గజ బాధితులకు ఆర్థిక సాయం

ABN , First Publish Date - 2020-10-01T10:36:34+05:30 IST

కుప్పం, శాంతిపురం మండలాల్లో మదపుటేనుగు దాడిలో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు అటవీ శాఖ ఆర్థిక సాయమందింది. చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, చీఫ్‌ కన్జర్వేటివ్‌ ఆఫ్‌ ఫారెస్టు రామకృష్ణ బుధవారం వారికి ఆర్థిక సాయందించారు.

గజ బాధితులకు ఆర్థిక సాయం

కుప్పం, సెప్టెంబరు 30: కుప్పం, శాంతిపురం మండలాల్లో మదపుటేనుగు దాడిలో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు అటవీ శాఖ ఆర్థిక సాయమందింది. చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, చీఫ్‌ కన్జర్వేటివ్‌ ఆఫ్‌ ఫారెస్టు రామకృష్ణ బుధవారం వారికి ఆర్థిక సాయందించారు. శాంతిపురం మండలం  రాళ్లపల్లెలో పాపమ్మ,కుప్పం మండలం  నడిమూరు కొట్టాలు గ్రామంలో సోనియా అనే ఇంటర్మీడియట్‌ విద్యార్థిని ఇటీవల ఏనుగు దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే.


ఈ నేపథ్యంలో సీసీఎఫ్‌వో రామకృష్ణ బుధవారం కుప్పం అటవీశాఖ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పాపమ్మ, సోనియా కుటుంబ సభ్యులను పిలిపించి ఒక్కో కుటుంబానికి తొలి విడతగా రూ.లక్ష చెక్కులను అందించారు. మిగిలిన రూ.4 లక్షలను అతి త్వరలో అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ సీఎం జగన్‌, మంత్రి పెద్దిరెడ్డి గజదాడులపై స్పందించి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు నష్టపరిహారం ప్రకటించడమేకాక సత్వరం తలా రూ.లక్షను విడుదల చేశారని చెప్పారు.  సీసీఎఫ్‌వో రామకృష్ణ మాట్లాడుతూ... ఏనుగులు అడవులనుంచి గ్రామాలవైపు రాకుండా రక్షణ కోసం కందకాలు తవ్వించడమే కాకుండా, పటిష్ఠమైన సోలార్‌ కంచెలు నిర్మిస్తామన్నారు.


కర్ణాటక, తమిళనాడు అటవీ శాఖాధికారులలో సంయుక్తంగా గజదాడుల నివారణ చర్యలు చేపడతామని తెలిపారు. వైసీపీ మున్సిపల్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ సుధీర్‌, మండల పార్టీ కన్వీనర్‌ మురుగేష్‌, ఏఎంసీ చైర్‌న్‌ లలితా మురుగేష్‌, పీఏసీఎస్‌  చైర్మన్‌ మునిరత్నం, టౌన్‌బ్యాంక్‌ చైర్మన్‌ ఉపేంద్ర,  గంగమ్మ గుడి చైర్మన్‌ పార్థసారథి, గుడుపల్లె పీఏసీఎస్‌ చైర్మన్‌ నాగభూషణం, నాలుగు మండలాల కన్వీనర్లు సహా డీఎఫ్‌వో రవిశంకర్‌, ఎఫ్‌ఆర్‌వో మదన్‌మోహన్‌, కుప్పం మున్సిపల్‌ కమిషనర్‌ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-01T10:36:34+05:30 IST