వడ్లు కొనకుంటే కేసీఆర్‌ను ఉరి తీసుడే!

ABN , First Publish Date - 2022-02-27T08:48:11+05:30 IST

‘‘రైతన్నలూ ఆత్మహత్యలు చేసుకోకండి. ఆలోచించండి. తాగుబోతు మాటలు నమ్మకండి. వడ్లు కొనకపోతే నడి బజారులో సీఎం కేసీఆర్‌ను ఉరి తీద్దాం’’ అంటూ

వడ్లు కొనకుంటే కేసీఆర్‌ను ఉరి తీసుడే!

రైతులారా ఆత్మహత్యలు చేసుకోకండి

కేసీఆర్‌ ఫాంహౌస్‌ను ముట్డడిద్దాం

‘పాలమూరు-రంగారెడ్డి’ని పట్టించుకోని సీఎం

ప్రాజెక్టు నిర్మించబోమంటూ అఫిడవిట్‌

కేసీఆర్‌, జగన్‌ తెలంగాణను వంచించిన సన్నాసులు: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి


రంగారెడ్డి అర్బన్‌/పరిగి, ఫిబ్రవరి 26: ‘‘రైతన్నలూ ఆత్మహత్యలు చేసుకోకండి. ఆలోచించండి. తాగుబోతు మాటలు నమ్మకండి. వడ్లు కొనకపోతే నడి బజారులో సీఎం కేసీఆర్‌ను ఉరి తీద్దాం’’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతులను వరి వేయొద్దన్న కేసీఆర్‌.. ఆయన ఫాంహౌ్‌సలో మాత్రం 150 ఎకరాల్లో వరి వేశారని, ఆ ధాన్యాన్ని ఎవరు కొంటారని ప్రశ్నించారు. సీఎం ధాన్యాన్ని కొన్నవాళ్లే రైతుల ధాన్యాన్నీ కొనాలని డిమాండ్‌ చేశారు. రైతుల ధాన్యం కొనకుంటే.. కేసీఆర్‌ ఫాంహౌ్‌సను ముట్టడిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. వికారాబాద్‌ జిల్లా పరిగిలో శనివారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మన ఊరు.. మన పోరు’ బహిరంగ సభలో రేవంత్‌ పాల్గొన్నారు.   కేసీఆర్‌ అయ్య జాగీరు రాసి ఇస్తున్నాడా? కొనేవాడు కిడ్నీలు అమ్మి వడ్లు కొంటున్నాడా? అని ప్రశ్నించారు. వడ్లు కొనకుంటే సీఎం కేసీఆర్‌ను అమరవీరుల స్థూపం వద్ద ఉరివేసే రోజు వస్తుందని.. దానికి తానే ముందుంటానని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలు డిమాండ్‌తో సాధించుకున్న రాష్ట్రంలో నీళ్లు జగన్‌, నిధులు మెగా కృష్ణారెడ్డి, నియామకాలు కేసీఆర్‌ కుటుంబం తన్నుకుపోతోందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.


వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టును ప్రారంభిస్తే దాన్ని కేసీఆర్‌ బొంద పెట్టారన్నారు. జగన్‌, కేసీఆర్‌లు ప్రగతిభవన్‌లో కూర్చుని తెలంగాణ ప్రాంతాన్ని మోసం చేసిన సన్నాసులని ధ్వజమెత్తారు. ‘ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పక్కన పెట్టావ్‌? ఈ ప్రాంతంపై నీకు చిత్తశుద్ధి లేదు. దీనిపై యాదగిరిగుట్ట నరసింహుడి సన్నిధిలో ప్రమాణం చేస్తావా?’ అని సీఎం  ను ప్రశ్నించారు. పాలమూరును నిర్మించబోమంటూ ట్రైబ్యునల్‌లో అఫిడవిట్‌ సమర్పించిన కేసీఆర్‌ను ఎందుకు నమ్మాలన్నారు.


చేవెళ్లను కొండపోచమ్మలో ముంచేశాడు

చేవెళ్లను కేసీఆర్‌ కొండపొచమ్మలో ముంచేశాడని రేవంత్‌ మండిపడ్డారు. అభివృద్ధి కోసమే పార్టీ మారానని చెప్పిన సబితమ్మకు ఈ విషయంలో మాటలు రావడం లేదా అని ప్రశ్నించారు. వైఎస్సార్‌ హయాంలో చేవెళ్ల ప్రాంతాన్ని గోదావరి జలాలతో తడుపుతానని సబిత చెప్పారని.. ఆ సంగతి ఏం చేశారని అడిగారు. కేసీఆర్‌ దేశాన్ని బంగారం చేస్తానంటున్నాడని.. ఇవన్నీ తాగుబోతోని మాటలని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను రాష్ట్రం నుంచి కాదని, దేశం నుంచే తరిమేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాలమూరు- రంగారెడ్డిని పరిగికి తెస్తానని చెప్పిన సీఎం కేసీఆర్‌ ఈ ప్రాంత ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. 80 వేల పుస్తకాలు చదివానని చెప్పుకొంటున్న కేసీఆర్‌ రాజ్యాంగాన్ని చదవలేదా? అని మాజీ మంత్రి గీతారెడ్డి ప్రశ్నించారు.    కాంగ్రెస్‌ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ కల్పించిందని, అప్పుడు రాజ్యాంగం మార్చి ఇచ్చామా? అని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదన్నారు.

Updated Date - 2022-02-27T08:48:11+05:30 IST