యకర్తలతో పంచుకున్నారు. అక్కడనుంచి ఎస్జీఎస్‌ కళాశాల మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు. పద్మావతి పార్కు వద్ద ఏర్పాటుచేసిన సభలో నారాయణ ప్రసంగించారు. కార్మికులకు చట్టబద్ధమైన హక్కులను తీసుకురావడంలో ఏఐటీయూసీ పాత్రను కొనియాడారు.


తిరుపతిలో రౌడీయిజాన్ని అణిచివేసిన ఘనత కూడా ఎర్రజెండాదేనని స్పష్టం చేశారు. ఒకప్పుడు వీధి కార్మికులపై వడ్డీ వ్యాపారులు పడి దోచుకునేవారని, వారిని తరిమికొట్టిన ఘనత ఎర్రజెండాదేనన్నారు. పాలకుల ఆగడాలను ఎండగడుతూ ప్రజా నాట్యమండలి కళాకారులు ఆలపించిన గేయాలు చైతన్యపరిచాయి. మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు బి.తులసేంద్ర అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పి.హరినాథరెడ్డి, జిల్లా కార్యదర్శి రామానాయుడు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి, నాయకులు రామచంద్రయ్య, రాధాకృష్ణ, చిన్నం పెంచలయ్య, సీహెచ్‌ శివ, రాజా, శ్రీరాములు, జనార్దన్‌, నరసింహులు, నగర కార్యదర్శి విశ్వనాథ్‌, మహిళా సమాఖ్య రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జయలక్ష్మి, నదియ, మంజుల, ఏఐవైఎఫ్‌ నాయకులు దాము, రామకృష్ణ, ప్రజానాట్య మండలి గాయకులు గురప్ప, సుబ్బు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-01T09:29:30+05:30 IST