చిన్నకొలువని చింతపడలేదు

ABN , First Publish Date - 2020-09-29T12:19:16+05:30 IST

చిత్తూరు జిల్లా శతజయంతి ఉత్సవాల నిర్వహణలో .. చంద్రగిరిలో జరిగిన కృష్ణదేవరాయల 500 ఏళ్ల పట్టాభిషేక మహోత్సవంలో.. తిరుపతిలో జరిగిన ఇండియన్‌ సైన్సు కాంగ్రెస్‌లో..

చిన్నకొలువని చింతపడలేదు


ఫ్యాక్టరీలో క్లర్కుగా మొదలై జేసీగా ప్రశంసలందుకునేదాకా చంద్రమౌళి ప్రస్థానం


చిత్తూరు-ఆంధ్రజ్యోతి:

చిత్తూరు జిల్లా శతజయంతి ఉత్సవాల నిర్వహణలో .. చంద్రగిరిలో జరిగిన కృష్ణదేవరాయల 500 ఏళ్ల పట్టాభిషేక మహోత్సవంలో.. తిరుపతిలో జరిగిన ఇండియన్‌ సైన్సు కాంగ్రెస్‌లో..  2018, 19సంవత్సరాల్లో నిడ్జమ్‌ క్రీడల సందడిలో.. అన్నింటా  బొంగ రంలా తిరుగుతూ ఆయనే!  సచివాలయ పరీక్షల నిర్వహణ..కోవిడ్‌-19 నోడల్‌ అధికారి గా అన్ని శాఖలతో సమన్వయం.. రాష్ట్రపతి, ప్రధానమంత్రి మొదలు వీఐపీలు ఎవరు జిల్లాలో అడుగుపెట్టినా తిరిగి విమానం ఎక్కేదాకా పనుల పురమాయింపు బాధ్యత లు.. సకల బాధ్యతలనూ చిరునవ్వుతో స్వీకరించి పైఅధికారులకు భారంతగ్గించే ఆ అధికారి పేరు ఊటుకూరు రామచంద్రన్‌ మౌళి, చిత్తూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌(సంక్షేమం). పదేళ్ళుగా అన్నింటా అందరికీ తలలో నాలుకలా జిల్లాలో బాధ్యతల్లో ఉన్న చంద్రమౌళి ఈ నెలాఖరున రిటైరవుతున్నారు.ఈ సందర్భంగా ఆయన ఉద్యోగప్రస్థాన విశేషాలు ఆయన మాటల్లోనే...


చిరుద్యోగంతో మొదలు

మాది పలమనేరు. నాన్న రామచంద్రన్‌ శర్మ టీచర్‌. అమ్మ నాగేశ్వరమ్మ. ఇప్పుడు ఇద్దరూ లేరు. పలమనేరు ప్రభుత్వ బడుల్లోనే చదువుకున్నా. ఇంటర్‌ కూడా ప్రభుత్వ కాలేజీలోనే. నా 17వ యేటనే నాన్న దూరమయ్యారు. అక్కడే 18 ఏళ్లకే టైల్స్‌ ఫ్యాక్టరీలో క్లర్కుగా చేరా. పనిచేస్తూనే ప్రైవేటుగా డిగ్రీ చేశా. 1980-82 మధ్యలో పుంగనూరులోని సెరికల్చర్‌ శాఖలో, ఆ తర్వాత మూడేళ్లు హైదరాబాద్‌లోని ఏజీ ఆఫీ్‌సలో పనిచేశా. 1985లో గ్రూప్‌-2 పరీక్షల్లో ర్యాంకు సాధించా. అనంతపురం జిల్లాలో డిప్యూటి తహసీల్దార్‌గా చేరా. అక్కడ పనిచేస్తూనే ఎస్కేయూనివర్శిటీలో పీజీ చేశా. అనంతపురం తహసీల్దార్‌గా ఆరున్నరేళ్ల పాటు పనిచేయడం ఆ జిల్లాలో ఒక రికార్డు. 2002 డిసెంబరులో డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి లభించింది.


డిప్యూటీ కలెక్టర్‌గా సొంత జిల్లాకు

2003 జనవరిలో డీఆర్‌డీఏ అడిషనల్‌ పీడీగా సొంత జిల్లా చిత్తూరుకు వచ్చా. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో డీఆర్‌డీఏ పీడీ, డ్వామా పీడీ, టూరిజం ఈడీ, ఏపీఎంఐపీ పీడీ, డీఆర్‌వో, జడ్పీ సీఈవో వంటి అనేక బాధ్యతల్లో ఉన్నా. ఇలా క్లర్కు, డిప్యూటీ తహసీల్దార్‌ నుంచి జాయింట్‌ కలెక్టర్‌ వరకు 30కి పైగా హోదాల్లో 30మంది కలెక్టర్ల వద్ద పనిచేశా.


అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రస్థాయి ఉత్తమ అధికారి అవార్డు అందుకోవడం ఒక మంచి జ్ఞాపకం. నా సతీమణి సావిత్రి తిరుపతి తిలక్‌రోడ్‌లోని స్టేట్‌బ్యాంకులో డిప్యూటీ మేనేజరుగా పనిచేస్తున్నారు. కొడుకు నాగప్రహర్ష తిరుపతిలోనే పదవ తరగతి చదువుతున్నాడు. కుటుంబ సహకారంవల్ల ఉద్యోగ బాధ్యతల్లోతలమునకలై ఉండగలుగుతున్నా. 

Updated Date - 2020-09-29T12:19:16+05:30 IST