విజయశాంతిని బుజ్జగించేందుకు రంగంలోకి టీపీసీసీ

ABN , First Publish Date - 2020-10-28T23:12:30+05:30 IST

పైర్ బ్రాండ్ విజయశాంతి బీజేపీలో చేరతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోన్న వేళ... ఆమెను వెనక్కు పిలిపించుకునేందుకు

విజయశాంతిని బుజ్జగించేందుకు రంగంలోకి టీపీసీసీ

హైదరాబాద్: పైర్ బ్రాండ్ విజయశాంతి బీజేపీలో చేరతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోన్న వేళ... ఆమెను వెనక్కు పిలిపించుకునేందుకు టీపీసీసీ రంగంలోకి దిగింది. కొంతకాలంగా ఆమె కాంగ్రెస్ కార్యక్రమాలకు  దూరంగా ఉంటున్నారు. అంతేకాదు ఇటీవల ఆమెతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో విజయశాంతిని బుజ్జగించేందుకు టీపీసీసీ ప్రయత్నిస్తోంది. విజయశాంతి ఇంటికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్ వెళ్లారు. రాములమ్మతో ఆయన సంప్రదింపులు చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికను టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయశాంతిని బీజేపీలోకి చేర్చుకోవాలని ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలోపే రాములమ్మను కమలం గూటిలోకి చేర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది.


గతంతో విజయశాంతి మెదక్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అందువల్ల దుబ్బాక ఎన్నికలో విజయశాంతి ప్రభావం ఉంటుందని బీజేపీ అంచానా వేస్తోంది. విజయశాంతికున్న సినీగ్లామర్, రాజకీయ అనుభవాన్ని ఉపయోగించుకోవాలని బీజేపీ తహతహలాడుతోంది. ఇప్పటికే విజయశాంతితో కిషన్‌రెడ్డి సమావేశమైన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి వెళ్లిన కిషన్‌రెడ్డి, మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు అరగంట పాటు ఈ భేటీ జరిగినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశానికి కొద్ది రోజుల కిందట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా విజయశాంతితో భేటీ అయినట్లు సమాచారం.


దుబ్బాకలో ఎన్నికల కోడ్‌కు ముందే టీఆర్‌ఎస్‌ అనేక దుష్ప్రయోగాలను ప్రారంభించిందని విజయశాంతి విమర్శిస్తున్నారు. ఇప్పుడు మరింతగా బరితెగిస్తోందన్నారు. టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ప్రజలు భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే టీఆర్‌ఎస్‌పై మండిపడుతున్న రాములమ్మ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేయకపోవడం పోవడం గమనార్హం. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అంతా దుబ్బాకలోనే మకాం వేసింది. అయితే దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారానికి విజయశాంతి వెళ్లలేదు. దీంతో కాంగ్రెస్ అలర్ట్ అయింది. రాములమ్మ బీజేపీలోకి వెళ్లకుండా ఉండేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ప్రారంభంచింది. అయితే విజయశాంతి, బీజేపీలోకి వెళ్తారా లేక.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా అనేది సందిగ్ధంలో ఉంది. 


విజయశాంతి తన రాజకీయ జీవితాన్ని బీజేపీతోనే ప్రారంభించారు. భారతీయ మహిళా మోర్చా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీ నుంచి బయటకు వచ్చి.. తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. తర్వాత ఆ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. టీఆర్‌ఎస్ నుంచి 2009 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌తో విభేదాలు రావడంతో 2014లో కాంగ్రెస్‌లో చేరారు. అయితే కాంగ్రెస్, బీజేపీలు విజయశాంతిపై గంపెడాశ పెట్టుకున్నాయి. అంతిమంగా రాములమ్మ  ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.

Updated Date - 2020-10-28T23:12:30+05:30 IST