కేటీఆర్‌ దోపిడీ మాఫియా

ABN , First Publish Date - 2021-05-07T09:23:53+05:30 IST

మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఓ మాఫియాను తయారు చేసుకుని అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

కేటీఆర్‌ దోపిడీ మాఫియా

సీఎస్‌ సహా ముగ్గురు ఉన్నతాధికారులతో ముఠా

అక్రమ నిర్మాణాలతో వేల కోట్ల భూ దందా

దేవాలయ భూముల్లో మంత్రులు కేటీఆర్‌, 

మల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ నేతల నిర్మాణాలు

సోమేశ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలి

కేటీఆర్‌ ఫాంహౌస్‌ ఎందుకు తొలగించరు?

తప్పు చేయకపోతే స్టే ఎందుకు తెచ్చారు?

రైతుల భూములు లాక్కునేందుకే కమిటీ: రేవంత్‌

చట్టప్రకారమే కొన్నాం:నమస్తేతెలంగాణ వివరణ


మేడ్చల్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఓ మాఫియాను తయారు చేసుకుని అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆయనను వెంటనే మంత్రి పదవి తొలగించాలని డిమాండ్‌ చేశారు. గురువారం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలంలోని దేవరయాంజాల్‌లో సీతారామస్వామి ఆలయ భూములను రేవంత్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. కేటీఆర్‌, ఆయన స్నేహితుడు శ్రీధర్‌, ఐఏఎస్‌ అధికారులు సోమేశ్‌కుమార్‌, అర్వింద్‌కుమార్‌, లోకేశ్‌కుమార్‌ ఒక మాఫియాగా తయారై రూ.వేల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపి.. మంత్రి కేటీఆర్‌పై, రెరా చైర్మన్‌ సోమేశ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని, మునిసిపల్‌ శాఖలో జరుగుతున్న అవినీతిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.


మాజీ మంత్రి ఈటల నిర్మించిన గోదాములు, అసైన్డ్‌ భూముల ఆక్రమణలపై ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ పారదర్శకంగా నివేదిక ఇవ్వాలన్నారు. మంత్రులు కేటీఆర్‌, మల్లారెడ్డితోపాటు పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు దేవాలయ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని, వాటిని తాను ఆధారాలతో సహా నిరూపిస్తున్నానని తెలిపారు. ఈటలపై చర్యలు తీసుకున్నట్లుగానే వీరిపైనా సీఎం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దేవరయాంజాల్‌లో 160 వరకు అక్రమంగా గోదాములు నిర్మించినట్లుగా ప్రభుత్వానికి ఐఏఎ్‌సల బృందం ప్రాథమిక నివేదిక ఇచ్చినట్లు ఓ పత్రిక కథనం ప్రచురించిందని పేర్కొన్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో అక్రమంగా నిర్మాణాలు జరిగితే అది మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు. శంకర్‌పల్లి మండలం జన్వాడలో కేటీఆర్‌ అక్రమంగా ఫాంహౌస్‌ నిర్మించిన విషయాన్ని తాను ఎన్‌జీటీలో నిరూపించానని, అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. కేటీఆర్‌ ఏ తప్పూ చేయకపోతే కోర్టుల్లో స్టే ఎందుకు తెచ్చుకుంటారని ప్రశ్నించారు. 111 జీవోకు విరుద్ధంగా నిర్మించిన ఫాంహౌస్‌ను ఎందుకు తొలగించరని నిలదీశారు. ఈ అంశంపై హైకోర్టు జడ్జి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు తెలిపారు.


ఫాంహౌ్‌సల అక్రమ నిర్మాణాలకు ప్రయత్నాలు..

కేటీఆర్‌ స్నేహితుడు శ్రీధర్‌ 111 జీవో పరిధిలో వందల ఎకరాల్లో అక్రమంగా ఫాంహౌ్‌సలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దేవరయాంజాల్‌లో సర్వేనంబర్‌ 212 నుంచి 218 వరకు ఆలయ భూముల్లో కేసీఆర్‌ బంధువు గండ్ల శ్రీనివా్‌సరావు 84 ఎకరాల్లో అక్రమంగా లేఔట్‌ చేసి, ప్లాట్లను విక్రయిస్తున్నారని వెల్లడించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను శామీర్‌పేట సబ్‌ రిజిస్ర్టార్‌ ఎలా రిజిస్ట్రేషన్‌ చేస్తారని ప్రశ్నించారు. ఆయనను వెంటనే అరెస్టు చేయాలన్నారు. అక్రమ నిర్మాణాలపై అసెంబ్లీ హౌస్‌ కమిటీ వేసి నిగ్గు తేల్చాలని, దేవరయాంజాల్‌ ఆలయ భూములపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రింటింగ్‌ ప్రెస్‌ కూడా దేవాలయ భూముల్లోనే ఉందని, ఈ స్థలాన్ని ఈటల బినామీగా చెబుతున్న పిసిరి సుధాకర్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌కు సేల్‌ డీడ్‌ చేశారని తెలిపారు.


ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డిపై జీపీఏ ఉందని వెల్లడించారు. పేద రైతుల భూములను లాక్కునేందుకే ప్రభుత్వం కమిటీ వేసిందని ఆరోపించారు. ఈ కమిటీకి కేసీఆర్‌ బంధువైన రఘునందర్‌రావు నేతృత్వం వహిస్తున్నారన్నారు. రేవంత్‌రెడ్డి వెంట టీపీసీసీ నేతలు మల్లు రవి, ఉద్దెమర్రి నర్సింహారెడ్డి ఉన్నారు. 

Updated Date - 2021-05-07T09:23:53+05:30 IST