గుప్తనిధుల ముఠా దొరికింది

ABN , First Publish Date - 2020-10-01T10:34:37+05:30 IST

జీడీనెల్లూరు మండలం అగరమంగళంలో నంది విగ్రహం ధ్వంసం చేసిన ఘటనలో పోలీసులు ఎనిమిది మంది అంతఃరాష్ట్ర ముఠా సభ్యులను అరెస్టు చేశారు.

గుప్తనిధుల ముఠా దొరికింది

నంది విగ్రహ ధ్వంసం ఘటనలో ఎనిమిది మంది అరెస్టు

 వివరాలు వెల్లడించిన ఎస్పీ సెంథిల్‌ కుమార్‌ 


చిత్తూరు, సెప్టెంబరు 30: జీడీనెల్లూరు మండలం అగరమంగళంలో నంది విగ్రహం ధ్వంసం చేసిన ఘటనలో పోలీసులు ఎనిమిది మంది అంతఃరాష్ట్ర ముఠా సభ్యులను అరెస్టు చేశారు. ఈ వివరాలను బుధవారం నగర పోలీసు అతిథిగృహంలో ఎస్పీ సెంథిల్‌కుమార్‌ డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డితో కలసి మీడియాకు వివరించారు. జీడీనెల్లూరు మండలం అగరమంగళంలో వెలసిన అభయ ఆంజనేయస్వామి ఆలయంలో ఉన్న ప్రాచీన నంది విగ్రహానికి ఇటీవల పగుళ్లు వచ్చాయి. అయితే లోపల బంగారం తదితర విలువైన వస్తువులు ఉండడమే ఇందుకు కారణమన్న ప్రచారం జరిగింది.


ఈ నేపథ్యంలో గతనెల 27న పలువురు దుండగులు ఈ విగ్రహాన్ని పెకిలించి, ఆలయం వెలుపల పడేసి వెళ్లారు. గుప్తనిధుల కోసమే ఈ ఘటన జరిగిందంటూ ఆలయ కమిటీ సభ్యుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించి ఎస్పీ సెంథిల్‌కుమార్‌ మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పాత నేరస్తులపై నిఘా వేశారు. ఇదిలా ఉండగా... నంది విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు కాణిపాకంలో ఉన్నారంటూ బుధవారం పోలీసులకు సమాచారం అందింది. దీంతో జీడీనెల్లూరు ఎస్‌ఐ సుమన్‌, పాకాల ఎస్‌ఐ రాజశేఖర్‌, చిత్తూరు తాలూకా ఎస్‌ఐ విక్రమ్‌ సిబ్బందితో వెళ్లి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.


పలుప్రాంతాల ఆలయాల్లో ఈ ముఠా చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. అరెస్టయిన వారిలో కర్నూలు జిల్లా  ఆలూరుమండలం పెద్దహోటూరుకు చెందిన కురవ సోమశేఖర్‌(24), కర్ణాటక రాష్ట్రం తుంకూరు జిల్లా మల్లెగట్టకు చెందిన ఎం.ఎ్‌స.మణికంఠ(30), జబ్బగట్టకు చెందిన జె.ఎల్‌.నవీన్‌(35), చిక్‌మంగళూరుకు చెందిన ఎస్‌.కిరణ్‌కుమార్‌(39), శంకర్‌నగర్‌కు చెందిన ఎం.వికాస్‌(34), బీజాపూర్‌కు చెందిన అశోక్‌ కుమార్‌(37), కుప్పం మండలం ప్యాలెస్‌ రోడ్డుకు చెందిన ఆర్‌.శరవణన్‌(30), ఐరాల మంలం పందిగొట్టూరుకు చెందిన పి.పెద్దబ్బ(35) ఉన్నారు.


నిందితుల నుంచి రెండుకార్లు, 16 సెల్‌ఫోన్లు, విగ్రహ ధ్వంసానికి వాడిన సమ్మెట, మినీ గ్యాస్‌ సిలిండర్‌ తదితర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. 


పలు ఆలయాల్లో చోరీలకు ప్రణాళిక.. 

గుప్తనిధుల కోసం పురాతన ఆలయాల్లో దొంగతనాలు చేసే ఈ ముఠాకు కర్నూలు జిల్లాకు చెందిన కురవ సోమశేఖర్‌ నాయకుడు. పోలీసుల విచారణలో 8మంది ముఠా సభ్యులు ఈ వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రాచీన దేవాలయాలు, గుప్తనిధులున్న వివరాలను స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం ఆయా ఆలయాల్లో తవ్వకాలు జరపడం, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నట్లు వివరించారు. నంది విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలో సోమశేఖర్‌ కీలకపాత్ర వహించినట్లు గుర్తుచేశారు.


కాగా, గుప్తనిధుల కోసమే కాణిపాకం, ఎస్‌ఆర్‌పురం, తిరుపతి, కర్నూలు జిల్లా మంత్రాలయం, కర్నూలు, మహానంది, పత్తికొండ, అనంతపురం జిల్లా పెనుకొండ, కదిరి, గుంటూరు జిల్లాలోని పలు ఆలయాల్లో తవ్వకాలు సాగించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు ఈ ముఠా పోలీసులకు వెల్లడించింది. కాగా, నిందితులను పట్టుకోవడంలో కృషిచేసిన ఎస్‌ఐలు రాజశేఖర్‌, విక్రమ్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ దేవరాజులురెడ్డి తదితరులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను అందజేశారు. 

Updated Date - 2020-10-01T10:34:37+05:30 IST