ఇది రైతుల విజయం

ABN , First Publish Date - 2020-10-24T08:40:56+05:30 IST

రైతులు, కాంగ్రెస్‌ పార్టీ చేసిన పోరాటాల వల్లే మొక్కజొన్న కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతించిందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

ఇది రైతుల విజయం

అన్నదాతలు, కాంగ్రెస్‌ పోరాటం వల్లే మొక్కజొన్న కొనుగోళ్లకు అనుమతి: ఉత్తమ్‌


హైదరాబాద్‌/దుబ్బాక, అక్టోబరు 23 : రైతులు, కాంగ్రెస్‌ పార్టీ చేసిన పోరాటాల వల్లే మొక్కజొన్న కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతించిందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇది రైతులు, కాంగ్రెస్‌ పార్టీ విజయమని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొంత కాలంగా మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ రైతులు పోరాటం చేస్తున్నారని, వారికి మద్దతుగా కాంగ్రెస్‌ కూడా పోరాడిందని తెలిపారు. ఈ విషయమై పార్టీ పక్షాన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశామన్నారు. కాగా, రైతులను ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ సర్కారు వారిని నిండా ముంచుతోందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మునిసిపాలిటీలోని లచ్చపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పత్తి నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.


రాష్ట్రంలో సుమారు 13లక్షల ఎకరాల్లో పంట నష్టం వాట్లిల్లిందని ప్రభుత్వమే చెబుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోకపోవడం సరికాదని ఉత్తమ్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.20వేల పరిహారం అందించాలన్నారు. కాగా, వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు ఆర్థిక సాయం పంపిణీ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి డిమాండ్‌ చేశారు. సాయం అందుకున్న వారి వివరాలను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాలని శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు.  


ముందే నిర్ణయించాల్సింది: ఎంపీ అర్వింద్‌

మొక్కజొన్న పంటను కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు(రూ.1,850) కొనుగోలు చేసేందుకు సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం రైతుల విజయమని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ వ్యాఖ్యానించారు. ఇదే నిర్ణయం కొద్దిరోజుల ముందు తీసుకుని ఉంటే, రైతులకు నష్టం జరిగి ఉండేది కాదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2020-10-24T08:40:56+05:30 IST