త్వరలో భారీ చేరికలు:రేవంత్‌

ABN , First Publish Date - 2022-06-25T09:48:09+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీలో చేరికల తుఫాన్‌ మొదలైందని, త్వరలోనే భారీగా చేరికలు ఉంటాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

త్వరలో భారీ చేరికలు:రేవంత్‌

మేం అధికారంలోకి రాగానే పోడు

సమస్యకు పరిష్కారం: రేవంత్‌

కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు

జెడ్పీటీసీ సభ్యుడు సహా మాజీ ప్రజాప్రతినిధుల చేరిక


హైదరాబాద్‌, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీలో చేరికల తుఫాన్‌ మొదలైందని, త్వరలోనే భారీగా చేరికలు ఉంటాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మరో 11 నెలల్లోనే రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రానుందని, ఆ వెంటనే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గాంధీభవన్‌లో శుక్ర వారం టీఆర్‌ఎస్‌ నేత, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, కరకగూడెం జెడ్పీటీసీ కాంతారావు సహా పలువురు మాజీ ప్రజాప్రతినిధులు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. రేవంత్‌రెడ్డి.. వారికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ తాటి వెంకటేశ్వర్లు, కాంతారావు చేరికతో అశ్వారావుపేటలో కాంగ్రెస్‌ మరింత బలపడనుందని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెండు ఎంపీ సీట్లు, మొత్తం అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్సే గెలుచుకోనుందని ధీమా వ్యక్తం చేశారు.


వందలాది మంది పోడు సాగుదారులపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేసులు పెట్టిందని, ఆదివాసీలను చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు. వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ అమలైతే రైతుల జీవితాలే మారిపోతాయన్నారు. త్వరలోనే అశ్వరావుపేటలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే గిరిజనులకు న్యాయం జరుగుతుందని తాటి వెంకటేశ్వర్లు అన్నారు.  

Updated Date - 2022-06-25T09:48:09+05:30 IST