ఓట్ల కోసం BJP ఆరాటం

ABN , First Publish Date - 2022-01-27T15:46:56+05:30 IST

317 జీవో కారణంగా ఉపాధ్యాయులు చావాలని.. ఆ చావుల పేరు చెప్పి ఓట్లు సంపాదించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు

ఓట్ల కోసం BJP ఆరాటం

వారు తల్చుకుంటే 317 జీవోను రద్దు చేయించొచ్చు 

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి


హైదరాబాద్/మన్సూరాబాద్‌: 317 జీవో కారణంగా ఉపాధ్యాయులు చావాలని.. ఆ చావుల పేరు చెప్పి ఓట్లు సంపాదించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై బుధవారం ఎల్‌బీనగర్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన 317 జీఓను రాష్ట్రపతి ద్వారా ఒక్క కలం పోటుతో రద్దు చేయవచ్చని, కానీ బీజేపీ, బండి సంజయ్‌ ఆ పని చేయకుండా దీక్ష డ్రామా చేయటం.. ప్రభుత్వం ఆయన్ను జైలుకు పంపడం అంతా రాజకీయమని ఆరోపించారు. వరి ధాన్యం కోనుగోలు విషయంలోనూ టీఆర్‌ఎస్‌, బీజేపీలు డ్రామాలాడాయని, రెండు పార్టీలు రైతులను మోసం చేశాయని విమర్శించారు. ఇళ్ల స్థలాలు, ఇళ్లని చెప్పి జర్నలిస్టులను కూడా కేసీఆర్‌ మోసం చేశాడన్నారు.


కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ చీడను వదిలించాలంటే మరింత కష్టపడి పని చేయాలన్నారు. రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వం చేస్తామని సోనియాగాంధీకి మాటిచ్చానన్నారు. పార్టీ సభ్యత్వం వెనుకబడటానికి కరోనా కారణమని చెబుతున్నారని... కరోనాను, కేసీఆర్‌ను రాష్ట్రం నుంచి పారదోలాల్సిన అవసరం ఉందన్నారు. ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, ఫీజు రీఎంబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ తదితర పథకాలు ప్రజలకు అందించిన ఘనత కాంగ్రెదని, సభ్యత్వ నమోదులో ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వివరించాలన్నారు. త్యాగాలు చేసిన చరిత్ర సోనియాగాంధీ కుటుంబానిదని, ఆ త్యాగాల విలువ తెలిసినందునే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-27T15:46:56+05:30 IST