డబ్బు, అధికార దుర్వినియోగం లేకుండా.. ఒక్క ఎన్నికైనా గెలిచి చూపు

ABN , First Publish Date - 2020-10-14T07:35:32+05:30 IST

డబ్బు, అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా న్యాయబద్ధంగా ఒక్క ఎన్నికనైనా గెలిచి చూపాలని సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

డబ్బు, అధికార దుర్వినియోగం లేకుండా.. ఒక్క ఎన్నికైనా గెలిచి చూపు

కేసీఆర్‌కు ఉత్తమ్‌ సవాల్‌ 


హైదరాబాద్‌, అక్ట్టోబరు 13(ఆంధ్రజ్యోతి): డబ్బు, అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా న్యాయబద్ధంగా ఒక్క ఎన్నికనైనా గెలిచి చూపాలని సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సవాల్‌ విసిరారు. గత ఏడేళ్లుగా అధికారంలో ఉన్నా.. ఎన్నికలను సొంతంగా ఎదుర్కొనలేని స్థితిలో టీఆర్‌ఎస్‌ ఉందన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు ప్రతి ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఉంటారని, అందుకే ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంటారన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయంపై హరీశ్‌కు నమ్మకం ఉంటే కాంగ్రెస్‌ నేతలను టీఆర్‌ఎస్‌లోకి ఎందుకు ఫిరాయించుకుంటున్నారని ప్రశ్నించారు. తమ ప్రభు త్వం ప్రజలకు నిజంగా సేవ చేస్తోందన్న నమ్మకం ఉంటే ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. తన ముఖం చూసి ఓటు వేయాలని ప్రజలను హరీశ్‌రావు కోరుతున్నారని.. అంటే సీఎం కేసీఆర్‌ ముఖం ప్రజల్లో విలువ కోల్పోయిందా? అని ప్రశ్నించారు. దుబ్బాకలో కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివా్‌సరెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారన్న ధీమా వ్యక్తం చేశారు.


అధికార పార్టీ ఎంత ప్రలోభ పెట్టినా కాంగ్రెస్‌ అభ్యర్థికే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫిరాయింపుల ద్వారా కవితకు దక్కిన విజయానికి గౌరవం లేదన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు కార్యక్రమాలు పూర్తయ్యే వరకూ కాంగ్రెస్‌ అభ్యర్థులను నిర్ణయించేది లేదని ఉత్తమ్‌ మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికలు జరిగే 6 ఉమ్మడి జిల్లాల్లోని లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో సమన్వయానికి నియమించిన బాధ్యుల సమావేశంలో మాట్లాడారు.  


ధాన్యానికి రూ.600 బోనస్‌ ఇవ్వండి

ప్రభుత్వం చెప్పినట్లే రైతులు సన్నరకం వరి వేశారిన, అయితే, పెట్టుబడికి, ధరకు పొంతనే లేదని ఉత్తమ్‌ అన్నారు. ధాన్యం మద్దతు ధరకు రూ.600 బోనస్‌ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆన్‌లైన్‌లో ఏఐసీసీ కిసాన్‌సెల్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డితో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. 


ఈవీఎంల తనిఖీ మళ్లీ చేపట్టాలి

దుబ్బాక ఉప ఎన్నికకు ఉపయోగించే ఈవీఎంల మొదటి విడత తనిఖీని మళ్లీ చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయెల్‌ను టీపీసీసీ ప్రతినిధులు మర్రి శశిధర్‌రెడ్డి, జి.నిరంజన్‌ కోరారు. 

Updated Date - 2020-10-14T07:35:32+05:30 IST