వర్గపోరు ‘కాంగ్రెస్’ కొంప ముంచుతుందా.. Revanth Reddy తప్పులో కాలేస్తున్నారా..!

ABN , First Publish Date - 2021-11-12T17:50:55+05:30 IST

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లి జోష్‌ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వర్గపోరే కాంగ్రెస్‌ పార్టీ ఎదుగుదలకు శరాఘాతంలా మారే అవకాశం కనిపిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పనిచేసే వాళ్లకు పార్టీ పదవుల్లో..

వర్గపోరు ‘కాంగ్రెస్’ కొంప ముంచుతుందా.. Revanth Reddy తప్పులో కాలేస్తున్నారా..!

తెలంగాణ కాంగ్రెస్ లో కష్టపడి పని చేసే నేతలకు గుర్తింపు కరువవుతోందా...!  క్షేత్ర స్థాయిలో పని చేసే వాళ్ళ కన్నా...హైదరాబాద్ లో టచ్ లో ఉండే వారికే ప్రాధాన్యం ఇస్తున్నారా...! ఈ విషయం లో  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తప్పులో కాలేస్తున్నారా...! ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బలమైన నేత ప్రేమ్‌సాగర్‌రావు అల్టిమేటం దేనికి సంకేతం...! ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..


వర్గపోరు కాంగ్రెస్‌ కొంపముంచుతుందా?  

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లి  జోష్‌ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వర్గపోరే  కాంగ్రెస్‌ పార్టీ ఎదుగుదలకు శరాఘాతంలా మారే అవకాశం కనిపిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పనిచేసే వాళ్లకు పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి... తీరా బలమైన నేతలను విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేత, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్‌రావు అలక బూనారు.  తన వర్గానికి న్యాయం చేయకుంటే.. బయటకు వెళ్లి పోతామని ప్రేమ్‌ అల్టిమేటం జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.  


సాజిద్‌ఖాన్‌ కొత్తకమిటీల రాజకీయం వెనుక ఉన్నదెవరు? 

ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ పాత కమిటీలను రద్దు చేసి కొత్త కమిటీలు వేస్తున్నారు. ఇందులో ప్రేమ్‌సాగర్ వర్గానికి చెందిన వారెవరికీ పదవులు దక్కaడం లేదు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో భారీగా ఖర్చు పెడుతున్న కాంగ్రెస్ ఆశావహులు జీర్ణించుకోలేక పోతున్నారు. అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఖానాపూర్, బోథ్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో ఇష్టారాజ్యంగా కమిటీలు వేస్తూ బలమైన పాత క్యాడర్‌ను, పార్టీ ప్రజాప్రతినిధులను విస్మరిస్తున్నారని  ప్రేమ్‌ ఆరోపిస్తున్నారు. 


కమిటీలు రద్దు చేయకుంటే ప్రేమ్‌ అన్నంత పనిచేస్తారా? 

కష్ట పడుతున్న వారికి పదవులు ఇవ్వకుండా హైదరాబాద్‌లో ఉండే మహేశ్వర్ రెడ్డికి కార్యక్రమాల అమలు కమిటీ  చైర్మన్ పదవి, మాజీ మంత్రి వినోద్‌కు పీసీసీ క్రమశిక్షణ కమిటీలో పదవి, అసలు జనాలతో సంబంధం లేని వ్యక్తికి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవులు ఎలా ఇచ్చారని ప్రేమ్‌ సాగర్‌రావు ప్రశ్నిస్తున్నారు. వీలైనంత త్వరగా కమిటీలను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఉత్తర తెలంగాణ ఇందిరా కాంగ్రెస్ పేరిట కొత్త పార్టీ పెడతామని హెచ్చరించారు. 


ఇంద్రవెల్లి సభ సక్సెస్‌పై థాంక్స్‌ చెప్పలేదని ప్రేమ్‌కు కోపమొచ్చిందా? 

మొదటి నుంచి ప్రేమ్‌సాగర్‌రావు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబుతో సన్నిహితంగా ఉండే నేత.  సీనియర్ల మద్దతుకోరిన పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కీలకనేత ప్రేమ్‌సాగర్‌రావుతో భేటీ అయ్యాక ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరాను ప్రకటించారు. ఆ సభ సక్సెస్‌లో ప్రేమ్‌సాగర్‌రావు  పాత్ర ఉందని కాంగ్రెస్‌ వాదుల నమ్మకం. అయితే కాంగ్రెస్‌కు జోష్‌ ఇచ్చిన దండోరా సభలో రేవంత్‌..మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌ సాగర్‌ శ్రమను గుర్తించకపోవడం, ఆ సభ కోసం కష్టపడ్డ అనుచరులకు థాంక్స్‌ చెప్పకపోవడంతో రావు గారు అప్పటినుంచే రగిలిపోతున్నారనే టాక్‌ వస్తోంది. దీనికి తోడు ఆదిలాబాద్‌ డీసీసీ సాజిద్‌ఖాన్‌ కొత్త కమిటీలతో రెచ్చిపోతుండటంతో తనపై కుట్ర జరుగుతుందనే ఆగ్రహం ప్రేమ్‌లో కలుగుతోందని ఇన్‌సైడ్‌ టాక్‌ వస్తోంది. 


జిల్లాల నేతలను కట్టడి చేయకుంటే కాంగ్రెస్‌కు కష్టాలు తప్పవా? 

నిర్మల్‌ జిల్లాకు చెందిన మహేందర్‌రెడ్డికి, మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రేమ్‌సాగర్‌రావుకు తొలినుంచి ఉన్న వర్గపోరు కాంగ్రెస్‌ పార్టీకి చేటు చేకూర్చుతుందనే టాక్‌ వస్తోంది. జిల్లాలు, నియోజకవర్గాల్లో నేతలను కట్టడి చేయకుంటే పీసీపీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డికి ఇంటిపోరు ఎక్కువ అవుతుందని దీన్ని మొగ్గలోనే తుంచేసి పార్టీని గాడిన పెట్టాలని కాంగ్రెస్‌వాదులు కోరుకుంటున్నారు. 

Updated Date - 2021-11-12T17:50:55+05:30 IST