Inside story: రేవంత్‌ స్పీడుకు పగ్గాలేసేందుకేనా.?

ABN , First Publish Date - 2021-07-26T16:42:14+05:30 IST

ఇంతకీ కాంగ్రెస్‌లో ఈ కల్చర్ ఎందుకు? రేవంత్‌ స్పీడుకు పగ్గాలేసేందుకేనా? అందరూ తలుపులు తెరిచి ఆపరేషన్‌ ఆకర్ష్‌ మంత్రమేస్తుంటే కాంగ్రెస్‌లో గడప దగ్గర వడపోతలెందుకు?

Inside story: రేవంత్‌ స్పీడుకు పగ్గాలేసేందుకేనా.?

టీమ్‌ ఇండియాలో  కెప్టెన్‌కు ప్లేయర్స్‌ను ఎన్నుకునే స్వేచ్ఛ ఉండదు. సెలక్షన్‌ కమిటీని సాటిస్‌ఫై చేస్తేనే మైదానంలో ఆడేందుకు ఆటగాళ్లకు చోటు లభిస్తుంది. తెలంగాణ పీసీసీ కెప్టెన్‌ రేవంత్ రెడ్డి ఇష్యూలోనూ సేమ్‌ సీన్‌ రిపీట్‌ అవుతోందట. తన టీమ్‌ మెంబర్స్‌ను సెలెక్ట్‌ చేసుకునే అవకాశం  రేవంత్‌కు ఇవ్వకుండా సెఫరేట్‌గా ఓ సెలక్షన్‌ కమిటీ డిసైడ్‌ చేస్తుందట. ఇంతకీ కాంగ్రెస్‌లో ఈ కల్చర్ ఎందుకు? రేవంత్‌ స్పీడుకు పగ్గాలేసేందుకేనా? అందరూ తలుపులు తెరిచి ఆపరేషన్‌ ఆకర్ష్‌ మంత్రమేస్తుంటే కాంగ్రెస్‌లో గడప దగ్గర వడపోతలెందుకు? ఇది పార్టీకి మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? 


కాంగ్రెస్‌వాది అనిపించుకోవాలంటే అల్లాటప్పా యవ్వారం కాదంటున్నారట పార్టీలో తలపండిన సీనియర్లు. రేవంత్‌రెడ్డి రాకతో జోష్‌ పెరిగినట్లు కనిపిస్తున్న కాంగ్రెస్‌ పార్టీవైపు పాత కాపులు, ఇతర పార్టీల్లోని నేతలు తిరిగిచూస్తుంటే కండీషన్స్‌ అప్లై అని చెప్పేస్తున్నారట. పీసీసీ ప్రెసిడెంట్‌ కావడంతో ప్రమాణస్వీకారానికి ముందు నుంచే అధికార టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయశక్తిగా ఎదిగేందుకు రేవంత్‌ రెడ్డి ఆపరేషన్‌ ఆకర్ష్‌ చేపట్టారు. పలువురు పెద్దనేతలను వారి వారి ఇంటికెళ్లి  రేవంత్‌ రెడ్డి స్వయంగా కలిశారు. మరికొందరేమో ఆయనదగ్గరికి వచ్చి కండువా కప్పుకునేందుకు రెడీగా ఉన్నామని చెబుతున్నారు. 


రేవంత్‌ రెడ్డి ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తోడు సొంత నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ సీటు ఖాళీ కనిపిస్తుండటంతో ఖర్చీఫ్‌ వేసేందుకు కొద్దిమంది నేతలు ఆరాటపడుతున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోని అసంతృప్తులు, బీజేపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేని నేతలు  నేరుగా వచ్చి రేవంత్‌ను కలుస్తుండటంతో  సీనియర్లకు ఏమనిపించిందో ఏమో కాంగ్రెస్‌ కల్చర్‌ను స్టార్ట్‌ చేశారట. వ్యక్తిత్వ పరీక్షచేసిగాని పార్టీలో చేర్చుకోవద్దని కండీషన్‌ పెడుతున్నారట. కాంగ్రెస్‌ గడపలోకి వద్దామని వస్తున్నవారందరికీ తొందరపడి మాటివ్వొద్దని పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డికి గాంధీభవన్‌లో జరిగిన మీటింగ్‌లో పెద్దమనుషులు గట్టిగా చెప్పారట. 

 

పార్టీలో చేరికలకు సంబంధించి సీనియర్లు పట్టుబట్టడంతో కొత్తగా ఓ కమిటీ ఏర్పాటు చేయాల్సివచ్చిందట. కాంగ్రెస్‌ కండువా కప్పుకునేందుకు తహతహలాడుతున్నవారి గురించి వివరాలు తెలుసుకునేందుకు కొత్తగా ఏర్పాటైన కమిటీ.. స్థానిక నేతలు, జిల్లా నాయకుల అభిప్రాయాలు తీసుకుని పార్టీలో చేర్చుకోవాలా?  వద్దా?  అనే రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ ఆధారంనే పార్టీలోకి ఆహ్వానించాలా వద్దా అనేది డిసైడ్ చేస్తారు.  ఒక వేళ క‌మిటీ నో చెబితే మాత్రం వారిని పక్కన పెడతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.పార్టీలో చేరికలకు సంబంధించి నియమించిన కమిటీకి చైర్మన్‌గా ఓ మాజీ పీసీసీ బాస్‌ను నియమిస్తారనే టాక్‌ వస్తోంది.  

 



బీజేపీ నేత ఎర్ర శేఖర్‌, టీఆర్‌ఎస్‌ నేత ధర్మపురి సంజయ్‌, భూపాలపల్లి నేత గండ్ర సత్యనారాయణరావు మరికొందరు తటస్థులు రేవంత్‌ను కలిసి కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు తమ సంసిద్దత వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌లో చేరేందుకు పోటీ వాతావరణం నెలకొనడంతో ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఉన్న నేతల నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయట. దీన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీలో చేరాలనుకునేవారి వ్యక్తిత్వం, గత చరిత్ర, పార్టీకి వచ్చే లాభనష్టాలు భేరీజు వేసుకుని కొత్తవారికి అవకాశం ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేయాలని చూస్తున్నారట. ఇది ఒక రకంగా రేవంత్‌ స్పీడుకు బ్రేకులు వేసేందుకే అనే చర్చ పార్టీలో మొదలైందట. పార్టీకి పూర్వవైభవం కోసం కృషి చేస్తున్న కొత్త పీసీసీ బాస్‌కు సీనియర్లు సహకరించకుండా ఉండేందుకు తమ పట్టు నిలుపుకునేందుకే ఈ వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.  


ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తవ పరిస్థితులు తెలుసుకుని ఆపరేషన్‌ ఆకర్ష్‌మంత్రానికి పదునుపెడుతుంటే కాంగ్రెస్‌లో గడప దగ్గర వడపోతలేంటనే చర్చ జరగుతోంది. కేంద్రంలో వరుసగా రెండుసార్లు అధికారంలోనిలుపుకుని తెలంగాణలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న బీజేపీ.. పార్లమెంట్‌ ఎన్నికల నుంచే ఆపరేషన్‌ ఆకర్ష్‌ మొదలుపెట్టింది. ఈ రెండు పార్టీల్లోని అసంతృప్తులు, ఆ పార్టీలకు భవిష్యత్తు లేదని అనుకునేవారు, ఘర్‌వాపసీ కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ మాజీలు హస్తం పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలుగుదేశంలో వెలుగువెలిగి ఇతర పార్టీల్లోకి వెళ్లినవారు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు చూస్తున్నారు. వివిధ పార్టీల్లో ఉన్నవారిని శీల పరీక్ష చేసినట్లు ఆరాలు తీసి చేర్చుకుంటూ పోతామంటే పుణ్యకాలం ముగుస్తుందని అప్పట్లోగా ప్రత్యర్థి పార్టీలు జాగ్రత్త పడుతాయనే చర్చ మొదలైందట.

 

ఇన్నాళ్లు సైలెంట్‌ మోడ్‌లో ఉండి ఇప్పుడిప్పుడే కండువాలు సర్దుకుంటున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు  పార్టీలో చేరికలకు  కమిటీ ఏర్పాటు చేయడం వెనుక పెద్ద రాజకీయమే ఉందని అనుమానిస్తూ  బాధపడిపోతున్నారట. ఇక పార్టీలోకి వచ్చేవారు రేవంత్‌ను కాకుండా ముందుగా ఎందుకైనా మంచిదని లోకల్‌ లీడర్లను, జిల్లా నేతలను కలుసుకుని వారిని ఒప్పిస్తేనే కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశముంటుందని అనుకుంటున్నారట. ఇన్నాళ్లు  పార్టీకి లాభం చేయనివారు కొత్తగా వచ్చేవారు పోటీ అని భావించి వారికి అవకాశం ఇచ్చేందుకు ఒప్పుకుంటారా అనే చర్చ  ఆశావహుల మదిని తొలుస్తుందట. కాంగ్రెస్‌లో ఇక ఆ కల్చర్ మారదు అనుకుని కొత్తగా చేరేవారు మనసు మార్చుకుంటే మొదటికే మోసం వస్తుందనే చర్చ కూడా మొదలైంది. ఇది ఒక రకంగా పార్టీలోకి వచ్చేవాళ్లను అడ్డుకునేందుకు అంతకుమించి రేవంత్‌ కాళ్లకు బంధం వేసేందుకే అనే టాక్‌ వస్తోంది. 

Updated Date - 2021-07-26T16:42:14+05:30 IST