TPCC Chief రేవంత్ రెడ్డి అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-12-27T18:52:54+05:30 IST

TPCC Chief రేవంత్ రెడ్డి అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత

TPCC Chief రేవంత్ రెడ్డి అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి జూబ్లిహిల్స్‌లోని తన నివాసం నుంచి ఎర్రవల్లికి బయల్దేరుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం నుంచీ రేవంత్ నివాసంతో పాటు పలువురు కాంగ్రెస్ నేతల ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. సోమవారం తెల్లవారుజామునుంచే పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్‌లు చేశారు. అయితే.. మధ్యాహ్నం రెండు గంటలు కావస్తుండటంతో రేవంత్ ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు.


తీవ్ర ఉద్రిక్తత..

రేవంత్ బయటకు రాగానే అరెస్ట్ చేసిన పోలీసులు భారీ బందోబస్తుతో తరలించారు. ఈ క్రమంలో పోలీసులు-కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో రేవంత్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచే ఇంటి చుట్టూ పోలీసులు పహారా కాస్తూ.. ఇంటి నుంచి ఎటు వైపు నుంచి బయటికి వచ్చినా అడ్డుకుని అరెస్ట్ చేయాలని ముందస్తు వ్యూహంతో పోలీసులు ఉన్నారు. ఆయన బయటికి రాగానే అరెస్ట్ చేశారు. అయితే ఆయన్ను ఎక్కడికి తరలించారన్న విషయం మాత్రం తెలియరాలేదు.


అసలేం జరిగింది..!?

కాగా.. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ సాగు చేస్తున్న వరిని చూపిస్తానని రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. రైతులు యాసంగి వరి వేసుకోవాలని, పంటలు కొనకుంటే టీఆర్‌ఎస్‌ నేతలను చెప్పుతో కొట్టాలని పిలుపునిచ్చారు. కనీస మద్దతు ధరలను ప్రకటించిన 23 పంటలను రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు కొనాల్సిందేనని చట్టం చెబుతోందని పేర్కొన్నారు. మద్దతు ధరను ప్రకటించిన పంటలను కొనకపోతే సర్కారుపై పీడీ చట్టం కింద కేసు నమోదుచేయాలన్నారు. రైతులు వరి వేయాలని.. ప్రభుత్వం ఎందుకు కొనదో తాను చూస్తానని అన్నారు.

Updated Date - 2021-12-27T18:52:54+05:30 IST