బొమ్మ కనపడేదెప్పుడో..?

ABN , First Publish Date - 2020-08-12T08:57:49+05:30 IST

కరోనా మహమ్మారి సినిమా రంగంపైనా తీవ్ర ప్రభావం చూపింది. నాలుగు నెలలకుపైగా థియేటర్లు మూతపడి ఉండడంతో వీటినే నమ్ముకుని బతుకు

బొమ్మ కనపడేదెప్పుడో..?

 కరోనా దెబ్బకు 4 నెలలుగా థియేటర్ల మూత

 చిన్నాభిన్నమైన కార్మికుల కుటుంబాలు

 యజమానులకూ నిర్వహణ కష్టాలు


కరోనా మహమ్మారి సినిమా రంగంపైనా తీవ్ర ప్రభావం చూపింది. నాలుగు నెలలకుపైగా థియేటర్లు మూతపడి ఉండడంతో వీటినే నమ్ముకుని బతుకున్న వేలాది మంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఆర్థిక కష్టాలతో అతలాకుతలం అవుతున్నారు. అదే సమయంలో యజమానులకూ నిర్వహణ కష్టాలు తప్పడం లేదు. కేంద్రం ప్రకటించిన అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలతో మరో నెల పాటు తెర మీద బొమ్మ కనపడే పరిస్థితి లేదు. 


చిత్తూరు, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మొత్తం 89 థియేటర్లున్నాయి. తిరుపతిలో అధికంగా 16 ఉండగా.. మదనపల్లె, చిత్తూరు ప్రాంతాల్లోనూ చెప్పుకోదగ్గస్థాయిలో సినిమా హాళ్లున్నాయి. ఒక్కోదానిలో ప్రొజెక్టర్‌ ఆపరేటర్లు, టికెట్‌ క్లర్కులు, గేట్‌ మ్యాన్‌, క్యాంటీన్‌ సిబ్బంది, స్వీపర్లు, వాచ్‌మెన్‌, వాల్‌పోస్టర్లు అంటించేవారు.. ఇలా థియేటర్‌ స్థాయినిబట్టి సగటున 20 మంది కార్మికులుంటారు. వీరితోపాటు వాటి పరిసరాల్లో తినుబండారాలు అమ్ముకుని బతికేవారు మరో 10 మంది ఉంటారు. ఇలా మొత్తం కలిపితే జిల్లాలో 2,700 మంది వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా థియేటర్లపై ఆధారపడి బతుకుతున్నారు.


తిరుపతి నగరంలోని కొన్ని థియేటర్లలో పనిచేసే కార్మికులకు యాజమాన్యాలు సగం జీతం ఇస్తున్నప్పటికీ.. పరిస్థితి ఇలాగే కొనసాగితే వారు కూడా చేతులెత్తేసే అవకాశం ఉంది. జిల్లాలో మిగిలిన చోట్ల యజమాని దయతలచి అప్పుడప్పుడు కాసింత ఆర్థికసాయం చేస్తున్నారు. మరికొన్నిచోట్ల అదీ లేదు. ఇటువంటి వారిలో చాలామంది అందుబాటులోని ఇతర పనులకు రోజువారీ కూలీల్లాగా వెళుతున్నారు. ఇక ఒక్కో థియేటర్‌ విద్యుత్తు బిల్లు నెలకు దాని స్థాయిని బట్టి రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు వస్తోంది. నెలలుగా ఆదాయం లేకపోవడంతో నిర్వహణ భారంగా మారిందని యజమానులు చెబుతున్నారు. 


అనుమతి వచ్చినా.. 


ఒకవేళ థియేటర్లు తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. కరోనా దెబ్బకు ప్రేక్షకులు వస్తారన్నది అనుమానంగానే ఉంది. పైగా 25-50శాతం సీటింగ్‌తోనే థియేటర్లు నడపాలని అనుమతి వస్తుందని గతంలో ప్రచారం జరిగింది. ఇలాగైతే.. యజమానులపై మరింత భారం పడుతుంది. ప్రభుత్వం అనుమతిచ్చినా.. వ్యాక్సిన్‌ వచ్చేవరకు థియేటర్లు తెరచుకునే పరిస్థితి కనిపించడం లేదు.


ప్రభుత్వం సాయం చేయాలి

నాలుగు నెలలుగా థియేటర్లు మూత పడటంతో యజమాని దయతలచి ఇచ్చే కాస్త జీతంతో కాలం గడుపుతున్నాం. పరిస్థితి ఇలాగే ఉంటే జీవితాలు రోడ్డు పాలవ్వక తప్పదు. కరోనా విపత్తులో అందరికీ సాయం చేస్తున్నట్లు ప్రభుత్వం సినీ కార్మికులకు కూడా సాయం చేస్తే బాగుంటుంది.

           - బాబు, ఏఎస్‌ఆర్‌ థియేటర్‌ నిర్వాహకుడు, మదనపల్లె

Updated Date - 2020-08-12T08:57:49+05:30 IST